మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ
మాదకద్రవ్యాలకట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. మాదకద్రవ్యాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారిద్దరి భేటీ కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఇక ఈ అంశంపై … సాక్షి దినపత్రికలో సడలని పట్టు అన్న శీర్షికతో వార్తా కథనం రాశారని ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లపాటు సడలని పట్టు అంటూ కాలక్షేపం చేస్తారని.. అసలు అర్థం ఏంటో చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు.
టిడిపి, జనసేన ఎన్నికలకు కలిసి వెళ్లే ఛాన్స్…
తెలుగుదేశం పార్టీ, జనసేన రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించినట్లు సాక్షి , ఆంధ్రప్రభ దినపత్రికలో కథనాలు వచ్చినట్లు రఘురామకృష్ణ ప్రస్తావించారు. ఒకవేళ రెండు పార్టీలతో కలిసి బిజేపి వెళ్తే నష్టమని కూడా జగన్ సూచించినట్లు వార్త కథనాలు అల్లారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మరింత అప్పు కావాలని ప్రధానిని అడగగా.. నిబంధనల ప్రకారమే వెళ్తామని చెప్పడం జరిగిందన్నారు. అయితే వచ్చే ఏడాది ఇచ్చే అప్పు కూడా, ఇప్పుడే అడ్వాన్స్ గా ఇవ్వాలని జగన్ కోరగా … పరిమితులకు లోబడే అప్పును ఇవ్వగలమని ప్రధాని తెగేసి తేల్చిచెప్పారని రఘురామ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే పెన్షన్ తీసుకునే వారిపై ఆడిట్ జరిపిస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం.. కార్పొరేషన్ అప్పులపై ఆడిట్ కు అవసరమైన కాగితాలను ఎందుకు సమర్పించడం లేదని రఘురామ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసిన.. జగన్మోహన్ రెడ్డి బృందం సభ్యులు ఋషికొండలో తామేమి నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చినట్లు తెలిసిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం ఉందన్న ఆయన.. దమ్మిడి పని చేయకపోయినా ఊరుకుంటున్న రాయలసీమ వాసులు మనసు ఎంతో గొప్పదన్నారు. లక్షలు కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న, ఇప్పటివరకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతిని ఎందుకు సాధించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానిని 12 మెడికల్ కాలేజీ ల కోసం అనుమతి ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి ..ముందుగానే ఎలా శంకుస్థాపన చేశారని రఘురామ ప్రశ్నించారు.