ఏలూరు, జూలై , 15 : జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేసేందుకు 50 నుండి 100 ఎకరాల భూమిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ సెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), సొంగా రోషన్ కుమార్, మద్దిపాటి వెంకటరాజు, ఎస్పీ కె. పి.ఎస్. కిషోర్, జేసి పి. ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ లను ఏటా 15 వృద్ధిరేటు లక్ష్యంతో జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, వచ్చే సమావేశం నాటికి విజన్ యాక్షన్ ప్లాన్ తుది ప్రణాలికను స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో సిద్ధంచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
రాష్ట్ర రాజధాని అమరావతి, ప్రధాన నగరం విజయవాడ ఏలూరు నగరానికి దగ్గరలో ఉండడం, జాతీయ రహదారి, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మొగ్గు చూపుతున్నారని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన మంచి వాతావరణాన్ని కల్పించి,, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు, ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకువస్తారన్నారు. పరిశ్రమల స్థాపనతో స్థానిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని, జిల్లా స్థూల ఉత్పత్తి మరింత పెరుగుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఆక్వా, ఉద్యానవనాలు రంగాలలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనతో జిల్లా స్థూల ఉత్పత్తిని రెట్టింపు చేసేలా వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో స్థూల ఉత్పత్తి 72 వేల 314 కోట్ల రూపాయలు కాగా, అందులో 60 శాతం వ్యవసాయం, 35 శాతం ఆక్వా, 19 శాతం ఉద్యానవనాలు నుండి వస్తుందన్నారు. జిలాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, క్రాప్ డైవర్షన్ పధకం కింద మరింత విస్తీర్ణంతో ఆయిల్ పామ్ సాగు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని, పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖకు అదనంగా నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఏలూరు నగరం పరిసరాలలో ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఉన్నాయని, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో సేవా రంగంలో పెద్దఎత్తున సంస్థలు ఏర్పాటుచేయవచ్చన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పాలన సాగించాలన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా , లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా మండల స్థాయిలో సమీక్ష చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. పాడి పశువుల కొనుగోలుకు రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ లోన్లపై అవగాహన కలిగించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రతీ పాడి రైతు ప్రభుత్వ పధకాలు సదివినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ఆయా గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజి వంటి ప్రాధమిక సదుపాయాల కల్పలనపై చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు 27 యూనిట్లు ఏర్పాటుచేశామని, నూజివీడులో పెద్దతరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, మిగిలినవి నిర్దేశించిన సమయంలోగా ఏర్పాటుచేస్తామన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుచేయడం జరిగిందని, మిగిలిన నియోజకవర్గాలలో త్వరలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత ఏడాదిలో 40 వేల ఎకరాలలో ప్రకృతి సాగును అమలు చేస్తున్నామని, ఆయిల్ పామ్ పంటను మరో 13 వేల హెక్టార్లలో విస్తరించనున్నామన్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని, పోలవరం.కొల్లేరు ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం ను కూడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో 3 ప్రాంతాలలో ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో ప్రాధమిక సౌకర్యాలైన రోడ్లు, గృహనిర్మాణ, త్రాగునీరుకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి కల్పిస్తున్నామని, ఉచిత గ్యాస్ పధకాన్ని నూరు శాతం అమలు చేస్తున్నామన్నారు. సౌర విద్యుత్ లో లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో 50 ప్రాంతాలలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని, వాటిలో మన రాష్ట్రానికి 3 ప్రాజెక్టులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలో కొల్లేరు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలో ఉందన్నారు. . జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామివేత్తలకు అవసరమైన భూములు అందించేందుకు, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించాలన్నారు. జిల్లాలో పండిన పంటలకు అధిక లాభాలు వచ్చేలా ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే స్థానిక రైతాంగం లాభపడుతుందన్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలలో ప్రజలకు ప్రాధమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీరు, అంతరాయం లేని, లో వోల్టేజ్ లేని విద్యుత్ ఆయా ప్రాంతాలకు అందించాలన్నారు. పోలవరం, కైకలూరు,పోలవరం, చింతలపూడి ప్రాంతాలలో రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచడంతోపాటు, విద్యార్థుల స్థాయిని అనుసరించి అదనపు తరగతి గదులు నిర్మాణం, మధ్యాహ్న భోజన పధకంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేలా చూస్తున్నామన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏలూరులో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, వారికి పరిశ్రమల ఏర్పాటులో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఉన్నాయని, కోర్స్ పూర్తిచేసుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఏలూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనా అటవీ శాఖ వారు అభ్యంతరాల కారణంగా చేపట్టలేకపోతున్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాడిపశువుల కొనుగోలుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై రైతులకు మరింత అవగాహన కలిగించాలన్నారు.
చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుచేయడం జరిగిందని, ప్రవాసాంధ్రులు పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రాధమిక అవసరాలైన రోడ్లు మంజూరుచేయాలని మంత్రి కోరారు. ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ చింతలపూడి నియోజకవర్గంలో పంచాయతీయరాజ్, రహదారులు, భవనాల శాఖకు సంబందించిన రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణాలపై బుధవారం సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలనీ కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల ద్వారాల రోడ్ల నిర్మాణం, ఐ.ఎస్. జగన్నాధపురం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతాన్ని ముంపు బారినుండి రక్షించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా కిక్కిస, తూడు, గుర్రపు డెక్క ను తొలగించాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో ఆక్వా రంగం అభివృద్ధికి అంతరాయం, లో వోల్టేజి లేని విద్యుత్ సరఫరాను అందించాలని కోరారు.
ఎస్పీ కె.పి .ఎస్. కిషోర్ మాట్లాడుతూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పరిశ్రమల స్థాపనలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. ఏలూరు జిల్లా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేని ప్రాంతమని ఇటువంటి వాతావరణంలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలస్థాపనకు ముందుకు వస్తారన్నారు. అమరావతి, విజయవాడ మన జిల్లాకు దగ్గరగా ఉండడం, ఏలూరు పరిసరాలలో ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఉండడంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్నిఏర్పాటుచేసి, ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ తో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో
డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ రాజ్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, ఎం.వి. రమణ, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ యూనిట్ల కార్యాలయాల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.