మహేశ్వరం నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో కోల్డ్ వార్..!!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో అధికార పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆపార్టీనేత తీగల కృష్ణారెడ్డి బహిర్గతంగా ఆరోపణలు చేశారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్టారెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మీర్ పేటను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీగల మండిపడ్డారు. ఆప్రాంతం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని .. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించడంతో..పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.

మంత్రి సబితా భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను సైతం వదలడం లేదని తీగల ఆరోపించారు. టీఆర్ ఎస్ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని.. పార్టీ ప్రతిష్టతను మంటగలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇక గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో టీర్ ఎస్ నుంచి తీగల పోటీచేయగా కాంగ్రెస్ తరపున సబితా విజయం సాధించారు. అనంతరం ఆమె టీఆర్ ఎస్ లో చేరగా.. మంత్రి పదవి దక్కింది.అప్పటినుంచి ఇద్దరి మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. తీగల సైతం.. పార్టీ కార్యక్రమాలను దూరంగా ఉంటూ వస్తున్నారు. సబితకు మంత్రి పదవి దక్కడంతో.. తీగలకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని ఆయన వర్గం భావిస్తోంది .

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహగానాల నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. అటు తీగల.. ఇటు మంత్రి సబితా వర్గాలు తగ్గేదెలే అన్న తరహాలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.

Optimized by Optimole