టెస్ట్ కెప్టెన్సీ వీడ్కోలు సమయంలో.. అతను మాత్రమే మెసేజ్ చేశాడు:
గత కొంత కాలంగా ఫామ్ తో సతమతమవుతున్న టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో దుమ్ములేపుతున్నాడు. దీంతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తు పోస్టులు పెడుతున్నారు. టోర్నీకి ముందు అతనికి జట్టులో స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సెలక్టర్స్ అతనికి నెలరోజులు విశ్రాంతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఎట్టకేలకు జట్టులోకి వచ్చిన రన్ మెషిన్ ఇప్పటివరకు అత్యధికంగా 154 వ్యక్తిగత పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో మ్యాచ్లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్… తనదైన బ్యాటింగ్ తో అభిమానులను అలరించాడు.
ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్ టెస్ట్ కెప్టెన్సీ వీడడంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు.. మిస్టర్ కూల్ MS ధోనీ నుంచి మాత్రమే తనకు సందేశం వచ్చిందని వెల్లడించాడు. ధోని సలహాలు ఎంత ప్రత్యేకమైనవో ఈ సంఘటన నిదర్శనమని కొనియాడాడు. ఇద్దరి ఆటగాళ్ళ మధ్య గౌరవం ఉన్నపుడు ప్రత్యేక అనుబంధం ఉంటుదన్నాడు. వ్యక్తిగతంగా ఏ అవసరం వచ్చినా సలహాల కోసం ధోనినీ సంప్రదిస్తానని కోహ్లీ ట్వీట్ లో పేర్కొన్నాడు.
కాగా తన ఆట తీరుపై వస్తున్న విమర్శలపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ‘ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అతని నేరుగా సంప్రదిస్తానని.. అందరి ముందు బహిరంగంగా సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం విలువ ఇవ్వనని అన్నాడు. ఆట పట్ల చిత్తశుద్దితో.. నిజాయితీగా ఉండటం వలనే ఇలా మాట్లాడుతున్నట్లు’ కోహ్లీ సమాధానం ఇచ్చాడు.
2019 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ.. T20 కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. అదే సంవత్సరం సెలెక్టర్లు వైట్-బాల్ ఫార్మాట్‌లకు ఒకే కెప్టెన్‌ను కోరుకోవడంతో అతను వన్డే కెప్టెన్సీ వదులుకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో టీంఇండియా ఓడిపోవడంతో టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.