జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతోంది : నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం  శరవేగంగా సాగుతోందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తల కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని..బాధిత కుటుంబానికి 90 రోజుల్లోనే బీమా సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జన సేనాని ఆశయ సాధన కోసం క్షేత్రస్థాయిలో దాదాపు 8,020 మంది వాలంటీర్లు కష్టపడటం అభినందించదగ్గ విషయమన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం.. దిగ్విజయంగా 10 రోజులు పూర్తి చేసుకుందని మనోహర్ పేర్కొన్నారు.

పుట్టెడు దుఃఖంలోనూ ఆ తండ్రి వాలంటీర్ అయ్యాడు..

పొన్నూరుకు చెందిన సాయిభరత్ అనే క్రియాశీలక కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 5 లక్షల పరిహారం చెక్ ఇవ్వడానికి తానే స్వయంగా వెళ్లినట్లు చెప్పుకొచ్చారు మనోహర్. కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చి, అండగా ఉంటామని భరోసా కల్పించినట్లు వెల్లడించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ యువకుడి తండ్రి .. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగం కావడమే కాక.. వాలంటీర్ గా మారి చాలా మంది సభ్యత్వం నమోదు చేసుకునేలా చేస్తున్నాడని కొనియాడారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ డ్రైవర్, చదువుకునే కుర్రాడు, ఓ ఉద్యోగి… ఇలా చాలా మంది వాలంటీర్లగా మారి అధ్యక్షులవారి ఆశయ సాధన కోసం పని చేస్తున్నారని.. వాళ్లంత మనందరికీ ప్రేరణగా నిలబడుతున్నారని మనోహర్ ఆశాభావం వ్యక్తంచేశారు.

Optimized by Optimole