దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తొలిసారి అగ్రహీరోలైన ఎన్టీఆర్_ రామ్చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.ఇప్పటికే ప్రీమియర్స్ తో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. తొలి రోజు వసూళ్లలోనూ అదే హవా కొనసాగిస్తోంది. తొలి షో నుంచే చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ‘ఆర్ఆర్ఆర్ ‘ రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తెలుగు సినీ చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డు. నైజాంలో ఈ మూవీ రూ. 23.35 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
అటు ఓవర్సీస్ లో ఈ మూవీ తొలిరోజు కలెక్షన్లు 5 మిలియన్ల మార్కును దాటేశాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ‘బాహుబలి 2’ పేరిట ఉన్న 4.59 మిలియన్ డాలర్ల రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ చేసేసిందని వారు చెబుతున్నారు.
డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలియాభట్లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ ముఖ్య పాత్రలో మెరిశారు. శ్రియ ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.