బీసీలను 56 సంఘాలుగా విడదీసి వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్పోరేషన్లు కేవలం స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవలుపడడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని ఎద్దేవ చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసంపై ప్రతి బీసీ సోదరుడు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుల గణన, తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులను కోరారు. జనసేన పార్టీ ఎప్పటికీ బీసీలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బలహీన వర్గాల సాధికారతకు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని.. బీసీల అభ్యున్నతి కోసం గత ఎన్నికల మేనిఫెస్టోలో పలు అంశాలు చేర్చామని మనోహర్ స్పష్టం చేశారు.
కాగా సమాజంలో బలహీన వర్గాలకు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన ఆవశ్యకతను, వారికి సమాన హక్కులు కలిగేలా ప్రయత్నించాలన్న విషయాలను జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పదేపదే వివరిస్తూనే ఉంటారన్నారు మనోహర్. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని.. అభివృద్ధి చెందేలా ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీ చేనేత, మత్స్యకార వికాస విభాగాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల సందర్భంలో మాత్రమే కాకుండా ప్రతి కార్యక్రమంలో ఆ విభాగాలకు ప్రత్యేక కల్పించి వారిలో ఒక చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని నాదెండ్ల పేర్కొన్నారు.