×

Appolitics:

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు, తమ కుమారులకు రాష్ట్రాల్లో పట్టంగట్టి తాము రాజ్యసభకు వెళ్లే వ్యూహంతో ఉన్నట్టుంది. పైగా, ఎన్డీయే రాజకీయాల్లో తమ మాట చెల్లుబాటుకు ఇదే అదునుగా వారు భావిస్తుండవచ్చు. కేంద్రంలో ద డమైన ప్రభుత్వం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తమ మద్దతు మీద ఆధారపడుతున్న ప్రస్తుత సమయాన్ని మించిన మంచి తరుణముండదు. దృ క్పథాల్లో వైరుద్యాలున్నా పలు విషయాల్లో నితీశ్‌కుమార్‌కు, చంద్రబాబుకు దగ్గరి పోలుకలున్నాయి. ఇద్దరికీ రాజకీయ సిద్దాంత నిబద్దత, స్థిరత్వం లేదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకే ‘యూ’ టర్న్‌లు వారిద్దరికీ అలవాటే!

ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యసభకు నామినేషన్ వేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (జేడీయూ) ఎత్తుగడను 24 గంటల ముందు వరకు మీడియా ఊహించలేకపోయింది. పార్టీ వర్గాల నుంచి లీక్ వచ్చిన తర్వాతే, నామినేషన్ల రోజున మీడియా కథనాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే రాజ్యసభ స్థానానికి గురువారం నామినేషన్ వేసిన నితీశ్‌కుమార్ తనయుడు నిశాంత్‌ను ఈ నెల 18 తర్వాత బిహార్ ఉపముఖ్యమంత్రి చేస్తారని సమాచారం. నితీశ్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి పదవి బీజేపీకి, ఉపముఖ్యమంత్రి పదవి జేడీయూ కి ఇవ్వాలనేది ఆంతరంగిక అంగీకారంగా తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ఇదొక ఎన్నదగిన కీలక పరిణామమే! ఇదే బాటలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రాజ్యసభకు వెళ్లిపోతూ తన కుమారుడు, ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడయిన నారా లోకేశ్ ను ముఖ్యమంత్రి చేస్తారా? ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) అంగీకరించకుంటే, బిహార్‌లో లాగానే నారా లోకేశ్‌ను ముందు ఉప ముఖ్యమంత్రి చేసి, పవన్ కల్యాణ్‌ను కొంత కాలం పాటు ముఖ్యమంత్రి చేస్తారా? ఇదీ ఇప్పుడు తెలుగు రాజకీయవర్గాల్లో సాగుతున్న రాజకీయ చర్చ. ఇటు చంద్రబాబు, అటు నితీశ్ ఇద్దరి రాజకీయ పంథా, అనుసరించే వైఖరి, ఇప్పుడున్న పరిస్థితుల్లోని సామ్యం దృ ష్ట్యా బాబు కూడా నితీశ్ బాటలో నడువ వచ్చనే ప్రచారం జోరందుకుంది. ఏపీలో చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప చాలా కీలక నిర్ణయాలు, విధానాలు, పరిణామాలు లోకేశ్ ద్వారానే జరుగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ లోపల, బయట ప్రచారం సాగుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో కీలక నియామకాలు, బదిలీలు లోకేశ్ ద్వారానే జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఆగకుండా, తగినంత ముందుగానే లోకేశ్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తార‌ని అధికారానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో రాజ్యసభ దైవార్షిక ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. నాలుగు ఖాళీలు ఏర్పడతాయి. నాలుగూ తెలుగుదేశం నేతృ త్వంలోని కూటమికే దక్కే అవకాశాలున్నాయి.


ఇద్దరికి పోలికలే ఎక్కువ!
రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ లతో ప్రభావితుడినయ్యానని చెప్పుకునే కుర్మి నాయకుడు నితీశ్‌కుమార్‌కు సామ్యవాదిగా, బడుగు-బలహీనవర్గాల నాయకుడిగా పేరుండేది. కానీ, తరచూ రాజకీయ వైఖరి మార్చి బీజేపీకి వ్యతిరేకంగా కొన్నిసార్లు, అనుకూలంగా మరికొన్ని మార్లు రాజకీయాలు నెరపుతారు. రాజకీయ సిద్దాంత నిబద్దత జీరో అని, ‘ఏ శిబిరంలో ఉండటమైనా సరే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండటమే ఆయన లక్ష్యం’ అని నితీశ్‌ను విమర్శించే వరకు పరిస్థితి వెళ్లింది. అంత తేలిక‌గా ఎవరినీ నమ్మరు. నమ్మి సహకరించిన నాయకులను, పార్టీలను కూడా ఇట్టే వదిలేసి ప్రత్యర్థి శిబిరాలకు తేలికగా వెళ్లగలరని పేరొచ్చింది. బీజేపీతో కలిసి బిహార్‌లో ఆయన సీఎంగా కూటమి సర్కారు నడుపుతున్నపుడు బీజేపీ జాతీయ సమావేశాలు రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగాయి. బీజేపీ అగ్రనేతలకు కూటమి ముఖ్యమంత్రి విందు ఇచ్చేలా ఒక నిర్ణయం జరిగింది. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నేంద్ర మోదీ ఆ విందులో పాల్గొన‌కూడదని, రాష్ట్రంలో ఆయన ప్రచారమే చేయొద్దని ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ (బీజేపీ) ద్వారా నితీశ్ తన షరతు తెలియజేశారు. అందుకు బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించకపోవడంతో ఆ షరతు వర్తించలేదు. నితీశ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఆయనతో ఉన్నవారెవరూ ఇప్పుడు అతనితో లేరు. కొంచెం అటుఇటుగా అటువంటిదే చంద్రబాబు చరిత్ర. ప్రజాతీర్పు పొందిన ఎన్టీరామారావును దింపి, 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినపుడు ఆయనకు దన్నుగా ఉన్న ముఖ్యనేతలెవరూ ఇప్పుడాయనతో లేరు. కొందరు స్వయంగా దూరమయితే మరికొందర్ని ఆయనే దూరం పెట్టారు. 1999, 2014, 2024 మూడు ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు, సహకారంతోనే చంద్రబాబు గెలిచారు. మసీదులు కూల్చే పార్టీ అని, జీవితంలో బీజేపీతో పొత్తుపెట్టుకోనని పొసగనపుడు ప్రతిజ్ఞలు చేశారు. 2019 ఎన్నికలప్పుడు మోదీని విబేధించి, అనరాని మాటలన్నీ అంటూ తిట్టిపోశారు. 2024 ఎన్నికలప్పుడు మళ్లీ బీజేపీతో జట్టుకట్టి మోదీ వంటి నాయకుడు ప్రపంచంలోనే లేరని బాబు పొగిడారు. ఇద్దరూ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారం పొందినవారే! ‘సుశాసన్ బాబు’ అని నితీశ్ పిలిపించుకుంటే, ‘సీఈవో’ అనిపించుకోవడం బాబుకు ఇష్టం. ఇలా నితీశ్‌కు, బాబుకు పోలికలెక్కువ!


బాబుకిది తప్పని సంకటం
తనయుడు లోకేశ్‌కు రాజకీయ వారసత్వం అప్పగించడానికి ఇదే అదునైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు. తనకా వయసు పైబడింది, గౌరవప్రదంగా తప్పుకోవడానికిది తగిన సమయమనే భావన ఆయనను అభిమానించే వారిలోనూ వ్యక్తమౌతోంది. ‘ఇంకెంత కాలం…? ఇప్పటికే చాలా నిర్ణయాలు, నియమకాలు లోకేశ్ బాబే చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాబు ఇప్పుడొక ముసుగుమాత్రమే!’ అని, బాబుతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకుడొకరు ప్రయివేటు సంభాషణల్లో చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దం పడుతోంది. ఇవాళ ఏపీలో లోకేశ్ ప్రభావం ఎంతుందనడానికి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసి, మరో మిత్రపక్షంలో ఉన్న నాయకుడు సహితం లోకేశ్‌నే కాక ఆయన సతీమణిని, తనయుడ్ని పొగడటమే నిదర్శనం! 2019 లో సాధారణ జనంలోనూ ‘కావాలి జగన్, రావాలి జగన్‌’ అని వినిపించినట్టు, ‘ఉండాలి బాబు, ఏలాలి బాబు’ అని ప్రస్తుతం ఎవరేం అనుకోవటం లేదు. చినబాబు లోకేశ్ అనుచర గణంలోనూ ఆ భావన లేదు. 2024 ఎన్నికల్లోనూ ‘బాబుకు పట్టం కట్టండి’ అని కాకుండా ’సైకో పోవాలి, సైకిల్ రావాలి’ అన్న నినాదమే జనంలో క్లిక్ అయింది. జగన్ చేత ఒకసారి, ఆయన తండ్రి వైఎస్సార్ చేతిలో రెండు సార్లు ఎదురయిన ఓటమి ద ష్ట్యా… మరో ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో? ప్రతికూలంగా ఉంటే ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్దంగా లేరు. 2029 ఎన్నికల నాటికి తన వయసు-ఆరోగ్యం ఎంత సహకరిస్తుందో తెలియదు. నేరుగా లోకేశ్ పేరిట ఎన్నికలకు వెళితే, లభించే జనాశీర్వాదంపై అంతగా నమ్మకం లేదు. ప్రస్తుతమున్న సంఖ్యాబలంతో ఇప్పుడయితేనే అధికార మార్పిడి సముచితమని బాబు భావిస్తుండవచ్చు. లోకేశ్‌ను సీఎం చేయడంపై ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే తేలాల్సి ఉంది. ఆయనను కూడా తనతో పాటు రాజ్యసభకు తీసుకుపోయి, లోకేశ్ కు దారి సుగమం చేయడమా? బిహార్‌లో లాగానే ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసి, లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడమా? అన్న మీమాంస కూడా ఉండొచ్చు! కూటమిలో ఒక అంతరంగిక అంగీకారం ముందే కుదిరితే, బాబు నేత త్వంలోనే తదుపరి ఎన్నికలకు వెళ్లి, 2029 తర్వాత అవకాశం ఉంటే లోకేశ్‌ను అప్పుడు ముఖ్యమంత్రి చేయడం అనే పంథా అనుసరించవచ్చు!


ఇంతకీ మోదీ మనసేమిటో?
నితీశ్, చంద్రబాబు ఆలోచనల్ని, రాజకీయంగా వారు పావులు కదపడాన్ని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎలా చూస్తారన్నది ప్రాధాన్యతాంశమే! వారసత్వ రాజకీయాలు తనకు నచ్చకపోయినా, ఇప్పుడున్న సంఖ్యా-సమీకరణాల్లో నేరుగా వారిని కాదని మనసు నొప్పించే సాహసం చేయకపోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో వారికున్న బలం, బీజేపీ బలంగా లేని చోట కాంగ్రెస్‌ను నిలువరించాల్సిన అవసరం ద ష్ట్యా ఆయన మిన్నకుండవచ్చు. ఇంకో రకంగా ఈ పరిణామాలు ప్రధానికి కలిసివచ్చేవే! రేపటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత త ణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉంటుందో? ఏ కారణం చేతయినా ఆమె విపక్ష కేంద్రకంగా ఎదిగి, ఢిల్లీ రాజకీయాల్లోకి వస్తే నితీశ్, బాబు వంటి వారు తనకు ఢిల్లీ స్థాయిలో సహాయకారులుగా ఉండటం ఒక రాజకీయ అవసరమే! వారి ఢిల్లీ క్రియాశీలతతో బీజేపీకి ఒరిగే ప్రత్యక్ష నష్టమేమీ ఉండదు కనుక ఈ పరిణామాలను ఆయన ఉపేక్షించవచ్చు. ‘నితీశ్‌కు లభించిన ఢిల్లీ క్లియరెన్స్ తనకు మాత్రం లభించకుండా ఉంటుందా?’ అనే చంద్రబాబు ధీమా అసమంజసం కాకపోవచ్చు!


దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చ్ సంస్థ డైరెక్టర్.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole