‘అల్పజీవి’ పుస్త‌క స‌మీక్ష‌..

Ganesh Thanda  :(Senior journalist)

(ఒక్కసారి చదవడం మొదలుపెడితే, అది పూర్తి చేసే దాకా వదలబుద్ధి కానివ్వకుండా ఆకట్టుకునే పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ‘అల్పజీవి’ ఒకటి.)

నాకు ఉన్న మంచి అలవాట్లలో పుస్తకాలు చదవడం ఒకటి! కానీ, చాలా రోజులుగా పుస్తకాలు చదవడానికి నాకు నేను తగిన సమయం కేటాయించులేకపోయాను. ఆఫీసుకు వెళ్లడం, ఇంటికి రావడం… ఫోన్ పట్టుకోవడం మళ్లీ లేచి ఆఫీసుకు వెళ్లడం… ఇదే నా జీవిత చక్రమైపోయింది. బద్ధకమో, నిరాశో, ఒత్తిడో లేక ఇవన్నీ కలగలసిన మరేదో… నాలోని నన్ను నాకు దూరం చేస్తున్న ఫీలింగ్! నా పుస్తకాల షెల్ఫ్ నన్ను వెక్కిరిస్తోంది. ఉన్న పుస్తకాలే చదవడం లేదని ఈ సారి బుక్ ఫెయిర్ కి వెళ్లలేదు. పోయిన బుక్ ఫెయిర్ లో మాత్రం కొన్ని పుస్తకాలు కొనుకున్నా. అందులో రావిశాస్త్రి రాసిన ‘అల్పజీవి’ ఒకటి. అంతకముందు ఉన్న చాలా పుస్తకాల్లాగే అది కూడా షెల్ఫ్ కే పరిమితమయ్యింది. కొన్నాళ్ల క్రితం చదవాలనే కుతూహలం మళ్లీ మొదలైయింది. అంత ఈజీ కాదు కదా? కొన్ని రోజులుగా ‘అల్పజీవి’ పుస్తకాన్ని నా బ్యాగ్ లో వేసుకొని తిరుగుతున్నా. అది కొంచెం నలిగిపోయింది కూడా. అయినా నాకు బుద్ధి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టింది. మొత్తానికి నాలుగు రోజుల కింద దానికి మోక్షం కలిగింది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే, అది పూర్తి చేసే దాకా వదలబుద్ధి కానివ్వకుండా ఆకట్టుకునే పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ‘అల్పజీవి’ ఒకటి.

ఏముందీ ఈ అల్పజీవిలో అంటే… సుబ్బయ్య అనే ఒక పిరికివాడు ఉంటాడు. వాడిని చూస్తే ముందుగా జాలేస్తుంది. చదువుతూ చదువుతూ ముందుకు వెళ్తే వాడి మీద అసహ్యం వేస్తుంది. రచయిత పుస్తకం చివర్లో రాసిన వ్యాసంలో కూడా ఇదే విషయం ఉంటుంది! ఇది ఒక సుబ్బయ్య కథ కాదు. మన చుట్టూ ఉండే మనుషుల కథ. మన కథ. సుబ్బయ్యను, వాడి చుట్టూ ఉన్న మనుషులనూ చూస్తే ఎక్కడో ఒక చోట మన ఛాయలు కనిపిస్తాయి. ఆ పాత్రలు కూడా మనలాగే ఆలోచిస్తుంటాయి. ‘ఛీ‘ మనలో కూడా ఈ దరిద్రం ఉంది. ఈ భయం వల్ల, ఈ భయపడేవాళ్ల వల్ల సమాజానికి మాత్రమే కాదు కుటుంబానికి కూడా ఏ ఉపయోగం ఉండదు. ఉపయోగం అటుంచితే అడుగడుగునా ప్రమాదమే తప్ప కనీసం జీవితాన్ని ఆస్వాదించే ఆస్కారం కూడా ఉండదు.

వేమన చెప్పినట్టు…
మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!

పిరికివాడు కూడా మేడిపండులాగే పైకి ధైర్యంగా మాట్లాడతాడు. మేడిపండును చూస్తే లోపల పురుగులు ఉన్నట్టు పిరికివాడు కూడా దేన్ని చూసిన లోలోపల భయడుతుంటాడు అని వేమన నాలుగు మాటల్లో చెప్పిన సారాంశాన్ని రావి శాస్త్రి గారు ఒక నవలగా విడమరిచి చెప్పినట్లు అనిపించింది నాకు. భయాన్ని, భయం వల్ల వచ్చే అనార్థాలను రావిశాస్త్రి గారు కనువిప్పు కలిగించే విధంగా చెప్పారు ఈ నవలలో.

వాడేమనుకుంటాడో?! ఇదేమనుకుంటుందో! ఈమెక్కోపం వస్తుందేమో! వాడు మండిపడతాడేమో?! పీకల మీదికొస్తుందేమో! ఉద్యోగం ఊడుతుందేమో?! లంపటం తగులుకుంటుందేమో?! అయినా ఈ గొడవ మనకెందుకు? ఈ తంటాలు మనకేలా? నేలనపోయేది నెత్తినెందుకు? కడుపులోని చల్ల కదల్డం ఎందుకు! ఇలాంటి భయాలకు తోడు నాకు శాంతి లేదు, విశ్రాంతి లేదని విచారాలు, గులుగటాలు కూడా పిరికివాళ్లకే చెల్లుతాయి. ఇలా భయం వల్ల అనేకనేక ఆలోచనల్లో మునుగుతూ… తేలుతూ… కొత్త సమస్యల్ని కోరి తెచ్చుకోడం, పాత సమస్యల్ని తవ్వుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్లను కూడా సమస్యల్ని పడేయటం సుబ్బయ్యలాంటి వాళ్లే జరుగుతుంది.

పిరికివాళ్లు మంచివాళ్లు కారా? అనే ప్రశ్నకు కూడా రచయిత సమాధానం చెప్పారు. ఆదిమానవుడు నుంచి  ధైర్యాన్నే ఎందుకు అత్యుత్తమ గుణంగా భావిస్తారు? అంటే… unless a man has that virtue, he has no security for preserving any other అన్నారు గొప్ప Writer Samuel Johnson. అంటే.. ధైర్యం ఉంటే మిగతా మంచి గుణాలు ఉంటాయనడంలో గ్యారెంటీ ఉంది. కానీ, ధైర్యం లేకపోతే మాత్రం వాటికి గ్యారెంటీ లేదు. భయానికి మంచికి అస్సలే సంబంధం లేదు. పిరికివాళ్లు ఎవరైనా సరే మంచివారు కాలేరు. మంచికి నిలబడలేరు. ఇందుకు గ్యారెంటీ ఉందని రచయిత చెప్పిన తీరును పాఠకులుగా మనం ఏకిభవించకుండా ఉండలేం. పిరికితనం వల్లే కుటుంబాలు, చుట్టూ ఉన్న వ్యవస్థలు, దేశం ఇలా తగలడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని 1952లోనే అల్పజీవి అనే నవల ద్వారా రావి శాస్త్రి గారు మనకు చాలా సరళమైన భాషలో చెప్పారు. 70 ఏళ్లయినా మనుషుల ప్రవర్తనలో ఏ మార్పూ రాలేదు. పైగా వారి ప్రవర్తన పాతాళం వైపు పడిపోతోంది. శ్రీ శ్రీ కవితాల్లగే ఆవేశంతో సాగే వాక్యాలు ఉన్న ఈ నవల చదవడం వల్ల ఎంతో కొంత నేర్చుకోవచ్చు. జీవితం తాలూకు స్టిరింగ్ ని ధైర్యం వైపు మలుపుకోవచ్చు.

=====================

Optimized by Optimole