వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్తులలో ముఖ్యమైన కొన్నింటిని మనం తెలుసుకుందాం.
ఐతరేయ ఉపనిషత్తు: ఐతరేయ ఉపనిషత్తు ఐతరేయ అరణ్య కాండంలో ఉంటుంది. ఐతరేయ అనే ఋషిచే బయట పడటం వల్ల ఈ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది. జీవుడు తండ్రి నుండి తల్లి గర్భస్థమవటం, పాపపుణ్యాల ననుసరించి అనేక లోకాలలో జన్మలనెత్తటం జనన మరణాల నుండి విముక్తి ఆత్మానుభూతి వల్లనే కలగటం – వీటి గురించి ఈ ఉపనిషత్తు చెప్తుంది.*
తల్లి గర్భంలో ఉండగానే తన పూర్వ జన్మవృత్తాంతాన్ని ఎరిగి అన్ని అడ్డుగోడలనూ దాటి ఆకాశంలో ఎగిరే గరుడుని వలె విముక్తినొందిన వామదేవుడన్న ఋషి కథ ఈ ఉపనిషత్తులోనిదే. ప్రజ్ఞానము – ఆత్మను గురించిన అపరోక్షానుభూతి గురించి ఈ ఉపనిషత్తు సాదకంగా వివరిస్తుంది. ఒకరు జ్ఞానం ద్వారా ముక్తి పొందుతారన్నది సరికాదు. జ్ఞానమే బ్రహ్మ అని వివరిస్తుంది. ”ప్రజ్ఞానం బ్రహ్మ” అన్నదే ఋగ్వేదపు మహావాక్యం.*
చాందోగ్య ఉపనిషత్తు: దశోపనిషత్తులలోని ఆఖరి రెండూ, అంటే చాందోగ్య, బృహ దారణ్యకాలు – చాలా పెద్దవి. ఈ రెండూ కలిసి మిగిలిన ఎనిమిదింటి కంటే పెద్దవి. చాందోగ్యోపనిషత్తు సామవేదంలో చాందోగ్య బ్రాహ్మణంలో ఉన్నది. ‘చాందోగ్య అంటే సామగానం చేసేవాడని అర్థం. దీనికి సంబంధించినదే ఈ ఉపనిషత్తు. భగవద్గీతలో కఠోపనిషత్తుని బాగా వినియోగించినట్టే వ్యాసుని బ్రహ్మసూత్రాలకి చాందోగ్యోపనిషత్తు లోని మంత్రాలు ప్రమాణాలంటారు.చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు ఎందరో ఋషుల వాక్కుల సముదాయాలు.
చాందోగ్యం ఆదిలో ఓంకారాన్ని ఉద్గీథగా పేర్కొని, ఆ ఓంకార ఉపాసన గురించి వివరాలనిస్తుంది. అక్షివిద్య, ఆకాశ విద్య, మధువిద్య, శాండిల్య విద్య, ప్రాణ విద్య, పంచాగ్ని విద్య వంటి విద్యలనెన్నిటినో ప్రస్తావిస్తుంది. ఈ విద్యలు పరమాత్మ తత్త్వాన్ని తెలిసికోవటానికి ఉపకరిస్తాయి. అంతంలో, దహర విద్య ఉంటుంది. పరమాకాశ స్వరూపమైన పరమాత్మను తన హృదయాకాశంలో దర్శించడమే, అనుభవించడమే దహరవిద్య. ఈ ఉపనిషత్తులో సత్యం గురించి చెప్పటానికి ఎన్నో ఆసక్తిదాయకమైన ఉపాఖ్యానాలను ఉపయోగించారు.
ఇందులో సత్యకాముని కథ ఉంది. అతనికి తన పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఈ విషయం దాచడు. ఫలితంగా, గౌతముడు అతను సద్బ్రాహ్మణుడనుకొని శిష్యునిగా స్వీకరిస్తాడు.అంతకి పూర్వమొక గురువు అతనిని ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడు – గురుపత్ని కూడ అతని పక్షాన మాట్లాడుతుంది. ఇదంతా పూర్వపు గురుకుల పద్ధతిని మనకళ్ల ఎదుట సినిమా వలె కనబడేట్టు చేస్తుందీ ఉపనిషత్తు. సత్యకామునికి విరుద్ధంగా శ్వేతకేతు వృత్తాంతముంది. ఇతనికి తాను విజ్ఞుడనన్న గర్వమధికం.
ఆ బ్రహ్మచారి గర్వాన్ని అణగద్రొక్కిన వాడు అతని తండ్రే, ఉద్దాలక ఆరుణి. జీవాత్మ పరమాత్మలు భిన్నము కావని, ”తత్త్వమసి” అన్న మహావాక్యార్థాన్ని అతనికి చిట్టచివరికి చెప్పుతాడు. సామవేదపు ముఖ్యోపదేశం, మహావాక్యమూ యిదే. శ్వేతకేతువు వలె గాక నారదమహర్షి అన్ని శాస్త్రాలనీ నిర్దుష్టంగా పఠించినా, ఆత్మ యొక్క తత్త్వం గురించి తెలిసికోవటానికి చాలా శ్రమ పడుతాడు. సనత్కుమార యోగి ఆ రహస్యాన్ని ఈ ఉపనిషత్తులోనే బోధిస్తాడు.
తైతిరీయ ఉపనిషత్తులో ఆనందం గురించి అన్నమయ కోశంతో ప్రారంభించి క్రమంగా ఊర్థ్వస్థితికి కొనిపోయినట్టే సనత్కుమారుడు కూడ ఆహారశుద్ధితో ప్రారంభించి, అంతఃకరణ శుద్ధి వరకూ కొనిపోతాడు – అంతఃకరణ శుధ్దిద్వారా ఆత్మానందానుభూతి సంభవిస్తుంది.