ఉత్తరాంధ్రలో యువ నాయకత్వం అవసరముంది: నాదెండ్ల
ఉత్తరాంధ్ర రెండు కుటుంబాల సొత్తు కాదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇక్కడి యువ నాయకత్వాన్ని కొన్ని కుటుంబాలు, వ్యక్తులు తొక్కిపట్టి పెత్తనం చెలాయించారని తెలిపారు. సహజ సంపద దోపిడీ చేసి..కావాలనే యువ నాయకత్వాన్ని చంపేశారన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవస్థలో యువ నాయకత్వం అవసరముందన్నారు. సమస్యలపై పోరాడే గుణం, ధైర్యంగా గలమైతే.. ప్రతి సమస్య మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న యువ నాయకులకు ఇక్కడ కొదవ లేదని.. అలాంటి నాయకత్వం వెలికి తీయడమే జనసేన పార్టీ లక్ష్యమని నాదెండ్ల స్పష్టం చేశారు.
ఇక జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరిగే యువశక్తి కార్యక్రమానికి ఉత్తరాంధ్ర యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు మనోహర్. ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న యువత తమ మనోభావాలను.. విజయ గాధలను.. ప్రభుత్వ తీరును వివరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రా ప్రాంతంలో యువనాయకత్వానికి బాధ్యతలు ఎలా అప్పగించాలి..? చైతన్యం కలిగిన యువతకు ఈ ప్రాంత నాయకత్వ పగ్గాలు ఎలా ఇవ్వాలనేదాని పైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడింది యువతరమేనని గుర్తు చేశారు. కేవలం సమస్యలపై నిలబడటమే కాదు పోరాడి వాటికి ఓ పరిష్కార మార్గం చూపడమే జనసేన పార్టీ ధ్యేయమని..అందుకనుగుణంగా యువతను తగిన విధంగా సన్నద్ధం చేస్తామని మనోహర్ పేర్కొన్నారు.