నవంబర్ 20 బాలల హక్కుల రక్షణ దినోత్సవం:
=============================
రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన కారణంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్నికోల్పోయారు.విద్యతో పాటు ఆటలకు కూడా దూరమయ్యారు.కరోనా ప్రభావం పేదపిల్లలపై ఎక్కువగా పడింది.జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూఉంటాయనుకునే ఆలోచనల నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా – దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ – పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.
అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికనురూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ ఒడంబడిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది.పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.
దాదాపుగా నలభై ఐదుకోట్ల మంది పిల్లలున్న దేశం భారతదేశం, సాంఘికంగా, ఆర్ధికంగా ఎంతో ప్రగతి సాధించినా, ఇంకా చాలా మంది పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. దయనీయమైన, అమానుష మైన పరిస్ధితుల్లో బతుకుతున్న పిల్లలు లక్షల్లో ఉన్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు మరింతగా బాధలు ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం లేక, ఆశ్రయం లేక, వీధుల్లో బతుకుతూ, అనారోగ్యం పాలై అనేక రకాల లైంగిక హింసలకి గురవుతూ, వ్యభిచారం కోసం అక్రమ రవాణాకి గురవుతూ వారుపడే బాధలు అన్నీ ఇన్నీ కావు. బాల కార్మికులుగా పసితనంలోనే బాల్యం కోల్పోతున్న కొందరైతే, బాల్య వివాహం వల్ల బతుకునే కోల్పోతున్నవారు మరికొందరు. అలాంటి పిల్లలకి ప్రత్యేక రక్షణ, ఆదరణ కావాలి. వారు విద్యావంతులవ్వాలి. అకృత్యాల బారిన పడకుండా, ఎవరి దోపిడీకి గురి కాకుండా, సురక్షణతో, గౌరవంతో బతికే జీవితం వారికి కావాలి. దీనికి గాను సమాజంలో అందరి భాగస్వామ్యం అవసరం.దాదాపుగా 40శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలు బడి బయటి పిల్లలుగా మిగులుతున్నారు.పేదరికం, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, పాఠ్య ప్రణాళికలు క్లిష్టంగా ఉండటం తదితర కారణాల వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు.ముఖ్యంగా అంగన్ వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయితీ సభ్యులు, యువజన సేవకులు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా తమ సేవల్ని అందించాలి.
పెద్దలకు హక్కులు ఉన్నట్లే,పిల్లలకి హక్కులు ఉన్నాయని ఆధునిక సమాజం గుర్తించాలి. సంవత్సరాలలోపు బాలందరికీ ఈ హక్కులు వర్తిస్థాయి. సమానత్వం, కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లను చూపరాదు. బాలల ప్రయోజనాలు బాలల హక్కుల కార్యా చరణను చేపట్టినప్పుడు వారి సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి. హక్కుల అమలుకై తీర్మానాలు, గుర్తించిన హక్కుల అమలుకి శాసన పరమైన, పాలనా పరమైన కార్యక్రమాలు చేపట్టాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి వుండటం, తల్లిదండ్రలతో కలిసి జీవించడం బాలల హక్కు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, వ్యభిచార వృత్తి లో దించడం, జీతాలకు పెట్టడం నేరం. బాలలు వారి అభిప్రాయాలను పాటలు, బొమ్మలు, ఆటలు, రచనల ద్వారా వ్యక్తం చేయవచ్చు. బాలలు తమకు నచ్చిన మతాన్ని కలిగివుండవచ్చు, తమ వృద్ధికై సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
బాలలకు విజ్ఞానాన్ని అందిచడానికి ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఆబాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా,దౌర్జన్యం చేసినా, వేధించినా నేరం. బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్ధులుగా మారిన బాలలకు మానవతతో సాయం చేయాలి. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన వారి వృద్థికి, వారిలో ఆత్మ విశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.ఇందు కోసం విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు,తగినంత మంది బోధనా సిబ్బంది కూడా ఉండాలి.బోధన పిల్లలలో ఆసక్తి పెంచేదిగా ఉండాలి. అందుకు ఉపాధ్యాయులకు తగిన వెసులుబాటు కల్పించాలి.అప్పుడే బాలల హక్కులు రక్షించబడతాయి.
========================
యం.రాం ప్రదీప్
9492712836
తిరువూరు