ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!

ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు అనుమతి ఉంటుందని కానీ.. బీజేపీ సభకు ఉండదంటూ ఫైర్ అయ్యారు.

ఇక ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నయానిజాంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభకు ఒకరోజు ముందు అనుమతి రద్దు చేయించారని.. హైకోర్డు అనుమతితో పొందినట్లు తెలిపారు. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వలే ఆంక్షలే విధించారని.. ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో కమలవికాసం ఖాయమని కమలదళపతి కుండ బద్ధలు కొట్టారు. అవినీతి పాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచేసిందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కల్వకుంట్ల కుటుంబానికి ఎటిఏం లా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చీకట్లో నెట్టివేయబడిన తెలంగాణను.. వెలుగులోకి తెచ్చేందుకే సంజయ్ యాత్ర చేపట్టారన్నారు.

అటు స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైతం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.కుల మత, ప్రాంతాలకు అతీతమైన భాగ్యనగరంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టి సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ది పొందాలని కుట్రలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు..16 రాష్ట్రాలలో బ్యాన్ చేసిన మునావర్ ఫారుఖి షో వేలాది మందితో షో నిర్వహించారని ఫైర్ అయ్యారు. అదే బీజేపీ సభ అంటే మాత్రం కేసీఆర్ కు శాంతి భద్రతల సమస్యలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని.. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కరీంనగర్, ఆదిలాబాద్ , చర్లపల్లి జైలల్లో కేసీఆర్ కోసం రూములు రెడీగా ఉన్నాయని దుయ్యబట్టారు.

కాగా కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్‌ స్కూల్‌ను మంజూరు చేసిందని గుర్తుచేశారు. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.వరంగల్‌ జిల్లాలోని ఆలయాలను కేసీఆర్‌ పట్టించుకోలేదని.. శిథిలావస్థలో ఉన్న కాకతీయుల కళామండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోందన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని.. రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇప్పటికే మునుగోడు సమరభేరి సభతో జోరుమీదున్న కాషాయ కార్యకర్తలు.. ఓరుగల్లు సభ సక్సెస్ తో గాల్లో తేలియాడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ గడీలు బద్దలు అవడం ఖాయమని.. కమల వికాసానికి అనుకూల పవనాలు వీయడం మొదలైందని కమలం నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.