Telangana:
Upendar Reddy✍🏽
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్ నాయకత్వంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ గులాబీ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. మరోవైపు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే వ్యూహం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరో 500 రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నారని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి భిన్నంగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో నాయకత్వంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఒకవేళ కేసీఆర్ పేరుతో ప్రజలు ఓట్లు వేసి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చినా.. మూడు నెలలకు మించి ఆయన ముఖ్యమంత్రిగా ఉండరని, ఆ తర్వాత కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారని కవిత ఆరోపించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ పేరును ఉపయోగించుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వాస్తవానికి గతంలోనూ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి అంశం పలుమార్లు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు.
ఇక కేసీఆర్ తెలంగాణ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించడం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ విస్తరణకు ప్రయత్నించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనే విశ్లేషణలు వినిపించాయి. ఈ పరిణామాలు తెలంగాణలో పార్టీపై ప్రభావం చూపాయనే విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా కేటీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర, థర్డ్ ఫ్రంట్ అవకాశాల గురించి మాట్లాడటం రాజకీయ చర్చకు దారితీసింది. గతంలో ఆశించిన ఫలితాలు ఇవ్వని జాతీయ రాజకీయాల ప్రయోగాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కవిత విమర్శలు బీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త రాజకీయ సవాలుగా మారుతున్నాయి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తుంటే.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి.. బీఆర్ఎస్కు ఇప్పుడు అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, పార్టీ భవిష్యత్ నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం కూడా అంతే కీలకంగా మారింది. కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందా? కవిత వ్యాఖ్యలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? అన్నది రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారనుంది.
