సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల రద్దుపై తన దృష్టికి వచ్చిన  నోటీసు కారణాలను పవన్ లేవనెత్తారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు..  ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని సాకుగా చూపి నోటీసులిచ్చారని మండి పడ్డారు. అదే నిజమైతే  వృద్ధులకు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు జనసేనాని  పేర్కొన్నారు.

ఇక పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్ళు ఉన్నాయని నోటీసులో చూపారని పవన్ ఆరోపించారు. నిజంగా అన్ని ఇళ్ళు ఆమెకు ఉంటే.. ఎక్కడ ఉన్నాయో చూపించి ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ది దారులు ఆస్తి పరులైతే పింఛన్లు కోసం కార్యాలయాల చుట్టూనో.. వాలంటీర్ల చుట్టూనో ఎందుకు తిరుగుతారని? పవన్ ప్రశ్నించారు.

విద్యుత్ బిల్లు పెరిగిందనో.. ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో పింఛన్లు రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు పవన్. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటున్నాయని… అలాగే ఒకే ఇంటి నెంబర్ తో మూడు నాలుగు వాటాలు ఉంటాయన్నారు. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులను.. వితంతువులను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేనాని విజ్ఞప్తి చేశారు. పాతికేళ్ళ కిందట చనిపోయినవారు.. ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారని నోటీసుల్లో చూపించి.. వితంతు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారని బెదిరించడం సరికాదని హితువు పలికారు. పదిపదిహేనేళ్ళకు ముందు నుంచీ పింఛన్ తీసుకొంటున్న దివ్యాంగులను.. నాడు ఇచ్చిన ధ్రువపత్రాలు ఇప్పుడు చూపించాలని ఒత్తిడి చేయడం వెనక దాగున్న ఉద్దేశం ఏంటో తెలపాలని పవన్ డిమాండ్ చేశారు.

 

You May Have Missed

Optimized by Optimole