Keralalandslide: వయనాడ్ విపత్తు వేళ రాకీయాలు అవసరమా రాహుల్ అండ్ ప్రియాంక..?

Nancharaiah merugumala senior journalist:

వయనాడ్‌ విషాదానికి, రాజీవ్‌ చావుకూ ఏమైనా పోలిక ఉందా?నరేంద్రమోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’!

‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ బాధితులను చూస్తే..నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్న మాటలివి.‘‘నా అన్నకు కలిగిన బాధే నన్నూ పీడిస్తోంది,’’ అని పక్కనే ఉన్న ప్రియాంక అందుకున్నారు. రాజకీయాలు మాట్లాడడానికి ఇది సందర్భం కాదంటూనే రాజకీయ హత్యగా పరిగణించే తండ్రి రాజీవ్‌ అసహజ మరణం గురించి రాహుల్‌ గుర్తుచేశారు.

2019–2024 మధ్య ఐదేళ్లూ వయనాడ్‌ ఎంపీగా ఉండి, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి గెలిచాక ఈ సీటుకు రాహుల్‌ రాజీనామా చేసినా– అది రాయ్‌బరేలీ తర్వాత నెహ్రూ–గాంధీ కుటుంబ ఆస్తిగా మారిపోయింది. అంతేకాదు, ముస్లింలు, క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో ఉండే వయనాడ్‌ స్థానానికి రాబోయే ఉప ఎన్నికలో ప్రియాంక పోటీచేస్తుందని కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అన్నాచెల్లెళ్ల పై మాటలు చూస్తే ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందే వారు ఎన్నికల ప్రచారం చేయడానికి కొండ చరియలు విరిగిపడ్డాయా? అన్నట్టుంది వ్యవహారం. వీలు చిక్కినప్పుడల్లా అయ్యమ్మ ఇందిరాగాంధీ ప్రాణత్యాగం, తండ్రి రాజీవ్‌ బలిదానం గురించి పదేపదే గుర్తుచేసే సోనియా, రాహుల్, ప్రియాంకా శ్రమ ఊరికే పోదు. 2029లోనో లేదా 2034లోనే రాహుల్‌ ప్రధాని అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని మరపించేలా తన మాటలతో భారత ప్రజలను కనీసం పదేళ్లయినా మైమరపిస్తారనుకోవచ్చు. ఇటీవల లోక్‌సభలో, బయటా పద్మవ్యూహం సహా అనేక విషయాలపై రాహుల్‌ చేసిన ప్రసంగాలు వేగంగా పదునెక్కుతున్న ఆయన నాలుకుకు అద్దంపడుతున్నాయి. ప్రస్తుత గుజరాతీ ప్రధాన మంత్రిని మించిపోయేలా రాహుల్‌ హావభావాలు, బాడీ లాంగ్వేజ్, నాటకీయత అప్పుడే దేశ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని అయ్యే నాటికి రాహుల్‌ రూపం కూడా నరేంద్ర మోదీ మాదిరిగానే పూర్తిగా నెరిసిన గడ్డం (ఇప్పటిలా మీసానికి నల్ల రంగు వేయకపోతే), బూడిద రంగు కనుబొమ్మలతో కనిపించి ‘బయలాజికల్‌ మేధావి’లా దర్శనమిస్తారనడంలో సందేహం లేదు.

2024 లోక్‌సభల్లో కాంగ్రెస్‌ బలం 99కి పెరిగి రాహుల్‌ గుర్తుంపుపొందిన ప్రతిపక్ష నేత అయ్యాక ఆయన నుంచి ఉబికి వస్తున్న దూకుడు చూస్తే ఇలాంటి ఆలోచన కలుగుతోంది. ఏదేమైనా 2004 నుంచి మొదలైన తెల్ల గడ్డాల ప్రధానుల పాలన మన్మోహన్‌ సింగ్, నరేంద్రమోదీతో ముగియదని, ఈ తరహా ప్రధానుల జాబితాలో రాహుల్‌ గాంధీ కూడా చేరతారనే నమ్మకం జనంలో నెమ్మదిగా బలపడుతోంది.

Related Articles

Latest Articles

Optimized by Optimole