INC:
లక్ష్యం ఛేదించాలంటే బాణం గురి తప్పొద్దు. కాంగ్రెస్ గురి తరచూ తప్పుతోంది. గురి తప్పటమే కాక, ఒకోసారి బాణం ఎంపికా సరిగా ఉండట్లేదు. దేశంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ గట్టెక్కి, బట్టకట్టేలా ప్రాణబిక్ష పెట్టింది తెలుగునేల! అది 1977అయినా, 1980, 1989, 2004 ఏదయినా.. ఇక్కడ అపురూపంగా లభించిన మద్దతుతోనే పార్టీ మనగలిగింది, ఎంతో కొంత పూర్వవైభవం కాంగ్రెస్ సంతరించుకోగలిగింది. ఇటీవల, ముఖ్యంగా రాష్ట్రవిభజనతో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా బాగా తెలుసు! లోక్సభ ఎన్నికల్లో రెండు వరస ఓటములతో కుదేలయి ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టున్నపుడు…. పది నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం పార్టీకే కొత్త స్థయిర్యాన్నిచ్చింది. కానీ, ఏపీ పరిస్థితేంటి? నేటికీ నేల చూపులే! బాణం ఎంపిక ఓ తప్పయితే, ఆ బాణమూ గురితప్పుతున్న పరిస్థితి!
స్వాతంత్య్రానంతరం దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ కాంగ్రెస్. అంతటి చరిత్ర కలిగిన పార్టీ తరచూ చేస్తున్న స్వీయ తప్పిదాల వల్ల తానే భారీగా నష్టపోతోంది. రాజకీయంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అది కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి నుంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే వరకు ఏ అంశమైనా కావొచ్చు. అస్సాంలో హిమంత బిశ్వశర్మ నుంచి ఏపీలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని డీల్ చేయడం వరకు ఏ వ్యవహారమైనా కావొచ్చు! ప్రత్యర్థి ప్రతికూలతల (నెగెటివ్) వల్ల ప్రజలు తమకు సానుకూలంగా ఉన్నపుడు కూడా… రాజకీయంగా దాన్ని లబ్దిగా మలచుకోలేని స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంటోంది. దానికి రెండు తెలుగు రాష్ట్రాలు సాక్షీభూతంగా నిలుస్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు, ఉద్యమ పార్టీ – తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేసీఆర్ మాట ఇచ్చినట్టు ‘కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీన’ ప్రక్రియను, సరిగా నిర్వహించలేకే కాంగ్రెస్ ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఫలితం, పదేళ్లు అధికారానికి దూరమైంది. 2018లోనే తెలంగాలో కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, ఆఖరు నిమిషంలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పెట్టుకున్న పొత్తు బెడిసి మొత్తం వ్యవహారాన్నే అది తలకిందులు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చనువున్నప్పటికీ, 2023లో ఆ తప్పు చేయకపోవడం వల్ల… పరిస్థితులు అనుకూలించి పార్టీ తెలంగాణలో గెలుపుబాట పట్టింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ ప్రయోగాలన్నీ బెడిసికొడుతున్నాయి. 2009 తర్వాతి పరిణామాల్లో యువనాయకుడు జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్ దూరం చేసుకోవడం నుంచి నిన్నా, ఇవాళ పార్టీని ఏపీలో పునరుద్దరించే చర్యలు వికటించడం వరకు…. అన్నీ అపప్రయోగాలే! ఎప్పుడూ నిరాశాజనక ఫలితాలే!
లక్ష్యం ఎక్కడ? గురి ఎటు?
దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్.షర్మిలకు, 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ-ఏపీసీసీ అధ్యక్ష పీఠాన్ని నాయకత్వం అప్పగించింది. అంతకు తగినంత ముందే, తెలంగాణలో మనుగడలో ఉన్న తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ)ని కాంగ్రెస్లో ఆమె విలీనం చేశారు. బాధ్యతలు చేపట్టిన కొత్తలో… ఏపీ కాంగ్రెస్కు ఆమె నూతన జవసత్వాలు కల్పిస్తారని, రాజకీయంగా ఎక్కడో ఉన్నతస్థితికి తీసుకువెళతారనే ఆశాభావం పార్టీలో-బయట వ్యక్తమైంది. జనాన్ని మెప్పించగలిగే వివరణ (న్యరెటివ్) కూడా అప్పట్లో పార్టీకి ఉండింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న మూడు పార్టీలు వైఎస్సార్సీపీ (2019- 2024), తెలుగుదేశం (2014- 19), బీజేపీ (2014- 24) పదేళ్లు ఏపీకి ద్రోహం చేశాయనే వాదన ప్రజలను ఆకట్టుకుంది. విభజన చట్టం- హామీల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో మాటకు నిలబడని ఆ ముగ్గురూ దోషులేనని విమర్శించే స్థితి, స్థానం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉండింది. అది సరిగా వాడుకోకుండా, కుటుంబపరమైన వివాదాల కారణంగా…. తన అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని షర్మిల విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార సరళి దారితప్పింది. ముఖ్యంగా వారి బాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యోదంతం, నిందితుల్ని స్వయంగా సీఎం కాపాడుతుండటం… వంటి అంశాలకే ప్రచారంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో లక్ష్యం వికటించింది. ఇదేదో, పాలకపక్షం రాజకీయ స్థితిని దెబ్బతీసేలా… తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి మేలు చేసే వ్యవహారంలా ఉందనే భావన తట్టినపుడు, ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఆలోచించడం మానివేశారు. అందుకే, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ దక్కకపోగా ఓటు శాతంలోనూ పెద్దగా వృద్ది లేకుండా పోయింది. పరిమితంగా కొన్ని స్థానాల్లో ఓటువాటా కొంత పెరిగినప్పటికీ అది ఆయా నాయకుల వ్యక్తిగత పలుకుబడి కారణంగానే లభించింది తప్ప పార్టీ స్థూలంగా ఎదిగిన పరిస్థితి కాదు.2019లో కాంగ్రెస్కు 1.17 శాతం ఓటు వాటా లభిస్తే, 2024లో వచ్చింది 1.72 శాతం (0.55 మెరుగు). షర్మిల స్వయంగా పోటీ చేసిన కడప లోక్సభ స్థానాంలో ఆమెకు 9.97 శాతం ఓటు లభించింది. ఇక్కడ వైసీపీ నికరంగా 18 శాతం ఓటు వాటా కోల్పోగా, టీడీపీ 8.24 శాతం మెరుగుపరుచుకుంది.
వీథుల్లోకి వచ్చిన ఇంటి గోడు..
వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే కోట్ల మంది తెలుగువారి మనస్సు చివుక్కుమనిపించిన పరిణామం ఇటీవలి కాలంలో ఏదైనా ఉందీ అంటే, అది ఆయన సంతానం ఆస్తి తగాదా! అదీ, వీధుల్లోకి వచ్చి గొడవ పడటం! రాష్ట్ర ప్రజానీకానికి ఏ మాత్రం సంబంధం లేని, పూర్తిగా అది వారి కుటుంబపరమైన వ్యక్తిగత వ్యవహారం. గుట్టుగా అనుకుంటే, వారిలో వారో, ఇద్దరికీ ఆమోదమైన పెద్దమనుషుల సమక్షంలోనో తేల్చుకోవచ్చు. కాదంటే, ఆస్తి తగాదాలు-పంపకాల విషయంలో ఇప్పటికే స్థిరీకృతమై ఉన్న న్యాయ అంశాలు, సూత్రాల ఆధారంగా ఏ ట్రిబునల్లోనో, న్యాయస్థానంలోనో పరస్పరం తేల్చుకోవచ్చు. ప్రజాక్షేత్రానికి, పార్టీ వేదికలకు…. ఈ వివాదంతో ఏం సంబంధం? వారి తల్లి, వైఎస్ఆర్ సతీమణి వై.ఎస్.విజయమ్మ ఈ విషయంలో ఓ బహిరంగ లేఖ విడుదల చేసినప్పటికీ, అందులో ప్రజలకు ఆమె ఏమి వినతి చేయ దలచుకున్నారు? దానికి స్పందనగా, పౌరులు నిర్వహించాల్సిన బాధ్యత ఏమిటో… అందులో స్పష్టత కొరవడింది. అది, వివాదాన్ని మరింత జఠిలం చేసేదిగా ఉందే తప్ప పరిష్కారం దిశలో పడిన అడుగు కాదు. రాజకీయ పార్టీల కొమ్ముకాచే ఆశ్రిత మీడియా కూడా ఈ అంశానికి అనుచిత ప్రాధాన్యత ఇచ్చినట్టు సగటు పౌరులు భావిస్తున్నారు.
వ్యక్తిగత అంశాన్ని, పార్టీ కార్యకలాపాలను వేరుపరచాలని ఏదో దశలో పార్టీ నాయకత్వం ఆమెకు సూచించి ఉండాల్సింది. పార్టీ విషయాలో, ప్రజాసంబంధ అంశాలో విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు, చివర ప్రశ్నోత్తరాల సమయంలోనైనా తప్పనిసరిగా ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని ఆమెకూ తెలుసు. వ్యక్తిగత గోప్యతకో, సంయమనానికో ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి…. ఉద్దేశ్యపూర్వకంగా ఈ అంశాన్ని జనంలోకి తెచ్చి, తెరకెక్కిచ్చినట్టు స్పష్టమౌతోంది. ఈ పరిణామాలు మిగతా ఇతరేతరులెవరికన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైనవి. రాజకీయ పార్టీగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి, కాకపోవడానికి ఈ అంశాలు ఏ మేర ప్రభావం చూపుతాయన్నది పార్టీ చూసుకోవాల్సిన అంశమే!
వ్యవహారదక్షత లేకే!
ఏమి సాధించే క్రమంలో మరేం కోల్పోతున్నాం? అనేది రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. గడచిన ఒకట్రండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా మంది ముఖ్యనాయకుల్ని వ్యవహార దక్షత లేక కోల్పోయింది. ముఖ్యంగా సమర్థ యువనాయకత్వాన్ని దూరం చేసుకొని రాజకీయంగా నష్టపోయింది. హిమంత బిశ్వశర్మ (అస్సాం), జ్యోతిరాధిత్య సింధియా (మధ్యప్రదేశ్), జగన్మోహన్రెడ్డి (ఆంధ్రప్రదేశ్), జితిన్ ప్రసాద్ (ఉత్తర్ప్రదేశ్) వంటి వారు ఈ కోవలోకే వస్తారు. సచిన్ పైలెట్ (రాజస్తాన్) వంటి నాయకుల అవకాశాలను ఇంకా వృద్దతరం నాయకులే కొల్లగొట్టడం, ఆధిపత్యం చెలాయించడం, దాన్ని పార్టీ నాయకత్వం అనుమతించడం… వంటివి స్థూలంగా పార్టీకి, దీర్ఘకాలంలో నష్టం కలిగించే అంశాలే! ఒకప్పుడు కాంగ్రెస్ను కటువుగా విబేధించి పార్టీ నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్), శరద్పవార్ (మహారాష్ట్ర) వంటి నేతలు, వారి పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్కు మిత్రపక్షాలే! శాశ్వత మిత్రులు- శత్రువులు ఉండరనే రాజకీయ నానుడి నిజమైతే, ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పంథా వ్యూహాత్మకంగా ఉండాలి. 2014 లో ఓడిపోయి 67 స్థానాలకు పరిమితమైనపుడు గానీ, 2024లో 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినపుడు గానీ, జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ కి 40 శాతానికి పైబడే ఓటు వాటా ఉంది. అదంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే! టీడీపీ వైపు వెళ్లడానికి ససేమిరా… అనే వర్గాలను తిరిగి పార్టీ వైపు తెచ్చుకునే వ్యూహం కాంగ్రెస్కు ఉండాలనేది పార్టీ శ్రేణుల ఆకాంక్ష!
2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన నందిగామ ఉప ఎన్నిక ఇందుకో ఉదాహరణ. అప్పుడు టీడీపీ నుంచి ఎన్నికైన తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారానికి ముందే చనిపోయారు. పోటీ పెట్టద్దని నిర్ణయించడమే కాకుండా టీడీపీ అభ్యర్థికే ఓటు వేయండని వైసీపీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చినా…. కాంగ్రెస్ అభ్యర్థికి పాతికవేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. అంతకు ముందు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన ఓట్లు రెండు వేల లోపే! రాష్ట్రాల్లో పార్టీలోకో, మిత్రులుగానో…. ఎవరిని చేరదీయాలి, ఎవరిని దూరం పెట్టాలో కాంగ్రెస్ వంటి జాతీయ ప్రధాన స్రవంతి పార్టీకి నిర్దిష్ట వ్యూహం ఉండాలి. అది సవ్యంగా అమలు జరగాలి. రాజకీయ పోరాటాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించాలంటే బాణం సరైంది కావాలి, గురి సరిగా ఉండాలి.