సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో గత మూడున్నర దశాబ్దాలుగా వరుసగా రెండోసారి ఏ పార్టీ అధికారం చేపట్టలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నారు. ఈ ప్రభుత్వ మార్పు సంప్రదాయం అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటకలో చరిత్రను తిరగరాసి బిజెపి దక్షిణాన కూడా బలోపేతం అవుతుందని నిరూపించాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. ఇక్కడ విజయం సాధిస్తే ముఖ్యంగా తెలంగాణలో అధికారంపై దృష్టి కేంద్రీకరించిన ఆ పార్టీకి మానసిక బలం చేకూరుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ప్రభావం నామమాత్రంగా ఉన్నా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో ఆశించిన మేరకు అధిక సీట్లు పొందడానికి అవకాశం ఉంటుందని బిజెపి అధిష్టానం భావిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని ‘డబుల్‌ ఇంజిన్‌’ నినాదాన్ని బిజెపి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. అయితే రాష్ట్రంలో బిజెపి అనేక ఒడిదొడుకులతో పలు సవాళ్లను ఎదుర్కొంటుంది.

ముఖ్యమంత్రి మార్పు మేలు చేకూరుస్తుందా..?

            2018 అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను బిజెపి 104 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అవసరమైన మెజార్టీని పొందలేకపోయింది. అధికార కాంగ్రెస్‌ 80 స్థానాలకే పరిమితం కాగా 37 స్థానాలు సాధించిన జెడిఎస్‌ కీలక పాత్ర పోషించింది. యడుయూరప్ప నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి బలనిరూపణలో విఫలమై వారం రోజుల్లో ప్రతిక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. జెడిఎస్‌కు తక్కువ స్థానాలున్నా ఆ పార్టీ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించింది. అనతికాలంలోనే సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఏర్పడటంతో నాటకీయ పరిణామాల మధ్య కుమారస్వామి ప్రభుత్వం 14 నెలల్లోనే కుప్పకూలింది. అత్యధిక స్థానాలున్నా అధికారానికి దూరంగా ఉన్న బిజెపి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. కాంగ్రెస్‌`జెఎడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో వచ్చిన 15 స్థానాల

ఉప ఎన్నికలలో బిజెపి 12 గెలిచి సంపూర్ణ మెజార్టీని సాధించింది. యడుయూరప్ప రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టిన రెండు సంవత్సరాల అనంతరం ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు రావడం, కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై పలు విమర్శలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 15వ  అసెంబ్లీలో ముచ్చటగా మూడోసారి బిజెపి సరికొత్త ప్రభుత్వం బసవరాజు బొమ్మై నేతృత్వంలో ఏర్పాటయ్యింది. రెండు సంవత్సరాల్లో సాధారణ ఎన్నికలున్న దశలో ముఖ్యమంత్రి మార్పు ఆ పార్టీకి మేలు చేకురుస్తుందో లేదా ముఖ్యమంత్రులను మార్చే పార్టీగా నష్టం చేకూరుతుందో అనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది.

ఎదురీదుతున్న బొమ్మై

            బొమ్మై ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడిచినా నిలదొక్కులేకపోయింది. బలమైన నేత యడుయూరప్ప స్థానంలో ఆయన అధికారం చేపట్టడంతో ఆ వర్గం సహాయసహకారాలు పూర్తిస్థాయిలో అందడంలేదు. దీనికి తోడు పార్టీలో ఐక్యత కొరవడిరది. బిజెపికి వెన్నుదన్నుగా నిలిచే సంఫ్‌ు పరివార్‌తో బొమ్మైకి సత్సంబంధాలు కూడా అంతతమాత్రంగానే ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్టీ యువనేత హత్య,  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హిజాబ్‌ ఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయనే అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. రాష్ట్రంలో అవినీతిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో బిజెపి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిరది.  ప్రధానంగా పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్ల నియామకాల్లో ప్రభుత్వంపై పలు ఆరోపణలు వచ్చాయి. బిజెపి నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ టెండర్లలో 40 శాతం కమీషన్ల కోసం వేధిస్తున్నారని ఇటీవల కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ ఆరోపించింది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్తుంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత మల్లికారున్‌ ఖార్గే కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఒక్కలిగుల సామాజిక వర్గంలో గట్టి పట్టున్న జెడిఎస్‌ పార్టీతో కూడా సీఎం బొమ్మైకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుతో బిజెపిలో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. పార్టీలో ఇప్పటికే ఉన్న గ్రూపులకు అసంతృప్తులు, అసమ్మతి తోడయితే పార్టీ పెద్దల తల బొప్పికట్టడం ఖాయం. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించిన బిజెపి అధిష్టానం కర్ణాటకలో కూడా ఇదే ఫార్ములాను పాటించాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు లేహర్‌ సింగ్‌ సోరియా ఇప్పటికే డిమాండ్‌ చేశారు. సీనియర్ల స్థానంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రానురాను పార్టీ టికెట్లపై మరింత దుమారం రేగి పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సామాజిక సమీకరణాలపై బిజెపి ఆశలు

            రాబోయే ఎన్నికల్లో గట్టెక్కడంతో అంత తేలిక కాదని గుర్తించిన బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక వర్గాలకు ఆకర్షించడానికి కృషి చేస్తుంది. వివిధ వర్గాలను కూడగొట్టేందుకు సోషల్‌ ఇంజినీరింగ్‌తోపాటు పలు సంక్షేమ అభివృద్ధి వరాలను గుప్పిస్తోంది. వివిధ సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా  రాష్ట్ర వ్యాప్తంగా  జనసంకల్ప యాత్రను చేపట్టింది. రాష్ట్ర క్యాబినేట్‌ ఎస్సీలకు 2%, ఎస్టీలకు 4% రిజర్వేషన్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఓబిసి, ఎస్టీ, ఎస్సీ, మహిళా, యువత, రైతులు, మైనార్టీ, చేనేత వర్గాలతో సమావేశాల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రధానంగా కాంగ్రెస్‌కు వెనుదన్నుగా ఉంటున్న ఓబిసి, ఎస్సీ, ఎస్టీలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిని వారికి రిజర్వేషన్లు కల్పించిన బిజెపి, దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో లాభం పొందాలని ఆ అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న  విభిన్న సామాజిక వర్గాలైన లింగాయత్‌లను, ఒక్కలిగులను ఆకట్టుకునేందుకు బిజెపి వ్యూహాత్మంగా అడుగులేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ లింగాయత్‌లు బిజెపి వెన్నుదన్నుగా ఉంటుండగా, ఒక్కలిగులు మాత్రం ఆ పార్టీకి చేరువవడం లేదు. ఒక్కలిగులైన జెడిఎస్‌ నేత కుమారస్వామి, కాంగ్రెస్‌ నేత డికె.శివకుమార్‌లకు పోటీగా అదే వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి డా.అశ్వథ్‌ నారాయణ ఆ వర్గాన్ని బిజెపికి చేరువ చేసేందుకు యత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లింగాయత్‌ల మద్దతు తిరిగి లభిస్తుందని భావిస్తున్న బిజెపి ఒక్కలిగులను కూడా ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కలిగులకు ఆరాధ్యమైన బెంగుళూరు నగర నిర్మాత కెంపె గౌడ 108 అడుగుల ఎత్తుగల భారీ కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందే బిజెపి రాష్ట్రంలోని వివిధ గ్రామాలు, చెరువుల నుండి ‘‘పవిత్ర మట్టి’’ సేకరణ పేరుతో 45 రోజుల కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఈ మట్టిని కాంస్య విగ్రహం ఆవరణలో థీమ్‌ పార్కు నిర్మాణంలో వినియోగిస్తారు. ఒక్కలిగుల సామాజిక వర్గం అధికంగా ఉండే మాండ్యా జిల్లాలో అక్టోబర్‌లో కుంభమేళా ఉత్సవాలను ప్రభుత్వం భారీఎత్తున నిర్వహించింది. దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడి పార్టీల మధ్య చర్చకు దారీ తీసింది.

       సిలికాన్‌ నగరమైన బెంగుళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇక్కడ జరిగిన అభివృది ప్రచార అంశంగా ఎన్నికల్లో వెళ్లడానికి ఆ పార్టీ ప్రణాళికలు రూపొందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలపై గంపెడాశలు పెట్టుకొంది. గతంలో నగరంలో పర్యటించిన ప్రధాన మంత్రి సబర్బన్‌ రైల్‌ ప్రాజెక్టుతో పాటు పలుఅభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు. చెన్నై`బెంగళూరు మధ్య దక్షిణ భారత దేశ తొలి వందేభారత్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులతో బెంగుళూరు వాసులు బిజెపిని చేరదీస్తారని ఆ పార్టీ ఆశావహదృక్పథంతో ఉంది.

       రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న దశలో దాన్ని సమగ్రంగా ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మంగా చేపట్టిన సోషల్‌ ఇంజినీరింగ్‌ ప్రయోగాలతో పాటు అభివృద్థి పనులు ఏ మేరకు

ఆ పార్టీని గట్టెక్కిస్తాయో వేచిచూడాలి.

====================

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

 పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

సెల్‌నెం: 9949372280.

Optimized by Optimole