రైతు నష్టపోతే- పాలకుల్లో కదలిక లేదు… యంత్రాంగంలో స్పందన లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన  జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని మండిప‌డ్డారు. ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ తరఫున రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతుల్లో భరోసా.. అధికారుల్లో కదలిక.. రైతు భరోసా కేంద్రాల్లో మార్పు వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.  సోమవారం కొల్లిపర మండల పరిధిలోని నందివెలుగు, చివులూరు, తుములూరు గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను మ‌నోహ‌ర్‌ కలిశారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “అకాల వర్షాలకు పంటలు పోయి రైతులు కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వం స్పందించలేని పరిస్థితుల్లో ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకుంటే బాధ కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ఇదే సమస్య. వ్యవస్థ మారితే మెరుగైన సేవలు అందుతాయని భావించిన రైతులకు ఈ ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని అన్నారు. రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏమయ్యాయో తెలియదని.. ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ప్రకటన పత్రికలకే పరిమితం అయ్యిందని మ‌నోహ‌ర్ పేర్కొన్నారు.

మద్దతు ధర దక్కితే చాలు..

కొల్లిపర మండలంలో 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వెయ్యి ఎకరాల్లో జొన్న పంటకు నష్టం వాటిల్లిందన్నారు మ‌నోహ‌ర్‌. ఇప్పటి వరకు పంట కొంటామని రైతు భరోసా కేంద్రాల నుంచి సమాచారం కూడా రాలేదన్నారు. గతంలో మార్కెటింగ్ యార్డుల ద్వారా పట్టాలు, వ్యవసాయ యంత్ర పరికరాలకు చేయూత అందించే వాళ్లమ‌న్నారు. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర దక్కితే చాలు మా బాధలు మేము పడతామనే స్థితికి తీసుకువచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంతో కౌలు రైతు పూర్తిగా చితికిపోయాడని.. ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే పవన్ కళ్యాణ్ గారు రూ.5 కోట్ల విరాళం ఇచ్చి వారి కుటుంబాలకు లక్ష చప్పన భరోసా ఇస్తూ ఆదుకుంటున్నారని మ‌నోహ‌ర్ స్ప‌ష్టం చేశారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole