Telanganapolitics: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల్లో సామాజిక వర్గాలు పాచికలుగా మారుతున్నాయి. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్నా రాజకీయంగా వెనుకబడి ఉన్నామనే అసంతృప్తి అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతీసారి ఎన్నికలకు ముందు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ను వివిధ బీసీ సంఘాలు లేవనెత్తడంతోపాటు రాజకీయ పార్టీల్లోని ఆ వర్గానికి చెందిన నాయకులు కూడా డిమాండ్లు పెట్టడం సర్వసాధారణం. అయితే ఈ డిమాండ్‌ను ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తుండేవారు. అయితే ప్రస్తుతం ఈ డిమాండ్ అన్ని పార్టీల్లో మొదలుకావడం బీసీల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనం.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలు ఆ పార్టీకి అండగా వున్నారు. బీసీలకు గుర్తింపు కూడా 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుండి దళితులు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తెలంగాణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం తెలంగాణలో ఉనికి కోల్పోవడంతో వారు బీఆర్ఎస్వైపు మళ్లారు. దానికి నిదర్శనం సీఎస్డీఎస్`లోక్‌నీతి అధ్యయనం ప్రకారం 2014, 2018, 2019 ఎన్నికల్లో బీసీలు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇచ్చారని పరిశీలిస్తే బీఆర్ఎస్కే ఎక్కువ మంది మద్దతిచ్చినట్లు వెల్లడైంది.
2014లో బీఆర్ఎస్కు 41%, కాంగ్రెస్‌కు 25%, బీజేపీకి (టీడీపీ పొత్తుతో) 23%, 2018లో బీఆర్ఎస్కు 50%, కాంగ్రెస్‌కు 29%, బీజేపీకి 9% మంది, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 41, కాంగ్రెస్‌కు 25, బీజేపీకి 25 శాతం మంది బీసీలు మద్దతిచ్చారు. బీసీల మద్దతు కారణంగానే 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారపగ్గాలు చేపట్టగలిగింది. 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎన్నడూ లేని విధంగా 19 శాతం మద్దతు ఇవ్వడం వల్లనే నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలుపొందింది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే 2019 ఎన్నికల తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. ఆయన నియామకం తరువాత బీసీల్లో కొంత కదలిక వచ్చి బీజేపీ వైపు మొగ్గు మొదలైంది. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజికవర్గంలో. అయితే అకారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తొలగించడంతో బీసీ సామాజికవర్గంలో అసంతృప్తి నెలకొంది. వారు తిరిగి బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి ఉంది.
తాయిలాలకే పరిమితమైన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తాయిలాలు మాత్రమే ఇచ్చి వారిని ఆకట్టుకోవాలని చూస్తోంది. బీసీలకు తాత్కాలిక తాయిలాలు కాకుండా రాజకీయ ప్రాధాన్యత దక్కాలంటే వారికి జనాభా ప్రాతిపదికన ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలనే డిమాండ్ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. బీఆర్ఎస్ 2014లో 28 మంది, 2018లో 27 మంది బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇచ్చిందని, రాబోయే ఎన్నికల్లో బీసీలకు అధిక స్థానాలు కేటాయించాలని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
2014, 2018 లో బీఆర్ఎస్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత దళితులు, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని ఈ సారి ఎన్నికల్లో గెలుపొందితే ఉపముఖ్యమంత్రి, మంత్రివర్గంలోని ప్రధాన శాఖలు బీసీలకు కేటాయించాలనే డిమాండ్ బీఆర్ఎస్ పార్టీలో పెరిగింది. మంత్రి వర్గంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ వంటి బలమైన బీసీ నేతలున్నా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎం పదవి, ప్రధాన శాఖలు దక్కకపోవడంపై కొంత అసంతృప్తి ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కేసీఆర్ బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తే బీఆర్ఎస్పై బీసీలలో విశ్వాసం కలుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా కులజనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పార్టీలలో బీఆర్ఎస్ కూడా ఒకటి. మరి అదే బీఆర్ఎస్ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీలకు రాజకీయంగా సమన్యాయం ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలను వైరి పక్షాలు లేవనెత్తుతున్నాయి.
2018 ఎన్నికలకు ముందే కేసీఆర్ బీసీ కులాలను మచ్చిక చేసుకునేందుకు అనేక పథకాలను ప్రకటించినా అవి అసంపూర్తిగానే ఉండడంతో వారిలో అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటికీ 3.38 లక్షల మంది గొర్రెల పంపిణీ కోసం ఎదరుచూస్తున్నారు. అలాగే, చేప పిల్లల పంపిణీ, చేనేత నేతల పథకం, గీత కార్మికుల పథకం వంటవి ఆర్భాటంగా ప్రారంభించి పూర్తి చేయకపోవడంతో ఆయా సామాజిక వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామనే హామీ కూడా నెరవేరలేదు. బీసీలను ఆకర్షించడం కోసం చేయూత పేరుతో లక్ష రూపాయల సహాయం పథకం ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన తరగతుల్లో వందకుపైగా కులాలుండగా కేవలం 15 కులాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం ఈ స్కీం ప్రవేశపెట్టిందనే విమర్శలున్నాయి. దీంతో బీసీల్లో ఉన్న అసంతృప్తికి చెక్‌పెట్టేలా త్వరలో ‘బీసీ గర్జన’ చేపట్టి బీసీ ఓట్లకు గాలం వేయాలని బీఆర్ఎస్ చూస్తోంది.
రాబోయే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతివ్వాలనే డిమాండ్ కాంగ్రెస్‌లో రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల పార్టీ ప్రకటించిన ఎన్నికల కమిటీ నియామకంలో బీసీలకు అన్యాయం జరిగిందని గాంధీభవన్ సాక్షిగా నిరసనలు చేపట్టారు. పార్టీలో బీసీ నినాదం పెరుగుతున్న దశలో తీవ్రతను గుర్తించిన అధిష్టానం ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు కేటాయించే ప్రతిపాదనలు తెస్తుంటే, కనీసం మూడు సీట్లు ఇవ్వాలని మొత్తంమీద 45 నుండి 50 స్థానాలు బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని పార్టీ బీసీ నేతలు కోరుతున్నారు.
బీసీ అభ్యర్థులకు 2014 ఎన్నికల్లో 32 స్థానాలు కేటాయించిన కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో 24 మందికే టికెట్ ఇచ్చిందని, రాబోయే ఎన్నికల్లో ఇలాంటి అన్యాయాన్ని సహించేది లేదని పార్టీలోని బీసీ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్థానం మాత్రమే అన్‌రిజర్వుడ్, మరోవైపు మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఒక స్థానం మాత్రమే రిజర్వ్డ్గా ఉంది. ఇటువంటి చోట్ల బీసీలకు ఏ ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారో స్పష్టత లేకుండా ప్రకటనలకే పరిమితం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ‘రెడ్లపార్టీ’ అని ముద్రపడడం ఖాయమని పార్టీలోని కొందరు నేతలే బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నేను రెడ్డినైతే ఎప్పుడో సీఎం అయ్యేవాడినని సీనియర్ నేత హనుమంత్‌రావు, చేసిన విమర్శలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని స్పష్టమౌతోంది. బీసీలో వస్తున్న చైతన్యాన్ని, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను గమనించే పార్టీలోని సీనియర్ నేత అయిన శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలని, వారికి సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.
బీసీ కార్డును కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించడం కూడా పార్టీకి నష్టం చేకూరుస్తోందని కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు భావిస్తున్నారు. బీసీలకు మద్దతుగా మీడియా సమావేశంలో మాట్లాడే అగ్రనేతలంతా ముందుగా తమ సీట్లను త్యాగం చేసి బీసీలకు అవకాశం కల్పిస్తే వారి చిత్తశుద్ధిని నమ్మే పరిస్థితి వస్తుందని లేనిపక్షంలో కేవలం బీసీలను మభ్యపెట్టడానికే వారి ప్రకటనలు మిగిలిపోతాయనే భావన ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, మహేష్‌కుమార్ గౌడ్ తదితర బీసీ నేతలు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. టిక్కెట్ కేటాయింపులు స్థాయిలోనే వీరు ముఖ్యమంత్రి పదవికి పోటీపడకుండా అడ్డుకోవాలని ఇతర సామాజికవర్గ నేతలు కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు భావిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలతో సమానంగా బీసీలకు ప్రాధాన్యతివ్వాలని గత మే నెలలో జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన ‘ఉదయ్‌పూర్’ డిక్లరేషన్‌ను తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాలని బీసీ నేతలు అధిష్టానం దృష్టికి తెస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న వేళ, డిక్లరేషన్లతో పాటు పార్టీ తరపున బీసీ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించడంతోపాటు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బీసీ సీఎం నినాదంతో బీజేపీ:
బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదు. దానికి విరుద్ధంగా తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలనే వాదన రాష్ట్ర బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ‘బీజేపీ అంటే బీసీ’, ‘బీసీ అంటే బీజేపీ’ అని ప్రచారం చేస్తే పార్టీకి మేలు జరుగుతుందనే భావన కొంతమంది నేతలు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే అగ్రకులాల వారే సీఎం అని, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే సీఎం అని బీజేపీ ప్రచారం చేస్తే రాజకీయంగా లబ్ది పొందవచ్చని ఒత్తిడి తీసుకొస్తున్నారు.
‘‘మీరు రాష్ట్రంలో పార్టీ పురోగతికి బాగా కష్టపడ్డారని..’’ బండి సంజయ్‌ను మోదీ, అమిత్‌షా అభినందిస్తూనే ఆయనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని పార్టీలోని బీసీ సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందినరాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని తొలగించి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తరువాత, అధికారంలోకి వస్తే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటిస్తే ఎంత వరకు నమ్ముతారనే అభిప్రాయం కూడా పార్టీలో ఉంది.
బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే ప్రకటన వెనుకకూడా పార్టీలో కొత్తగా చేరి, ఆ పదవిపై కన్నువేసిన ఒక అగ్రనేత పథకం ప్రకారం చేస్తున్నారనే భావన పార్టీలోని అగ్రవర్ణాల నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. బీజేపీలో మొట్టమొదటి నుండి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని వున్న బీస ీనేతలు బండిసంజయ్, డా.కె.లక్ష్మణ్ వంటి వారు ఉండగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బూరానర్సయ్య గౌడ్, 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్ తదితర నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. వీరిలో బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరివైపు మొగ్గుచూపుతుందో వేచిచూడాలి.
2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆ కూటమి తరఫున 23 స్థానాలను బీసీలకు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆ సామాజిక వర్గానికి తక్కువ స్థానాలు కేటాయించింది. 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 33 స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. గతానికి భిన్నంగా రాబోయే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు పార్టీ టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు కోరుతున్నారు. ‘బ్రాహ్మణ`బనియా’ పార్టీగా ముద్ర పడిన బీజేపీలో జాతీయ స్థాయిలో మొట్టమొదటిగా అప్పటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గోవిందాచార్య, ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్‌ను, మధ్యప్రదేశ్‌లో ఉమాభారతి వంటి బీసీ నేతలకు ప్రాధాన్యతిచ్చి పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఆయన మొదలుపెట్టిన సోషల్ ఇంజనీరింగ్ తరువాత కాలంలో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపికి సత్ఫలితాలను ఇచ్చింది. ఆయన చేసిన ప్రయోగాన్నే తెలంగాణలో కూడా చేయాలని తెలంగాణ బీసీ నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.
బీసీలకు సీఎం, డిప్యూటీ సీఎం పదవుల కన్నా ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో అన్ని పార్టీలు న్యాయం చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కనీసం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 నుండి 4 అసెంబ్లీ స్థానాలు కేటాయించి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం చేసినప్పుడే బీసీలపట్ల వారికున్న చిత్తశుద్ధి వెల్లడికావడంతోపాటు సామాజిక న్యాయం జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇప్పటివరకూ తెలంగాణ అసెంబ్లీలో బీసీ సామాజిక ఎమ్మెల్యేల సంఖ్యను పరిశీలిస్తే 2004లో 17 మంది, 2009లో 25 మంది, 2014లో 20 మంది, 2018లో 22 మంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీల తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో బీసీ కార్డుతో పబ్బం గడుపుకోకుండా బీసీ సామాజిక నేతలు కోరుతున్న విధంగా జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే టికెట్ల కేటాయింపులోనే సరైన చర్యలు తీసుకోవాలని పార్టీలకతీతంగా బీసీ నేతలు, ప్రజలు కోరుతున్నారు.
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,