Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!)
===============
ఎంత కాదని చెప్పినా… ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది. 2023 సంవత్సరానికి మీడియా విభాగంలో జీవనకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఒకరైన హెచ్చార్కే గారు (కొడిదెల హనుమంత రెడ్డి) ఎక్కువ మందికి కవిగా, పాత్రికేయుడిగా తెలుసు. తెలుగు కవిత్వం లోతుపాతులు పెద్దగా అర్ధంగాని నాకైతే హెచ్చార్కే జర్నలిస్టుగానే కనపడతారు. ఆయనతో నాకున్న పరిచయం చాలా తక్కువ. 1984 చివర్లో కొత్త పత్రిక ‘ఉదయం’లో హెచ్చార్కే చేరినప్పుడు ఆయనను ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని హైదరాబాద్ ‘ఉదయం’ ఆఫీసులో మొదటిసారి చూశాను. అప్పుడు నేను ట్రెయినీ సబ్ ఎడిటర్. ఎవరో మిత్రుడు పరిచయం చేస్తే కొద్డిసేపు ఆయనతో మాట్లాడాను. ఆ మాటలు కూడా ఇప్పుడు గుర్తు లేవు. హెచ్చార్కేను పరిచయం చేసిన తోటి పాత్రికేయ మిత్రుడు ఆ తర్వాత నాతో మాట్లాడుతూ, ‘సీపీఐ–ఎంఎల్ పత్రిక ‘విమోచన’ ఎడిటర్, పబ్లిషర్ గా ఉన్న హెచ్చార్కే గారు ఉదయం పత్రికలో చేరడం విశేషమే,’ అని చెప్పడం ఇంకా గుర్తుంది. నేను అదే ఏడాది పత్రిక ప్రారంభానికి మూడు రోజులు ముందు బెజవాడ ఎడిషన్ కు బదిలీ అయ్యాను. మళ్లీ ఏడాదిన్నర వరకూ హెచ్చార్కే గారిని చూడలేదు. దాదాపు పాతికేళ్లు విజయవాడకే పరిమితమైన ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్ ఎడిషన్ కోసం తీసుకున్న విజయవాడ ఉదయం యువ జర్నలిస్టుల బృందంలో నేనూ ఉన్నాను. 1986 ఏప్రిల్ నెలాఖరులో ఆంధ్రజ్యోతిలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చి సెక్రెటేరియట్ ముందున్న ఈ పత్రిక ఆఫీసుకు వెళ్లి పని పూర్తిచేశాను. అప్పుడే ఉదయం ఎడిటర్ గా రాజీనామా చేసి హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో అసోసియేట్ ఎడిటర్ గా చేరడానికి సిద్దమౌతున్న ఏబీకే ప్రసాద్ గారికి అక్కడికి దగ్గరలోని నాటి హోటల్ సరోవర్ లో ఉదయం పాత్రికేయ సిబ్బంది వీడ్కోలు కార్యక్రమం ఉందంటే ఆరోజు నేను మిత్రుడు, రచయిత ఎగుమామిడి అయోధ్యారెడ్డిగారితో కలిసి వెళుతున్నా. సరోవర్ ముందున్న సెక్రెటేరియట్ బస్ స్టాప్ దగ్గర హెచ్చార్కే గారు కనిపించగానే, ఆయనకు విషయం చెప్పి పలకరించి రెండు నిమిషాలు మాట్లాడాం. అప్పటికి కొన్ని వారాల ముందు సోమాజిగూడ ‘ఈనాడు’ దిన పత్రికలో సంపాదకీయం పేజీ చూసే సీఈబీ సభ్యుడిగా హెచ్చార్కే గారు చేరారని అప్పుడు అయోధ్యారెడ్డి గారు చెబితే తెలిసింది.