Site icon Newsminute24

BRS: అవినీతి అనకొండలు హరీశ్–సంతోష్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు “అవినీతి అనకొండలు” అంటూ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కు తిండి, డబ్బుల మీద ధ్యాస ఉండదు. కానీ ఆయన పక్కన ఉన్న వారివల్లే అవినీతి మరక అంటింది. నేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి రావడానికి కారణం హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి” అని కవిత ఆరోపించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ పేరు జపమే చేస్తోందని ఆమె మండిపడ్డారు. “వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆరు నెలల ముందే యూరియా కొరతపై అలెర్ట్ చేసేవారు. కాలేశ్వరం తరగని ఆస్తి. అందులో మేడిగడ్డ ఒక చిన్న భాగమే. ఆ ప్రాజెక్టును 200 ఏళ్లపాటు ప్రజలు గుర్తు చేసుకుంటారు” అని కవిత అన్నారు.

తనపై కుట్రలు జరిగినా భరించానని కవిత వెల్లడించారు. “హరీశ్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. నాపై కుట్రలు చేశారు. నేను మాత్రం ఇండిపెండెంట్‌గా ఉంటాను. నాది కేసీఆర్ బ్లడ్. నా వెనుక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా” అని ఆమె హెచ్చరించారు.

కేసీఆర్ పై సీబీఐ విచారణ పరిస్థితి రావడం బాధాకరమని కవిత వ్యాఖ్యానించారు. “పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? కానీ ఆ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు” అని నమ్మకంగా చెప్పారు.

అలాగే బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ వైఖరిని కవిత తప్పుపట్టారు. “బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? బీహార్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తాము” అని ఆమె ప్రకటించారు.

“రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్‌లో ఫోటో రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పి.సి. ఘోష్ కమిషన్ పేరుతో టైమ్ పాస్ చేస్తోంది” అని కవిత ధ్వజమెత్తారు.

Exit mobile version