Site icon Newsminute24

Telangana: బంతి మోదీ కోర్టులో? బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం?

Telangana:

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అవినీతి కేసు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ ప్రధాన నేత హరీష్‌ రావు పాలిట ఈ కేసు గుది బండలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట్లో రేవంత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌ విచారణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని ప్రకటించగానే కేసీఆర్‌, హరీష్‌ రావు అలర్ట్‌ అయ్యారు. హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవాలనుకున్నారు. సీఐడీకి అప్పగించినా తామే తేలిగ్గా ఎదుర్కొంటామనుకున్నారు.

అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించడం బీఆర్ఎస్‌ నేతలకు పెద్ద షాక్‌గా మారింది. ఇప్పుడు బంతి ప్రధాని నరేంద్ర మోడీ కోర్టులో పడింది. సీబీఐ విచారణ ద్వారా కేసీఆర్‌, హరీష్‌ రావులపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఉపేక్షిస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రేవంత్‌ రెడ్డి తెలివిగా ఈ కేసు బాధ్యతను కేంద్రానికి అప్పగించారు. ఒకవేళ మోడీ కేసీఆర్‌ను ఉపేక్షిస్తే, బీజేపీ-బీఆర్ఎస్‌ మధ్య రహస్య అవగాహన ఉందని ప్రచారం చేసుకునే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తుంది. మరోవైపు సీబీఐ అరెస్టులు జరిగితే బీఆర్ఎస్‌కు సానుభూతి, బీజేపీపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది.

ఇక బీఆర్ఎస్‌ భవిష్యత్తు విలీనం దిశగా నడుస్తుందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని కవిత స్వయంగా బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాబట్టి కేసీఆర్‌, బీఆర్ఎస్‌ కథను మోడీ ఎలా ముగించబోతున్నారు? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Exit mobile version