యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల ఎక్కువగా సామాజిక మాధ్యమాలకే పరిమితం అవుతోందని.. ఇది దేశానికి మంచిది కాదన్నారు. యువతీ యువకులు ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాల గురించి యువత పట్టించుకోక పొతే అసమర్థ నాయకుల నియంతృత్వం, ఆధిపత్య ధోరణి మూలానా.. భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాగబాబు తేల్చిచెప్పారు.
అన్ని కులాల కలయిక జనసేన..
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంటుందని చాలా రాజకీయ పార్టీలు మాటల్లోనే చెప్తాయి.. కానీ యువత కోసం రాజకీయ వేదిక ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కి చెందుతుందన్నారు నాగబాబు. జనసేన కుటుంబ పార్టీ కాదని… కుల పార్టీ అంతకంటే కాదని కుండ బద్దలు కొట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే పార్టీ జనసేన మాత్రమేనని నాగబాబు స్పష్టం చేశారు.