ప్రజలను దెయ్యమై పీడిస్తున్న జగన్: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది.. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్ కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్ ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘’విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ సమస్య మీద జగన్ కేంద్ర పెద్దలతో మాట్లాడలేడు. వారి వద్దకు వెళ్లి సొంత గనులు కేటాయించమని అడగలేడు. ఎందుకంటే భయం. విపరీతమైన భయం. చుట్టూ అవినీతి కేసులు… హత్యలు చేయించిన చరిత్రలు… భూములు కాజేసిన ఘనతలు ఉన్న వాడికి భయం కాక ఇంకేం ఉంటుంది..? కానీ నేను కేంద్ర పెద్దలతో మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే, ఢిల్లీ వెళ్లి నాకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిశాను. స్టీల్ ప్లాంటు అనేది కేవలం ఓ పరిశ్రమ కాదని, 32 మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్న భావోద్వేగ అంశమని కేంద్ర పెద్దలకు తెలియజేశాను. వైసీపీ  పార్టీకి 22 మంది ఎంపీలను ఇచ్చినా ఒక్కసారి కూడా కనీసం పార్లమెంటులో తన సభ్యుల చేత ప్ల కార్డులు పట్టించలేకపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంటు మనకు ఎంత అవసరమో చెప్పలేకపోయాడు. 1970ల నుంచి మూడు తరాలుగా విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అనే నినాదాన్ని ఇప్పటికీ మన గుండెల్లో ఉండిపోయింది. దాన్ని కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అంటే.. చట్టసభల్లో మాట్లాడాలి అంటే తగిన ఎంపీల బలం నాకు లేకపోయింది.ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా  నేను చెప్పిన మాట వింటారు.. ఆలకిస్తారు. అయితే చట్టసభల్లో ఈ అంశాలపై మాట్లాడే అవకాశం జనసేనకు లేకపోయిందని పవన్ చెప్పుకొచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంటు సమస్యపై ప్రాధేయపడటానికైనా సిద్ధం ..

ప్రజలు నెత్తిన పెట్టుకున్న వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో నోరు ఎత్తరు… కనీసం మాట్లాడరు. చివరకు నన్ను మాట్లాడమని సలహా ఇస్తారు. నేను కచ్చితంగా ప్రజలకు సంబంధించిన సమస్య కోసం ఎవరినైనా కలిసి మాట్లాడతాను. అవసరం అయితే ప్రాధేయపడతాను… చివరికి అదీ కాకుంటే కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని అయినా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా నా శక్తి మేరకు కృషి చేస్తానని పవన్ స్పష్టం చేశారు.జగన్ తన కేసుల కోసం, తన పనుల కోసం, కుటుంబసభ్యుల కోసం, కాంట్రాక్టుల కోసం కాళ్లు పట్టుకుంటారే తప్ప… జనం సమస్య మీద కాదు. నేను జనం కోసం పని చేస్తాను. వారికి సమస్య వస్తే దేనికైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. 2019లో  ఎంతగానో అభిమానించే నరేంద్ర మోదీనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విబేధించిన వాడిని… అలాగే అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా పాలసీలను వ్యతిరేకించి బయటకు వచ్చిన వాడిని. నాకు ప్రజలే మొదటి ప్రాధాన్యం. వారి సమస్యలే మొదటి అంజెండా అని వివరించారు. కేంద్ర పెద్దలు ప్రజలకు సంబంధించిన సమస్యలు చెబితే కూలంకషంగా వింటారని తెలియజేశారు. ప్రధానమంత్రి , హోంమత్రి, ఇతర పెద్దలు సైతం ప్రజల సమస్యలపై మాట్లాడితే కచ్చితంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిగత, స్వలాభం సమస్యల మీద మాట్లాడితేనే వారు దగ్గరకు రానివ్వరని… వైసీపీ నాయకుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రజల సమస్యల మీద మాట్లాడితే కదా… అక్కడున్న వారికి తెలుస్తుంది. ఎప్పుడైనా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడారా? అని పవన్ నిలదీశారు.

 రాష్ట్ర ఎంపీలు మన పరువు తీస్తున్నారు..

ఏ ఒక్క రోజు ప్రజా సమస్యల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద పల్లెత్తు మాట మాట్లాడని రాష్ట్ర ఎంపీలపై ఢిల్లీ వర్గాల్లో ఓ రకమైన భావన ఉందన్నారు పవన్. ఎంపీలంతా వ్యాపారులు, పైరవీకారులే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరని ఢిల్లీ పెద్దలు భావిస్తారని  అన్నారు. ప్రజా పాలసీలు, విధానాలు మన ఎంపీలకు పట్టవని కేంద్ర పెద్దలు అనుకుంటారని.. తమిళనాడులోని సేలం ఉక్కు పరిశ్రమను రక్షించుకోవడానికి  రాజకీయ పక్షాలన్నీ ఏకమై జరిపిన పోరాటం విజయం సాధించాయని గుర్తు చేశారు.ఒడిశా ప్రజాప్రతినిధుల ఐక్యతతో అక్కడికి నిధులు సాధించుకుంటున్నారని.. మన ఎంపీలు మాత్రం ప్రజా సమస్యలు మీద  మాట్లాడిన పాపనపోవడం లేదన్నారు. సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంటు కచ్చితంగా లాభాల్లోకి వస్తుందన్నారు. ప్రైవేటు స్టీలు కంపెనీలకే ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తుంటే, లక్షలాది మందికి దారి చూపే విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు కేటాయించరో మన ఎంపీలు ఒక్కసారి కూడా అడగలేదన్నారు. అసమర్థులు, అవినీతి పరులు చట్టసభల్లోకి వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుందని.. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అంశం గురించి మాట్లాడితే కేంద్రం పెద్దలు చెప్పింది విన్నారని.. దానిని కాపాడుకోగలిగామని.. ఇప్పుడు కూడా నిజాయతీగా పనిచేసే నాయకులను ఎన్నుకొని విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకుందామని పిలునిచ్చారు.. రానున్న ఎన్నికల్లో నోట్లకు ఓట్లు వేయొద్దని.. భవిష్యత్తు కోసం బలంగా నిలబడేవారి పక్షాన నిలబడండని జనసేనాని విజ్ఞప్తి చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole