‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీనవర్గాల వారికి చెందాల్సిన సంక్షేమపథకాలు అందడం లేదని తమపట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని తమ గోడును బలహీనవర్గాల వారు ‘‘పీపుల్స్‌మార్చ్‌’’ పాదయాత్రలో స్వయంగా మమ్మల్ని కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బడుగు బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున మీ దృష్టికి తీసుకుని రాదలచిన‌ట్లు భ‌ట్టి లేఖ‌లో స్ప‌ష్టం చేశారు.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు భ‌ట్టి . ఏరు దాటక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధి.. బిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుందని భ‌ట్టి లేఖ‌లో ఎద్దేవా చేశారు.

సబ్సిడీ రుణాల కోసం బడుగు బలహీనవర్గాలవారు లక్షలాది మంది ధరఖాస్తు చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు సీఎల్పీ నేత‌. కాగితాలపై బడ్జెట్‌ కేటాయింపులు ఘణంగా కనిపిస్తున్నా ఆచరణలో బీసీలకు ఖర్చు చేస్తున్నది నామమాత్రమేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తెస్తామని 2017 వ సంవత్సరంలో అసెంబ్లీలో మీరు చెప్పిన మాటలు శుష్క వాగ్ధానంగానే మిగిలిందన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వ హామీ అమలై వుంటే బీసీల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో రూ.10 వేల కోట్ల నిధులు అదనంగా సమకూరేవని భ‌ట్టి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక బిఆర్ఎస్ ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికైనా బీసీ బంధు పథకాన్ని ప్రకటించి తగిన నిధులు ఇచ్చి అమలు చేయాలని, అర్హులైన ధరఖాస్తుదారులందరికీ సత్వరమే సబ్బిడీ రుణాలు మంజూరు చేయాలని భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. 2014, 2018 ఎన్నికలతో పాటు ఇతర సందర్భాల్లో మీరు, బిఆర్‌ఎస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని అమలు చేయాలని, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున డిమాండ్ చేస్తుమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలపట్ల ఉన్న చిన్నచూపును విడనాడలని పక్షంలో బీసీల తరుపున కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని కేసీఆర్ కు లేఖ‌లో భ‌ట్టి తెలియ‌జేశారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole