ఆత్మజ్ఞానం పొందడానికి “గేయం గీతా నామసహస్రం” అన్నారు జగద్గురు ఆదిశంకరులు తన భజగోవిందంలో. భగవద్గీతలోని 700ల శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో వెయ్యి నామాల అంతరార్ధాన్ని సంపూర్ణంగా గ్రహించి, తదనుగుణంగా సాధనచేస్తే, ఇక ఆధ్యాత్మికంగా తెలుసుకోవలసింది ఏమి వుండదు. త్వరలోనే గురుసాక్షాత్కారం లభించి ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఎందులో ఎటువంటి సంశయం లేదు.
విష్ణు సహస్రనామ స్తోత్రము, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానంతరం, పరమాత్మలో విలీనాన్ని ఆసిస్తూ, అంపశయ్యపై దేహత్యాగ సమయం కోసం నిరీక్షిస్తున్న భీష్ముడు, దీన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు) ఉపదేశిస్తాడు.
108 శ్లోకాలలో, వెయ్యినామాలుతో వున్న ఈ పవిత్ర స్త్రోత్రం, “విశ్వం” అనే మొదటి నామంతో మొదలై “సర్వ ప్రహరణాయుధ” అనే 1000వ నామంతో ముగుస్తుంది. పరమాత్మ విభూతిని ఈ వెయ్యి నామాలలో ఎంతో జ్ఞానవంతంగా వర్ణించేడు భీష్ముడు.
ఇందులో నున్న మహత్తును పూర్తిగా అనుభూతి పొందాలంటే, ప్రతినామం వెనుకనున్న అసలు అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవాలి. ఒక్కరు పారాయణచేసినా, సామూహికంగా పారాయణ చేసినా అర్ధవంతంగా వుండాలి. వినే పదిమందికీ వుపయోగపడాలి. దీని పారాయణకు కులమతాలతో, నీయమనిష్ఠలతో పనిలేదు. కేవలం అకుంఠిత విశ్వాసం, సహనం తప్పక వుండాలి.
ఈ దివ్య సహస్రనామం వినేవారికి, చదివే వారికి ఏవిధమైన భయములు, అశుభములు కలుగవు. ఆశించేవారికి చతుర్విధ ఫలపురుషార్ధాలు తప్పక లభిస్తాయి. ఆడంబరం కోసం కాకుండా ఆత్మానుభూతి కోసం అర్ధవంతంగా పారాయణ చెయ్యవలసిందిగా నా మనవి.
విష్ణు సహస్రనామ స్తోత్రంపై ఎంతోమంది మహనీయులు ఎన్నో భాష్యాలు రచించేరు. నా తండ్రి, నా మొదటిగురువు శ్రీ ఆకుండి సూర్యనారాయణ శాస్త్రి గారి ఆశీర్వాదంతో, నా పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ బాబాజీ మహాశయుల వారి అనుగ్రహంతో 108 శ్లోకాల్లో పేర్కొన్న నామాలకు అర్ధం చెబుతూ, ప్రతిశ్లోకానికి నా జ్ఞానానికి అందినంత మేర పరమాత్ముని భవ్య సచ్చిదానంద తత్వాన్ని విశ్లేషిస్తూ ఈ దివ్యరచన పూర్తిచేయడం జరిగింది.
ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మజ్ఞానం పొందుటకు ఈ విశ్లేషణ కొంతమందికైనా ఉపయోగపడితే నా ఈ ప్రయత్నం సఫలమయినట్లే!
||సర్వం పూజ్య గురుదేవార్పణమస్తు||
||సర్వేజనా సుఖినోభవంతు||లోకాసమస్తా సుఖినోభవంతు||ఓం శాంతిః శాంతిః శాంతిః||