Telangana:
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల వరుస ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల తర్వాత కొంత నిరుత్సాహానికి లోనైన బిఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో మళ్లీ జోష్ నింపడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
పాదయాత్ర అనేది కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు…ప్రజలకు చేరువ చేసే బృహత్తర కార్యక్రమం.ఈ విషయం గ్రహించిన కేటీఆర్ గతంలో విస్తృతంగా జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అనుభవం ఉంది. ఇప్పుడు అదే తరహాలో, మరింత వ్యూహాత్మకంగా పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ పాదయాత్ర ద్వారా జిల్లాల నేతల మధ్య సమన్వయం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్ని జిల్లాల్లో అంతర్గత అసంతృప్తుల కుమ్ములాటలు, నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగంగా చర్చకు వచ్చాయి. వాటిని పరిష్కరించి, “ఒకే తాటి మీదకు” పార్టీని తీసుకురావడమే కేటీఆర్ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాలు, కార్యకర్తలతో నేరుగా సంభాషణలు పాదయాత్రలో కీలక భాగంగా ఉండనున్నాయి.
అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం కూడా ఈ యాత్రలో ప్రధాన అజెండాగా ఉండబోతోంది. సంక్షేమ పథకాల అమలులో జాప్యం, అభివృద్ధి పనుల నిలిచిపోవడం, రైతులు–యువత ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అంశాలను కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ” చేతల ప్రభుత్వం – మాటల ప్రభుత్వం మధ్య తేడా” అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేయడమే మరో ముఖ్య ఉద్దేశ్యం. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతు బీమా, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ విస్తరణ, పట్టణాభివృద్ధి వంటి అంశాలను ఉదాహరణలతో వివరించనున్నారు. “మేం ఏమి చేశాం? ఇప్పుడు ఏమి జరుగుతోంది?” అనే ప్రశ్నను ప్రజల మనసుల్లో బలంగా నిలిపేలా పాదయాత్ర సాగుతుందన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇక పాదయాత్ర ఉమ్మడి పాలమూరు ,రంగారెడ్డి,నల్లగొండ జిల్లాల వారిగా జరగనుంది. అయితే అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చేలా దశలవారీగా యాత్ర నిర్వహించే ఆలోచనలో పార్టీ ఉందని సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి, కేటీఆర్ పాదయాత్రను బీఆర్ఎస్ ఒక రాజకీయ కార్యక్రమంగా కాకుండా, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకెళ్లే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా చూస్తోంది. క్యాడర్‌లో ఉత్సాహం, నాయకుల్లో సమన్వయం, ప్రజల్లో విశ్వాసం ఈ మూడు అంశాలను బేస్ చేసుకుని పాదయాత్ర ఉండబోతోంది. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్, చంద్రబాబు ,బండి సంజయ్ వంటి నాయకులు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి కేటిఆర్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
_muralikrishna✍🏽✍🏽✍🏽
