తాజా వార్తలు

National: తిరుప్పరంకుండ్రం దీపం వెలిగింపుపై.. ముస్లింల నుంచి అభ్యంతరాలు లేవు!

National:

Vinod✍🏽

 తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. దీపస్తంభం (దీపతూన్) వద్ద దీపం వెలిగించే సమయంలో ముస్లిం సమాజానికి చెందిన ఏ ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని సుప్రీంకోర్టు నియమించిన రిసీవర్, మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్ వెల్లడించారు. ఈ వివాదానికి మతపరమైన రంగు పులమడం సరికాదని, స్థానిక ముస్లింలు తమ సోదరులని ఆయన పేర్కొన్నారు.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి సంబంధించి కార్తీక దీపం వెలిగింపు అంశం కొంతకాలంగా వివాదానికి దారితీస్తోంది. కొండపై ఉన్న దీపతూన్ వద్ద దీపం వెలిగించాలన్న అంశంపై న్యాయపోరాటం కొనసాగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 28న దీపతూన్ వద్ద కార్తీక మహాదీపం వెలిగించారు.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు రిసీవర్లను నియమించింది. వీరిలో రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి. పార్థిబన్ ఉన్నారు. దీపం వెలిగించే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఇద్దరు న్యాయమూర్తులు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యాయని వైద్యనాథన్ తెలిపారు.

ముస్లింల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు!

దీపం వెలిగించే కార్యక్రమానికి ముస్లిం సమాజానికి చెందిన ఏ ఒక్కరూ అడ్డంకులు సృష్టించలేదని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయ వివాదంగా మార్చారని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ కార్యక్రమాన్ని వీక్షించడం తనకు వర్ణించలేని అనుభూతిని ఇచ్చిందని రిసీవర్ పార్థిబన్ పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.

భక్తుల్లో ఉత్సాహం.. కొండ దిగువన సంబరాలు!

దీపం వెలిగించే కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండ దిగువన చేరుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ ప్రజలకు కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. భక్తులు దిగువ నుంచే దీపారాధనను వీక్షించారు. దీపం వెలిగిన వెంటనే భక్తులు హర్షధ్వానాలు చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ‘వెట్రివేల్ మురుగనుక్కు అరోహరా’ అంటూ నినాదాలు చేశారు.

దీపం వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్న అర్చకుడు సోమస్కందన్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. స్థానికులు భక్తులకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తూ తమ సహకారం అందించారు.

మొత్తంగా తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగింపు కార్యక్రమం ప్రశాంతంగా ముగియడం, మత సామరస్యంపై రిసీవర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Optimized by Optimole