Telangana: త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన..!

• త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన
•  నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్న కమిషన్
 • వచ్చే నెల రెండో వారంలో ముగియనున్న గడువు

రాపర్తి వినోద్: ఎస్సీల్లో అట్టడుగు స్థాయిలో ఉండి వినతులు అందించలేని వారికోసం చొరవ చూపించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కోరింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో  పర్యటన ఉండబోతుందని తెలిపింది. అన్ని వర్గాల నుంచి వినతులు సేకరించిన తర్వాత వారిలో ఒకే తరహా గ్రూప్ లను అధ్యయనం చేసి వారిలో సామాజిక, ఆర్థిక వెనుకబాటు, ప్రభుత్వ ఉద్యోగాలు.. చదువులలో రిజర్వేషన్లు పొందిన వారిని గుర్తించి సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ను ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సమాచారం ఇచ్చి వినతులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాకుండా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లకు వర్గీకరణ కమిషన్ గుర్చిన సమాచారన్ని కమిషన్ అందజేసింది.

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప వర్గీకరణను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను అక్టోబరు రెండో వారంలో నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వివిధ ఎస్సీ ఉప కులాల సామాజిక- ఆర్థిక పరిస్థితులను కమిషన్ అంచనా వేస్తుంది. కమిషన్ నివేదిక సమర్పించే వరకు కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను నిలిపివేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 60 రోజుల్లోగా తన విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించనుంది. అందుబాటులో ఉన్న సమకాలీన డేటా, జనాభా గణనను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలలోని సజాతీయ ఉప-కులాల హేతుబద్ధమైన ఉప-వర్గీకరణ, రాష్ట్రంలోని ఎస్సీలలోని వివిధ ఉప సమూహాలలో వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి, అనుభావిక అధ్యయనాలను కమిషన్ పరిశీలిస్తుంది. కమిషన్ ఇప్పటి వరకు 2000లకు పైగా వినతులను స్వీకరించి వాటిని పరిశీలిస్తుంది. ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సమయం తక్కువ ఉండటంతో కమిషన్ తదుపరి చర్య ఏంటనేది ఆసక్తిగా మారింది.

షెడ్యూల్డ్ కులాల్లో పురోగతిని తీసుకు వచ్చేందుకు, ప్రభుత్వానికి ఒక సమగ్రమైన సమాచారం ఉండాలనే ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేసింది. షెడ్యూల్డ్ కులాలు అనగానే మనకు మాల, మాదిగ, బేడ, బుడగజంగాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. తమ జీవితాల్లో ఎలాంటి పురోగతి లేకుండా చీకట్లో మగ్గే ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పరిశీలిస్తే.. ఎస్సీ జాబితాలో మొత్తం 59 కులాలు ఉన్నాయి. వీటిలో 10 లక్షలకు పైగా జనాభాతో మాల, మాదిగ కులాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. వీటిలో మాదిగ 32 లక్షలకు పైగా జనాభాను కలిగి ఉంది. మాలలు 15లక్షలు ఉన్నారు. ఆ తర్వాత వరుసలో లక్ష జనాభాతో బేడ, బుడగ జంగ కులాలు ఉన్నాయి. లక్షా 33 వేల జనాభాతో నేతకాని కులాలు మినహాయిస్తే మిగతా కులాల్లో జనాభా సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు. గోసంగి 23 వేలు, మహార్ 31వేలు, మన్నె 29వేల జనాభాతో మూడో స్థానంలో ఉన్నారు. 10వేలు దాటిన వారిలో బైండ్ల కులాలు 13వేల జనాభా, చమార్ 13వేలు, మాంగ్ 13వేల జనాభాతో ఉన్నారు. మిగతా కులాలు అన్ని 1000లోపు జనాభా ఉన్నవే. వీటిలో బాపుర్, బాంబాతి, చండాల, దందాసి, ఘాసీ, పాకీ, పామిడి, సప్రు, చంబార్, అరుంధతీయ, గోడారి, జాంబవ్, మాతంగి, ఆదిద్రావిడ, అనారుక, బారీకి, ఎల్లమ్మలవాండ్లు, హోలయ్య, మలదాసు, మాలఅన్యాయి, మాల మస్తీ, మాలసన్యాసీ, ముండల, సంబర్ లాంటి కులాలు ఉన్నాయి.

ఇదే గ్రూపుల్లో ఉన్న కొన్ని కులాల జనాభా 2011 లెక్కల ప్రకారం… 100 కూడా దాటడం లేదు. అందులో చండాల 64 మంది, దందాసి 84 మంది, సప్రు 54 మంది, మాల హన్యాయ్ 37, పంచమ 63, వల్వన్ 92 ఇలా ఉన్నారు. వీరు ఒకే దగ్గర లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడో ఒక చోట 1,2, కుటుంబాలు ఉండటం వల్ల వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం ప్రభుత్వ యంత్రాంగానికి కష్టంగా మారింది. వీరిలో ఆర్యమాల కులాన్ని చూసినట్లయితే 2000 మంది కానీ వీరు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మంలో కేంద్రీకరించబడి ఉన్నారు.

ఆయా కులాలకు సంబంధించిన వ్యక్తులు, సంఘాలు వినతులు అందజేయాలనుకుంటే onemancommission.scsc@gmail.com కు మెయిల్ లేదా..9700254948 ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్, బీఆర్ కేఆర్ భవన్, ట్యాంక్ బండ్ రోడ్డు, హైద్రాబాద్ లో ఉన్న కార్యాలయానికి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో వచ్చి నేరుగా వినతులు అందజేయాలని వెల్లడించారు.

Optimized by Optimole