సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు
• ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు?
• అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు
• లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు
• మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి
• పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి
• నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్
సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ.. రాష్ట్రప్రజలకీ ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. సొంత కుటుంబంలోని వ్యక్తి హత్య జరిగితే న్యాయం చేయలేని ఈ బిడ్డ మనల్ని ఏం ఆదుకుంటాడని ఎద్దేవ చేశారు. తెనాలి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. బటన్ నొక్కి డబ్బులు వచ్చాయని అబద్ధపు మాటలు చెప్పాడన్నారు. ఆ డబ్బు ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కితే వచ్చిన డబ్బులని నాదెండ్ల స్పష్టం చేశారు. పరిపాలన దక్షత లేని ఈ ముఖ్యమంత్రి ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టి నష్టం కలిగించాలన్న భావనతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఓటు వేసి బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ఆ ఓటు ఎవరికి వేస్తున్నామనేది ఆలోచించాలని మనోహర్ సూచించారు.
గురువారం సాయంత్రం తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాదెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మనోహర్ మాట్లాడుతూ ” జగన్ రెడ్డి ఏనాడూ ప్రజలకు మంచి జరగాలన్న లక్ష్యంతో పరిపాలన చేయలేదన్నారు. అమరావతి నిర్మాణం జరిగి ఉంటే మన ప్రాంతం కచ్చితంగా అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. ఎకరం ధర రూ. 50 లక్షలు పలుకుతుందన్న భరోసా ఉండేదన్నారు. జగన్ రెడ్డి కంకణం కట్టుకుని మరీ దాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆభూములను రూ. 15 లక్షలకు కూడా కొనేవారు లేరని నాదెండ్ల పేర్కొన్నారు.