మోదీ తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

Nancharaiah merugumala senior journalist:

” పండిత నెహ్రూ నాడు హిందూ స్త్రీలకు హక్కులు కల్పిస్తే–మోదీ జీ ముమ్మారు తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు నేడు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌” 

‘‘కొన్ని యుగాల పాటు హిందూ మహిళలకు లేకుండా చేసిన కొన్ని హక్కులను వారికి నేను తిరిగి వచ్చేలా చేశాను. ఇదే నా జీవితంలో అతి గొప్ప విజయం. అలాగే, నా జీవితంలో అతి పెద్ద ఆశాభంగం ఏమంటే–నా ముస్లిం అక్కచెల్లెళ్లకు అదే మేలు నేను చేయలేకపోవడం,’’ అని భారత తొలి కాంగ్రెస్‌ ప్రధాని పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 1950ల చివర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయం కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ‘ద ప్రింట్‌’ వెబ్‌ సైట్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నెహ్రూ గారి మనవడు రాజీవ్‌ గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి, ముస్లిం మహిళ షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును తలకిందులు చేసే చట్టం చేసినప్పుడు అందుకు నిరసనగా ఆరిఫ్‌ రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ముస్లిం స్త్రీలకు కీడుచేస్తున్న ముమ్మారు తలాక్‌ ను రద్దుచేసిన కారణంగా భవిష్యత్తులో ముస్లిం మహిళలు కూడా మోదీని మెచ్చుకుంటారని ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పుట్టిపెరిగిన కేరళ గవర్నర్‌ అన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం గురించి ఆయన ప్రస్తావించారు. ముస్లిం మగాళ్లు హడావుడిగా ‘తలాక్, తలాక్, తలాక్‌’ అంటూ క్షణాల మీద భార్యలను సాగనంపడాన్ని శిక్షార్హ నేరంగా చేయడం మోదీ సర్కారు చేసిన గొప్ప పని అని ఖాన్‌ ప్రశంసించారు.

‘‘హిందూ స్త్రీలకు నెహ్రూ జీ ఎనలేని మేలు చేశారు. ముస్లిం అక్కచెల్లెళ్లకు ఎవరు ఇంతటి మేలు చేశారు? నరేంద్ర మోదీయే. ముస్లిం స్త్రీలకు అందించిన చేయూతకు–పండిత నెహ్రూ బతికి ఉంటే సంతోషపడేవారా? లేక బాధపడేవారా? దురదృష్టవశాత్తూ, నెహ్రూ జీ వారసులమని చెప్పుకునే వారికి ఈ విషయం అర్ధంకావడం లేదు. అంతేకాదు, కేరళ కమ్యూనిస్టు తొలి ముఖ్యమంత్రి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ జీ సిద్ధాంతాలకు, ఆదర్శాలను వారసులమని చెప్పేవారు (కమ్యూనిస్టులు) కూడా ఆయన అడుగుజాడల్లో నడవడం లేదు. ఆయన ఆలోచనా «ధోరణికి దూరమయ్యారు,’’ అని ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఈ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తంచేశారు. ‘‘ ముస్లిం ఛాందసవాదుల మాటలు విని రాజీవ్‌ గాంధీ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ పేరుతో వారి హక్కులు హరించే చట్టం చేసినప్పుడు తాను రాజీనామా చేశానని, అప్పుడు 1986లో తనకు నైతిక, రాజకీయ మద్దతు ఇచ్చింది నంబూద్రిపాద్‌ గారేనని కూడా ఆరిఫ్‌ ఖాన్‌ గుర్తుచేశారు. ‘‘13వ శతాబ్దంలో మొదలైన ముమ్మారు తలాక్‌ (వెంటనే అమల్లోకి వచ్చే) దురాచారాన్ని నిర్మూలించడానికి 800 ఏళ్ల పట్టింది. అయితే, రాజకీయ కారణాల వల్ల నేడు ముస్లిం స్త్రీలు ఈ చర్యపై పెద్దగా మాట్లాడడం లేదు కాని, భావి తరాలకు చెందిన ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోదీ జీ పేరును ఎంతో కృతజ్ఞతాభావంతో గుర్తుపెట్టుకుంటారు, ’’ అని కేరళ గవర్నర్‌ ఖాన్‌ చెప్పారు. విడాకులు ఇచ్చిన ముస్లిం మహిళలకు సంబంధించిన షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును రద్దుచేసే చట్టాన్ని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం చేసినప్పటి నుంచీ ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరకాలేదు సరికదా హిందువులు ఈ పార్టీకి దూరమయ్యారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole