పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని తాను ఎప్పుడో చెప్పానని.. అతనితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం బెటర్ అంటూ విమర్శించారు.ప్రజా సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదని.. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని.. తాను ఆరోజే చెప్పానని స్పష్టం చేశారు.నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని రాజగోపాల్ కుండ బద్దలు కొట్టారు.
మునుగోడు దత్తత ఏమైంది..
మునుగోడు దత్తత తీసుకుంటానని చండూరు పట్టణంలో కేటీఆర్ చెప్పాడని.. హామీ ఏమైందని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ప్రజలు అధికార పార్టీని ఉప ఎన్నికలో గెలిపించారని.. నెలన్నర కావస్తున్న ఇప్పటివరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గం తో పాటు జిల్లాకు నిధులు ఇస్తామని..ఇప్పటి వరకు నిధులు విడుదల చేయడం లేదని రాజగోపాల్ మండిపడ్డారు.
గొల్ల కురుమలను టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది..
గొల్ల కురుమలను టిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఫైర్ అయ్యారు రాజగోపాల్. ఎకౌంట్లో పైసలు వేసి ఎన్నికలు అయిపోయాక మళ్లీ రిటర్న్ తీసుకుందన్నారు .తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని కేసిఆర్ చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత వైద్యం వచ్చిందా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.ఏం ఉద్ధరించడానికి బి ఆర్ఎస్ పార్టీ పెట్టాలో అర్ధం కావడం లేదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి గా పనిచేసిన మచ్చలేని నాయకుడు మోడీ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.