ఆధ్యాత్మిక సంకీర్తన:
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
గానం : కొండవీటి జ్యోతిర్మయి
తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర
తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన
॥పల్లవి॥
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర
పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే
॥తంద॥
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
॥తంద॥
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే
॥తంద॥
అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు
॥తంద॥
కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే
తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే
॥తంద॥
కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే
॥తంద॥