ఏపీలో ఎన్నికల రగడ..

౼ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
౼ సహకరించలేమంటున్నఉద్యోగ సంఘాలు

౼ అనుకూలపరిస్థితులు లేవంటున్న ప్రభుత్వం
౼ వివాదాస్పదంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయం


అమరావతి: ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రరి 5,9,13,17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సమయంలో రమేష్ కుమార్ అత్యంత పకడ్భందీగా చుట్టూ గ్లాస్ ప్రొటెక్షన్ తో కనిపించడమే దీనికి కారణం. ప్రస్తుతం కరోనా తీవ్రత పూర్తిగా తగ్గలేదని, తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం సైతం రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని వాదిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని.. ఉద్యోగులు ఈ పప్రక్రియలో ఉండటంతో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సరిపోరని ప్రభుత్వం చెబుతోంది.
నిమ్మగడ్డవే ప్రాణాలా..?
పది నిముషాల పాటు నిర్వహించే ప్రెస్ మీట్ లోనే కరోనా భయంతో నిమ్మగడ్డ రమేష్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నికల్లో పాల్గొనే కోట్ల మంది ప్రజల ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఇలాంటి రక్షణ కల్పిస్తామని నిమ్మగడ్డ ఎందుకు చెప్పలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో ఉందని.. తీర్పు వచ్చే వరకైనా ఎన్నికల ప్రక్రియను ఆపాలని ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తున్నాయి.
సుప్రీం
కోర్టుకు చేరిన పంచాయితీ.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మొండి పట్టుదలతో రెండు వారాల క్రితం నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించలేమని చెబుతున్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల కమిషనర్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తూనే ఎన్నికలు జరపాలని చెబుతూ సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై వాదనలు జరగనున్నాయి.
నిమ్మగడ్డ
తీరు ఆదినుంచీ వివాదాస్పదమే…
ఏపీలో స్థానిక సంస్థలకు 2018 లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని పసిగట్టిన అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికలు జరపొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. ప్రభుత్వ కోరిక మేరకు నిమ్మగడ్డ సైతం సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు గాను 151 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సిద్దం కావడంతో 2020 ఫిబ్రవరిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం గత ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 2019 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 20శాతానికి పైగా ఏకగ్రీవం చేసుకోగలిగింది. ఆ సమయంలో కరోనాను కారణంగా చూపుతూ నిమ్మగడ్డ అర్ధాంతరంగా ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో నిమ్మగడ్డ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆ సమయంలో ఏపీలో కరోనా కేసులు పదిలోపే నమోదయ్యాయి. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని వైఎస్ఆర్ సీపీ మండిపడింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రభుత్వం ప్రశ్నించింది.

Optimized by Optimole