Telangana:
జానపద, ఆదివాసీ కళా సంపద పరిరక్షణ కోసం ఆచార్య జయధీర్ తిరుమల రావు తన జీవితాన్ని ధార పోస్తే… ఆ కళాఖండాలను సొంత బిడ్డల్లా కాపాడి ‘ఆద్యకళ ’కు అమ్మగా మారింది నీలమ్మ! ఆది నుంచి ఆద్యకళ కోసం పని చేయడం వల్ల నీలమ్మని దగ్గరగా చూసే అదృష్టం నాకు దక్కింది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ కి చదువుకోవడానికి వచ్చిన నాకు ఆచార్య తిరుమల రావు పరిచయం కావడం, ఆయనతో ఆద్యకళ కోసం పని చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో వారి ఇంటికి రోజూ వెళ్లేవాడిని. అలా ఆ ఇంటి ఆప్యాయతను పొందాను. నాలుగు సంవత్సరాల పాటు ఆమె ఇంటిలో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ఆచార్య సేకరించిన ప్రతి కళాఖండాన్ని బాధ్యతతో, జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఆమె సేవలు వెలకట్టలేనివి.
నేను 2019 సంవత్సరంలో ఆద్యకళ కోసం పని చేసినప్పడు నీలమ్మతో ఏర్పడిన అనుబంధం నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మా బృంద సభ్యులమంతా కలిసి ఎన్నో క్షేత్రస్థాయి పర్యటనలు చేశాం. ఈ పర్యటనలో మాకు భాష తెలియకపోయినా… ఆదీవాసులతో మాట్లాడుతూ వారి మనో భావాలు తెలుసుకుంటూ ముందుకు కదిలేవాళ్లం. ఆ సమయంలో ఆదివాసి జీవన విధానాలు, సంస్కృతి గురించి మా బృందానికి వివరిస్తూ జీవిత పాఠాలను నేర్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.
మా ప్రయాణాల్లో టీమ్ సభ్యులందరినీ ఒక కుటుంబంలా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకునేది. కళాకారులు, పరిశోధకులు, టీమ్ సభ్యులు అనే తేడా లేకుండా అందరికీ అక్కడిక్కడే ఫీల్డ్ లో వండిపెట్టి… తన చేతి వంటతో మా ఆకలి తీర్చేవారు. ఏ ఆదివాసీ గూడానికి వెళ్లినా… ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా… మా కోసం ఇంట్లో తయారు చేసిన స్నాక్స్, పండ్లు మర్చిపోకుండా తీసుకువచ్చేవారు. ఫీల్డ్ వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా మా సౌకర్యాలను ఎప్పుడూ మరచిపోయేవారు కాదు.
నీలమ్మకు వివిధ రంగాల్లో అపారమైన పరిజ్ఞానం ఉండేది. ఆయుర్వేదం, వృక్షశాస్త్రం, ఔషధ మొక్కల వినియోగం, సంప్రదాయ జీవన విధానాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆమెకు తెలుసు. అడవుల్లో, గ్రామాల్లో కనిపించే మొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి ఎంతో సహజంగా మాకు వివరించేవారు. అనుభవం నుంచి, ప్రజల జీవన విధానాల నుంచి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల నుంచి సంపాదించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇతరులకు పంచడంలో ఆమె ఎప్పుడూ ముందుడేవారు.
మూలధ్వని, ఆదిధ్వని, ఆద్యకళ ఆధ్వర్యంలో 2019 నుంచి 2023 మధ్య నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో నీలమ్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం నాకు లభించింది. కళాఖండాలను ఎలా భద్రపరచాలి? వాటి సేకరణ వివరాలను ఎలా నమోదు చేయాలి? ప్రదర్శనల నిర్వహణలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అనేక అంశాలను ఆమె దగ్గరే నేర్చుకున్నాను. కళాఖండాల ప్రదర్శనల సమయంలో ఆచార్య జయధీర్ తిరుమలరావు సందర్శకులకు వస్తువుల గురించి వివరించే సందర్భాల్లో ఏదైనా విషయం గుర్తుకు రాకపోతే నీలమ్మ వెంటనే గుర్తుచేసేవారు. ఆ వస్తువు చరిత్ర, సేకరించిన ప్రాంతం, వాటి వెనుక ఉన్న ప్రజల జీవన విధానం వివరాలను ఎంతో సమగ్రంగా తెలియజేసేవారు. ఈ విధంగా ఆమె ఆద్యకళలో ఒక నడిచే లైబ్రైరీగా అనిపించేవారు.
నేను మా గ్రామాన్ని విడిచిపెట్టి చదువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత మా కుటుంబానికి దూరంగా వచ్చాననే బాధ ఉండేది. కానీ, నీలమ్మ పరిచయం తర్వాత ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. నేను దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రామంతపూర్‌లోని వారి ఇంటిలోనే ఉన్నాను. డిడి కాలనిలోని వారి సోంతింటికి వెళ్లిన ప్రతిసారీ ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ నీలమ్మే స్వయంగా చూసుకునేవారు. డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో సాయంత్రం ప్రొఫెసర్ తిరుమల రావుతో కలిసి హైదరాబాద్ చుట్టుపక్కల ఫీల్డ్ వర్క్ కోసం వెళ్లేవాడిని. అక్కడ పరిశోధన, సేకరణ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అమ్మ మా కోసం వంట చేసి సిద్ధంగా ఉంచేవారు.
ఆద్య కళ సభ్యులం కొన్ని సందర్భాల్లో ఫీల్డ్ వర్క్ కు వెళ్లకపోయినా, కార్యక్రమాలకు హాజరు కాకపోయినా, నీలమ్మ… ఎందుకు రాలేదు? పని చేయాలి కదా? ఎవరో ఒకరో ఉండాలి కదా? సార్ ఒక్కరే పెద్దమనిషి ఎలా చేస్తారని మందలించేవారు. ఆ మందలింపులో కోపం కంటే మా బాధ్యతను గుర్తు చేసే తపనే ఎక్కువ ఉండేది. నీలమ్మ కృషి, సేవలను గుర్తించి అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, తెలంగాణ గవర్నర్ సహా పలువురు ఆమెను ప్రశంసించిన తీరును మేం దగ్గరుండి చూశాం. ఇది ఆమె చేసిన సేవలకు లభించిన గౌరవం. ప్రశంసలకంటే కళాఖండాలు భద్రంగా ఉండటం, ఆదివాసీ సంస్కృతి పరిరక్షించటం, ఆద్యకళ తన లక్ష్యాన్ని సాధించడం అంశాలే ఎక్కువ సంతోషాన్ని కలిగించేవి. వ్యక్తిగత జీవితాన్ని, సమయాన్ని, శ్రమను, ఆప్యాయతను మొత్తం ఆద్య కళ కోసం ధారపోసిన గొప్ప మాతృమూర్తి…నీలమ్మ.
ఆమె హఠాత్తుగా మరణించినప్పటికీ, తన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం మెడికల్ కాలేజీకి దానం చేయాలని ఆమె ముందుగానే కోరుకున్నారు. అదే విధంగా కళా సంపద సమాజానికి ఉపయోగపడాలని, ఆద్య కళ మ్యూజియంతో కళాత్మక వారసత్వం భావితరాలకు చేరాలని ఆమె ఆకాంక్షించారు. తన భౌతిక దేహాన్ని వైద్య విద్యకు, తన కళా సంపదను సమాజానికి అంకితం చేయాలన్న ఆమె ఆలోచన ఎంతో ఉదాత్తమైనది. నీలమ్మ మన మధ్య లేకపోయినా, ఆమె ఆప్యాయత, జ్ఞానం, సేవలు మా జ్ఞాపకాలలో సజీవంగా ఉంటాయి. ఆమె నేర్పిన పాఠాలు, ఆమె చూపిన మార్గం, ఆమె అందించిన అనుబంధం మా జీవిత ప్రయాణంలో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి.
ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు దశాబ్దాలుగా సేకరిస్తున్న జానపద, ఆదివాసీ కళాఖండాలకు ఒక శాశ్వత మ్యూజియం ఏర్పాటు కావాలనే నీలమ్మ చిరకాల కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ కళాఖండాలు ఒకే చోట భద్రంగా ఉండాలి. ప్రజలు వాటిని చూడాలి. విద్యార్థులు, పరిశోధకులు వాటి గురించి తెలుసుకోవాలి. మన పూర్వీకుల జీవన విధానం, కళలు, సంస్కృతి భవిష్యత్తు తరాలకు అందాలి. ఆద్యకళ కృషిని, సేవలను గుర్తించి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సేకరించిన అపారమైన జానపద, ఆదివాసీ కళా సంపదకు ఒక శాశ్వత మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నాం.ఈ కళాఖండాలు భావితరాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆద్యకళకు గూడు కల్పించి… ఒక మ్యూజియం రూపుదిద్దుకున్న రోజున, ఆమె చేసిన కృషి సార్థకమవుతుంది. ఆమె కల నెరవేరుతుంది. నవంబర్ 19న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సంస్మరణ సభ సందర్భంగా అమ్మ నీలమ్మ గురుతుగా “కళల కాపరి” పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆద్యకళకు అమ్మగా,అపురూపమైన కళా సంపదకు కాపరిగా నిలిచిన నీలమ్మ ఆత్మీయత, అంకితభావం, సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం జరగనుంది.
-జంపాల ప్రవీణ్,
