Muslims: ముస్లిం పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు..?

Allahabad: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్ఖన్‌కు పెళ్లయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ముస్లిం. ఆ మహిళలిద్దరూ ముస్లింలు. రెండో భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని, ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కేసు అలహాబాద్ హైకోర్టు దాకా చేరింది. 2020లో మొదలైన కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏమని?

ఆ పెళ్లిని రద్దు చేయలేమని, పర్ఖన్‌కు ఇద్దరూ భార్యలే అవుతారని కోర్టు పేర్కొంది. ఎందుకు? ముస్లిం చట్టాల ప్రకారం భార్యల్ని సమానంగా, సౌకర్యవంతంగా చూసుకున్నంత కాలం ఓ ముస్లిం పురుషుడు నాలుగు పెళ్లిళ్ల వరకూ చేసుకోవచ్చు. వారి పెళ్లి ఆ చట్టాల ప్రకారమే జరిగింది. వారి పెళ్లికి అధికారిక అర్హత ఉంది. కాబట్టి ఆ పెళ్లిని తాము రద్దు చేయలేమని హైకోర్టు పేర్కొంది. ముస్లింల బహుభార్యత్వానికి చారిత్రక కారణం ఉందని, వారి సాంస్కృతిక అంశాలను షరియత్ చట్టం, 1937 ప్రకారమే విచారించాలని తెలిపింది. అయితే బహుభార్యత్వ అవకాశాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది.

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఎక్కడా చర్చ జరగడం లేదు. ఇది ప్రాధాన్య అంశం కాదనుకున్నారో, లేదా ఇందులో వేలెత్తి చూపాల్సిన అంశం లేదని భావించారో తెలియదు. కానీ ఒక స్త్రీ తాను మోసపోయాయని కోర్టును ఆశ్రయిస్తే, మతచట్టాలు నీకు అనుకూలంగా లేవని ఆమె అభ్యర్థనను తిరస్కరించడం నిజంగా విచారించాల్సిన అంశం. ముస్లింల బహుభార్యత్వానికి చారిత్రక కారణం ఉందని కోర్టే చెప్పింది. కానీ ఇవాళ ఆ అవసరం ఉందా, లేదా అని కోర్టు తేల్చలేదు. కానీ మనం చర్చకు పెట్టొచ్చు. ట్రిపుల్ తలాఖ్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఎన్నో పోరాటాలు, చర్చల తర్వాతే ట్రిపుల్ తలాఖ్ రద్దయింది. దీనివల్ల ఎంతోమంది ముస్లిం మహిళలకు మేలు జరిగింది. మగవారికి తలాఖ్ విధానంపై స్పష్టత ఏర్పడింది. దుర్వినియోగం చేసేవారి సంఖ్య తగ్గింది. బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే, నిందితులపై చర్యలు తీసుకునే వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. మరి ఈ బహుభార్యత్వం విషయంలో రావాల్సినంతగా ఇంకా నిరసనలు రాకపోవడం విచిత్రం. యుద్ధాలు భీకరంగా జరిగే కాలంలో పురుషుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా బహుభార్యత్వాన్ని ప్రతిపాదించి ఉండొచ్చు. యుద్ధాల సమయంలో స్త్రీలు పరాయి రాజ్యాల పాలు కాకుండా ఈ అంశం పెట్టి ఉండొచ్చు. ఇది కేవలం ముస్లింలకే పరిమితం కాదు. హిందువుల్లో కూడా కొందరు గతంలో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారు. కానీ ఇవాళ ఆ అవసరం ఏముంది?

బహుభార్యత్వం కారణంగా స్త్రీల మనోవేదన, గౌరవభంగం, పిల్లలకు సామాజికంగా ఇబ్బందులు, దాయాదుల గొడవలు మినహా నిజంగా ఒనగూరే ప్రయోజనం ఏముంది? ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే పద్ధతిని మొదలుపెట్టుకున్న తర్వాత బహుభార్యత్వం జోలికి వెళ్లడం దేనికి? మతగ్రంథం కూడా నాలుగు పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చింది తప్ప తప్పకుండా చేసుకోవాలని సూచించలేదు. ఆధునికకాలంలో చాలామంది ఒక వివాహానికే మొగ్గుచూపుతున్నారు.

‘ఫలానా ఆవిడ ఆయనకు రెండో భార్య’, ‘వాళ్లా.. ఆయన మూడో భార్య పిల్లలు’ అని మాట్లాడుకోవడం ఎంత అవమానకరంగా ఉంటుంది. పైగా రెండో, మూడో భార్యగా వెళ్లే స్త్రీకి ఏ మేరకు గౌరవం ఉంటుంది? వారి పిల్లలకు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ప్రస్తుత కాలంలో చదువుకున్న అమ్మాయిలు అలా రెండో భార్యగా వెళ్లేందుకు అంగీకరిస్తారా? కేవలం మతగ్రంథం చెప్పిందని ఎంతమంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని రెండో భార్యగా పంపుతారు? మతపెద్దలైనా ఒప్పుతారా? ఇన్ని అంశాలున్న ఈ అంశంపై మరింత చర్చ చేయాల్సిన అవసరం ఉంది.

PS: ఉమ్మడి పౌరస్మృతి(Union Civil Code) అమల్లోకి తేవడమే ఈ సమస్యలకు పరిష్కారమనే ముక్తాంపుకు రాకండి. ఉమ్మడి పౌరస్మృతి అనేది అత్యంత చర్చనీయాంశం. అంత సులభంగా దాన్ని అమలు చేస్తే ఇతర మతాలతోపాటు హిందువుల్లోని అల్పసంఖ్యాక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. పైగా ఈ దేశంలో ‘ఉమ్మడి’ అనేది ఎవర్ని సూచిస్తుందో, ఎవరికి వర్తిస్తుందో స్పష్టత రావాల్సి ఉంది. లేకపోతే ఉమ్మడి పౌరస్మృతిలో ఎవరూ మాంసం తినొద్దు, అందరూ పూజలు చేయాలి, అందరూ సంస్కృతం నేర్చుకోవాలనే నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అటు దిక్కు మొగ్గకండి.

– విశీ(వి.సాయివంశీ)

Optimized by Optimole