‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. థియేటర్లలో మాస్ జాతర

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ వహించిన ఈ చిత్రానికి భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. అటు చరణ్.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ.. ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రేక్షుకులముందుకు వచ్చింది. రూ.500కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం!

సినిమా విడుదలకు ముందు దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు పూర్తి కల్పితమైన కథ ఇది. రామ‌రాజు (రామ్‌చ‌ర‌ణ్‌) బ్రిటిష్ ప్ర‌భుత్వంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. త‌న మ‌ర‌ద‌లు సీత (అలియాభ‌ట్‌)కి ఇచ్చిన మాటను నెరవేర్చాలనే ఆశ‌యంతో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ గవ‌ర్న‌ర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌స‌న్‌) త‌న కుటుంబంతో ఆదిలాబాద్‌ ప్రాంతానికి సంద‌ర్శనకు వెళ్తాడు. అక్క‌డ గోండు జాతికి చెందిన ఓ చిన్నారిని బలవంతంగా తమవెంట దిల్లీకి తీసుకెళతారు. అన్యాయమని ఎదిరించిన బాలిక కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాప‌రిలాంటి భీమ్ (ఎన్టీఆర్‌)కి చిన్నారి అపహరణ విషయం తెలుస్తుంది. దీంతో వెంటనే చిన్నారిని తీసుకు రావ‌డం కోసం దిల్లీకి ప‌య‌న‌మ‌వుతాడు. బ్రిటిష్ దొరను ఎదిరించి.. భీమ్ చిన్నారిని కాపాడి తీసుకొచ్చాడా? అక్క‌డే పోలీస్ అధికారిగా ప‌నిచేస్తున్న రామ‌రాజుకీ, భీమ్‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది? ఆ ఇద్ద‌రికీ భార‌త స్వాతంత్య్ర పోరాటంతో సంబంధ‌ ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. విజువల్స్ హైలెట్ అని చెప్పవచ్చు. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునేలా భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాటలు సినిమాకు మరో బలం అని చెప్పవచ్చు. రామ్_ భీమ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఎన్టీఆర్_ రాంచరణ్ విషయానికొస్తే.. ఇద్దరు సినిమాకోసం ప్రాణం పెట్టారు. యాక్టింగ్, డ్యాన్స్, ఎమోషన్స్ సీన్లలో అదరగొట్టారు. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాట‌లో ఇద్ద‌రూ క‌లిసి సింక్‌లో డ్యాన్స్ చేస్తుంటే క‌ళ్లు తిప్పుకోలేం. అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ,శ్రియ తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమాకు కీరవాణి సంగీతం మరో ఎసెట్ అని చెప్పవచ్చు. నిర్మాత పెట్టిన ఖర్చు.. తెరపై ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది.కరోనా తో కుదేలైన ఇండియన్ సినీ పరిశ్రమకు ఆర్ఆర్ఆర్ మూవీ బూస్ట్ అప్ అని చెప్పవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టే చిత్రం. ఇక థియేటర్లలో మాస్ జాతరే.

Optimized by Optimole