గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

Nancharaiah Merugumala :

…………………………………………………………………………………

భారత్‌ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్‌ బయల్దేరారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్‌ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్‌ మెహతా, చంద్రశేఖర్, రామకృష్ణ హెగ్డేల ‘దాడీ’ మాదిరిగా మారేలా ఉంది.
ఇక సొంత గడ్డాన్ని సొంతంగా ట్రిమ్‌ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందని రాహుల్‌ భయ్యాకు ఎవరైనా చెబితే బాగుండు. అది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నేత మాధవ్‌ ‘ఎంఎస్‌’ గోల్వాల్కర్‌ గడ్డంలా బారుగా, పొడగ్గా పెరగకుండా ఉంటే చూడ ముచ్చటగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులైన మేధావులు అంటున్నారు. ఒకవేళ జోడో యాత్ర జీరో ఫలితాలు సాధించినాగాని రాహుల్‌ తన గడ్డంపై రేజర్‌ పడకుండా డచ్‌ కంపెనీ ఫిలిప్స్‌ ట్రిమర్‌ వాడితేనే శ్రేయస్కరం. పెళ్లయిన పాతికేళ్లకు గెడ్డాలు, మీసాలు పెంచే బదులు ఐదు పదులు దాటినా వివాహం గురించి ఆలోచించని రాహుల్‌ వంటి నేతలు మీసం సహా గడ్డం పెంచితేనే– మెజారిటీ హిందువులతో పాటు అత్యధిక భారతీయులు ఆయన వెంట నడుస్తారు. చేయి గుర్తుకు ఓటేస్తారు.
భారత ప్రధానమంత్రి పదవి అధిష్ఠించిన మహానాయకుల్లో మొదటి గడ్డం బలియా (యూపీ)కి చెందిన చంద్రశేఖర్‌ ది. ఆయన కూడా చాలా ఏళ్లు గెడ్డంతోనే కాంగ్రెస్‌లో ‘యంగ్‌ టర్క్‌’ గానే కొనసాగారు. గడ్డం దాదాపు పూర్తిగా తెల్లబడ్డాకే ఆయన 1990 చివర్లో రాహుల్‌ భయ్యా అయ్య రాజీవ్‌ మద్దతుతో ప్రధాని అయ్యారు. 222 రోజులు మాత్రమే పదవిలో ఉండి దిగిపోయారు. మళ్లీ 2004లో కాంగ్రెస్‌ తరఫున ప్రధాని పీఠమెక్కిన మన్మోహన్‌ సింగ్‌ కోహ్లీ గడ్డం జీవితాంతం ఉంచుకునే సాంప్రదాయం పాటించే సిక్కు. పదేళ్లు ఆయన తెల్ల గడ్డంతోనే దేశాన్ని ‘చక్కగా’ పాలించారు. బీజేపీ నేత నరేంద్ర మోదీ కూడా గడ్డం, మీసాలు, ముఖం మీద మిగిలిన చోట్ల ఉన్న వెంట్రుకలన్నీ పూర్తిగా తెల్లబడ్డాకే ఈ డాక్టర్‌ సాహబ్‌ తర్వాత ప్రధాని పదవి అందుకున్నారు.
ఇలా 2004 నుంచీ అంటే గత 18 ఏళ్లుగా తెల్ల గెడ్డాలే రాజ్యమేలుతున్నాయి. రాహుల్‌ గాంధీ పైపెదవిపై ఉన్న మీసాలు కూడా పూర్తిగా నెరిసిపోయాక ప్రధాన మంత్రి పదవి ఖాయంగా ఆయన చేతికి చిక్కుతుందని మనం ధీమాగా ఉండొచ్చు. అందుకేనేమో రాహుల్‌ భయ్యా ముఖంపై సెప్టెంబర్‌ మొదటి వారం నుంచీ పెరుగుతున్న గడ్డం ఆయనను తప్పకుండా ప్రధానిని చేస్తుందని కొందరు నమ్ముతున్నారు. ఈ కారణంగానే రాహుల్‌ మహారాష్ట్ర యాత్రలో గడ్డం ఉన్న గురూజీ ఎంఎస్‌ గోల్వాల్కర్‌ జోలికి పోకుండా గడ్డం లేని మరాఠీ బ్రాహ్మణ హిందూ నాస్తిక మేధావి వినాయక్‌ డీ సావర్కర్‌ పైనా తన బాణాలు ఇసురుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌ గాంధీని కలిసిన కొందరు మార్క్సిస్టు మేధావులకు ఆయనలో కారల్‌ మార్క్స్‌ దర్శనమిచ్చాడట.