Nancharaiah merugumala senior journalist: ఎన్టీఆర్ అంటే ఏమిటో అర్ధంచేసుకోలేని ఇందిరమ్మ, కమ్మ సామాజికవర్గం..
తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 73 ఏళ్లు నిండాయి. తెలుగదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు గారు 73 సంవత్సరాలు నిండడానికి నాలుగు నెలల ముందే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ రెండింటికీ ఏమీ సంబంధం లేకున్నా వారిద్దరూ మాజీ ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షులు మాత్రమేగాక మామాఅల్లుళ్లు కావడం వల్ల రెండో విషయం చెప్పాల్సి వచ్చింది. 41 ఏళ్ల క్రితం 1982 వేసవిలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్.టి.రామారావుకు అన్ని కులాలు, మతాల ప్రజలు మద్దతు ఇచ్చారు. అయితే, ఆయన ఏడేళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాక సొంత సామాజికవర్గం కమ్మ కులస్తులు చాలా వరకు దూరమయ్యారు. బ్రాహ్మణులు బద్ధవ్యతిరేకులయ్యారు. ఆయన బతికుండగా టీడీపీ చివరిసారి గెలిచిన 1994లో మాత్రం అన్ని కులాల ప్రజలు ఆయన పార్టీకి ఓట్లేశారు. ఎన్టీ రామారావును పూర్తిగా అపార్ధం చేసుకున్న లేదా అర్ధం చేసుకోలేకపోయిన భారత రాజకీయ నేత ఎవరంటే –దివంగత ప్రధాని ఇందిరాగాంధీయేనని కోనసీమ ప్రాంతంలో పుట్టిపెరిగిన నా నియోగ బ్రాహ్మణ పాత్రికేయ మిత్రుడు ఒకరు నాతో తరచు చెబుతుంటారు. ఆయన అభిప్రాయం నిజం కాబట్టే జనాదరణ, ప్రజాకర్షణ శక్తి మెండుగా ఉన్న ఎన్టీఆర్ ను అప్రజాస్వామికంగా పదవి నుంచి కూలదోసే దుస్సాహసం చేశారు ఇందిరమ్మ. లండన్ లో నివసించే ట్రాట్స్కయిట్, ప్రసిద్ధ జర్నలిస్టు తారిఖ్ అలీకి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ‘ఎన్టీఆర్ పురుషుడూ కాదు, మహిళా కాదు,’ అని ఇందిరమ్మ నోరుపారేసుకున్నారు. ఎన్టీఆర్ నిజంగా రాజకీయ ధైర్యసాహసాలున్న వ్యక్తి కాబట్టే 1980ల్లో దారీతెన్నూ లేని ప్రతిపక్షాలను ఏకం చేసే ధైర్యం చేశారు. ఆరోజుల్లో తనతో పాటు న్యూఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తున్న మాజీ రాష్ట్రపతి, ‘రాజకీయ రెడ్డి ముసలినక్క’ అనే చెడ్డపేరున్న నీలం సంజీవరెడ్డి గారు ఎన్టీఆర్ వైపు తిరిగి, ’ ఇందిరాగాంధీతో ఎందుకు పెట్టుకుంటావ్ రామారావ్. ఆమెతో తలపడి ఎవరైనా గెలిచారా? ఇందిరకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే పనిని ఇక వదులుకుంటే నీకు మంచిది,’ అని అడగకుండానే సలహా ఇచ్చారట. ఎలాంటి పరిణామాలు ఎదురైనా…ఇందిరతో పోరు విరమించేదే లేదని సంజీవరెడ్డి గారికి ఎన్టీఆర్ తెగేసి చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ గారిని ఒక్క ఇందిరమ్మ మాత్రమే కాదు ఆయన కులస్తులైన కమ్మలు కూడా సరిగా అర్ధం చేసుకోలేదని నా మిత్రుడు చెప్పిన మాటలు కూడా నాకు నచ్చాయి.
కులపోళ్ల మద్దతు ఎన్టీఆర్ కు అంతగా లేదు, చంద్రబాబుకు తగినంత ఉంది!
నిజమే, కమ్మ సామాజికవర్గం పెద్దలు, చిన్నలు కూడా చంద్రబాబు నాయుడును అర్ధం చేసుకున్నంత సరిగ్గా నందమూరి తారక రామారావును అర్ధంచేసుకుని అభిమానించలేదనే నేనూ నమ్ముతున్నాను. అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉండగా వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థ రద్దు చేసి, దేవాదాయ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టే ధైర్యం చేసినందుకు ఎన్టీఆర్ ను తెలుగు బ్రాహ్మణలు, జాతీయ బ్రాహ్మణులు అత్యధిక సంఖ్యలో ఆయన మరణించేవరకూ ద్వేషించారు. అయితే, తన మామ గారిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆయన పతనం కోరుకున్న అన్ని తరగతుల బ్రాహ్మణులలో అత్యధిక జనం అభిమానం సంపాదించడం చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉన్నప్పుడు సాధించిన ఘనవిజయం. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా మారి రాజకీయ పెత్తనం చేస్తున్న సమయంలో టీడీపీని సొంతం చేసుకున్న తీరుపై అభ్యంతరాలున్నా–తన మామ స్థాపించిన పార్టీకి చంద్రబాబు మేలు చేశారనే అత్యధిక తెలుగు ప్రజానీకం నమ్ముతారు. చంద్రబాబు గారికి 1978–84 మధ్యకాలంలో రాజకీయ మిత్రుడుగా వ్యవహరించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా అసమ్మతి నేతగా పేరు సంపాదించిన వైఎస్సార్– ముఖ్యమంత్రి పదవిని 2004లో చేపట్టే వరకూ తన సామాజికవర్గం రెడ్లలో అత్యధిక జనం అభిమానం సంపాదించలేకపోయారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ‘ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక రెడ్డి కులేతరుల మద్దతు ఉన్న ఏకైక రెడ్డి నాయకుడి’గా వైఎస్ కు పేరుండేది. సీఎం అయ్యాక రెడ్లు వైఎస్సార్ కు తగినంత గౌరవమర్యాదలు ఇవ్వడం మొదలెట్టారు. దగ్గరయ్యారు. సొంత కులంలో చెప్పుకోదగ్గ మద్దతుగాని, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువ ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గం కనీస అభిమానం గాని నందమూరి తారక రామారావు గారు కూడగట్టలేకపోయారు. ఆయన అల్లుడు నారా వారు తొలిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికి 27 సంవత్సరాలు దాటిపోయాయి. ఎన్టీఆర్ కన్నుమూసి 23 ఏళ్లు గడిచిపోయాయి. టెక్నాలజీని, రాజ్యాధికారాన్ని బాగా అర్ధం చేసుకుని ఈ రెండింటినీ చక్కగా వాడుకోగలిగిన చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడిగా గొప్ప విజయాలు సాధించలేకపోయారు. ఎన్టీఆర్ మాదిరిగా ఇందిర వంటి కాంగ్రెస్ అగ్రనేతలతో ఢీకొనే సాహసం చేయలేకపోయారు చంద్రబాబు. సొంత కులం, బ్రామ్మల మద్దతు ఉన్నంత మాత్రాన రాజకీయ విజయాలు సాధించడం అంత తేలిక కాదని తెలుగునాట రుజువైంది.