Telangana: ముగ్గురికీ ‘స్థానికం’ మీటా-కట్టా..!

Telangana:

వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. సెప్టెంబరు లోపు పంచాయితీ ఎన్నికలు జరపాలని హైకోర్టు నిర్దేశించింది. కొనసాగుతున్న వేర్వేరు కోర్టు కేసుల్ని బట్టి… ఇదే దిశలో జడ్పీటీసీ-ఎమ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలూ జరుగుతాయి. అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల్లోనూ అప్పుడే వేడి మొదలైంది. తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు… సానుకూల అంశాలు ఆశ పుట్టిస్తుంటే ప్రతికూల విషయాలు భయపెడుతున్నాయి. ప్రజాక్షేత్రాన్ని లోతుగా పరిశీలిస్తే ముగ్గురిదీ ‘కట్టా-మీటా’ పరిస్థితే! అనుకూలతల్ని నిలబెట్టుకుంటూ, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడాన్ని బట్టే వారివారి విజయావకాశాలు. ప్రజలతో నేరుగా సంబంధాలకు, స్థానిక నాయకత్వం ఎదుగుదలకు, పార్టీల సంస్థాగత విస్తరణకు దోహదపడే ఈ స్థానిక ఎన్నికలు ఎలా చూసినా మూడు పార్టీలకూ ముఖ్యమైనవే! ‘పీపుల్స్పల్స’సర్వే సంస్థ నిర్వహించిన తాజా ప్రజాభిప్రాయ సేకరణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. అవేమంటే…

స్థానిక ఎన్నికలు అధికారపక్షం కాంగ్రెస్ కు సవాల్ అయితే విపక్ష బీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్ష! ఒక విధంగా జీవన్మరణ సమస్యే! ఇక బీజేపీకి బలనిరూపణకొక అవసరం, అంతకు మించి అవకాశం. సర్వేలో వెల్లడవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి రాష్ట్రమంతటా ఏకరీతి రాజకీయ వాతావరణం లేదు. ఉత్తరతెలంగాణ ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లలో గ్రామీణంలోనూ బీజేపీ ప్రాబల్యం పెరుగుతోంది. ఉమ్మడి మెదక్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ తిరిగి బలపడుతున్న సంకేతాలున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గండ జిల్లాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఆధిపత్యం విస్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజల నాడిని పరిశీలిస్తూ పీపుల్స్ పల్స్ నిర్వహించే ‘ట్రాకర్ పోల్ సర్వే’ స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగనుంది.


ప్రతికూలతలు తగ్గించుకుంటేనే….
స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కారు పరంగా పూర్వరంగం సిద్దం చేస్తూనే రాజకీయంగానూ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఎల్బీ స్టేడియం సమ్మేళనం ద్వారా స్థానిక ఎన్నికల శంఖారావం పూరించినట్టైంది. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణుల్ని పెద్ద సంఖ్యలో ఒక చోటకు చేర్చి. కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారితో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేసింది. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది-సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, దానికి ముఖ్యంగా మంత్రిమండలి బాధ్యత తీసుకోవాలని సీఎం, పీసీసీ నేత ఇటీవలే కోరారు. ఓ అరడజన్ సానుకూల అంశాలు స్థానిక ఎన్నికల ప్రచారంలో కీలకమౌతాయని నాయకత్వం భావిస్తోంది. 1. కులగణన, 42 శాతం బీసీల రిజర్వేషన్, 2. తాము పంపిన బీసీ బిల్లును ఆమోదించక కేంద్రం మోకాలడ్డుతోందనే ప్రచారం. 3. సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ తదితరాంశాలతో పాటు 18 మాసాల్లో చేపట్టిన ప్రజాహిత చర్యల్ని వివరించడం, 4. ఎస్సీల వర్గీకరణ చట్టంతో పాటు మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యంతో ‘సామాజిక న్యాయం’ ఫోకస్! 5. కేంద్రం వివక్ష చూపినా, రాష్ట్రానికి సహాయనిరాకరణ చేస్తున్నా… తాము సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నామనడం, 6. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి-అక్రమాలపై రాజీలేకుండా దర్యాప్తులు జరిపించడం….. వంటి అంశాలతో ప్రచారానికి పదును పెట్టాలన్నది నాయకత్వ భావన. కానీ, రాష్ట్రంలో వాతావరణం ‘అంతా అనుకూలం’ ఏం లేదు. మంత్రివర్గంలో చోటు దక్కని అసంతృప్తుల అలకలున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి, కొండా కుటుంబం గొంతెత్తడం వంటి చికాకులున్నాయి. ప్రతి జిల్లాలో ఏదోరకమైన పంచాయితీలు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ నాయకులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) వేయడం విభిన్న సంకేతాలిస్తోంది. స్థానిక ఎన్నికల్లో సానుకూలత పెరగాలంటే… ఈ ప్రతికూలతల్ని కాంగ్రెస్ తగ్గించుకోవాల్సిందే!


తీరు మారకుండా… తీర్పు మారేనా!?
స్థానిక ఎన్నికల ముంగిట్లోనయినా బీఆర్ఎస్ నాయకత్వం తీరు మార్చుకోకుంటే ప్రజా విశ్వాసం తిరిగి పొందటం కష్టం. జనాభిప్రాయాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో కాస్త మెరుగుపడిన పరిస్థితి కనిపిస్తున్నా… అది స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూడాలి. ప్రీ-ఫైనల్ వంటి ఈ ఎన్నికల్లో ఏ గట్టి నినాదంతో, ఆశావహ సందేశంతో ప్రచారానికి వెళ్లాలో స్పష్టత లేని పరిస్థితి! 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు, 2024 లోక్సభ ఎన్నికల్లో దక్కిన సున్నా ఫలితం, పట్టభద్రుల-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గనకపోవడం… వంటి పరిస్థితుల నుంచి ఇపుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాల్సిన సందర్భం! ఉద్యమకాలంలోనూ ఉప ఎన్నికల ఆసరాగా రాజకీయ స్థిరత్వం సాధించిన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవడాన్ని ఘోర తప్పిదంగానే పార్టీ శ్రేణులు పరిగణిస్తున్నాయి. కానీ, నాయకత్వం దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ప్రభుత్వం పోయి ఏడాదిన్నర దాటినా అధినేత ఇంకా ఫామ్హౌజ్కే పరిమితమవడం, కార్యనిర్వాహక అధ్యక్షుడు ‘కోటరీ’ బంధీగా, భిన్న ప్రాధాన్యతలతో ఉండటాన్ని ద్వితీయ శ్రేణి నాయకులూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇతర ముఖ్య నేతలకు ఒకరకం సంకెళ్లు వేసి, పరిమితం చేయటంలో అసలు తండ్రీ-కొడుకుల వ్యూహం ఏమిటో పార్టీ శ్రేణుల ఊహకందటం లేదు. ఏమాటకామాట రాష్ట్రవ్యాప్తంగా అనుచరగణం, యంత్రాంగంపై పట్టున్న హరీష్ రావును కేవలం సిద్దపేటకు, మహా అంటే పాత మెదక్ జిల్లాకే పరిమితం చేశారని పార్టీలోనే గుసగుస! ఇటువంటిదే, స్వయంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ జరిగిందంటారు. నిజామాబాద్ మాజీ ఎంపీ అయివుండి, జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి ఎన్నికైన ఆమెను, 2023 ఎన్నికల్లో ‘నిజామాబాద్ స్థానం’ కింది అన్ని కాక కొన్ని సెగ్మెంట్ల ప్రచారానికే పరిమితం చేశారన్న భావన పార్టీవర్గాల్లో ఉంది. ‘తనను జైళ్లో పెడితే… విశ్రాంతి-ఆరోగ్యంపై శ్రద్ద తీసుకొని సన్నబడతానని, తదనంతరం పాదయాత్ర చేస్తానని చెప్పే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు, వారానికోసారైనా నాలుగయిదు గంటలు పార్టీ ఆఫీస్లో కూర్చొని, నాయకులు-కార్యకర్తల్ని కలవాలి, వారి మనసు తెలుసుకోవాల’ని బీఆర్ఎస్ సగటు కార్యకర్త కోరుతున్నాడు. రోజూ నాలుగయిదు గంటలు గడిపే ‘సోషల్ మీడియా’కన్నా ‘సోషల్ ఇంజనీరింగ్’ ప్రాధాన్యత పెంచి, దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలని వారి సూచన! ‘సోషల్ మీడియాకు.. దూరమైతే మంచిద’ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలిన విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకుడొకరు, ‘మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సోషన్ మీడియా పనిగంటలు తగ్గించుకొని, పార్టీ బాగోగులు చూస్తే బాగున్ను’అనడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏ విషయంలోనూ చిక్కక-దొరకక, ఒంటినిండా ఆముదం రాసుకొని ఉంటారని, నాన్నో, బావో, చెల్లెలో కష్టపడి తనను యువరాజుగా కూర్చోబెడితే చాలన్నట్టుంటారని మరో నాయకుడు చేసింది తీవ్రమైన వ్యాఖ్యే!


ఐక్యంగా జనంలోకి వెళ్లడమే కింకర్తవ్యం
పార్టీలోనే పుట్టి, పెరిగి, సిద్దాంత బలమున్న నాయకుడికే తప్ప బయటి నుంచి వచ్చిన నేతలెవరికీ రాష్ట్ర అధ్యక్ష స్థానం ఇవ్వకుండా బీజేపీ జాగ్రత్తపడిరది. కానీ, అదే పని, అభ్యర్థులకు టిక్కెట్లిచ్చే విషయంలో చేయగలదా? ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో అంటే, సమాధానం ‘అసాధ్య’అనే వస్తుంది. ‘తెలంగాణలో మేం అధికారంలోకి వస్తాం’ అని నాయకత్వం తరచూ చెబుతున్నా, అన్ని స్థాయిల్లోనూ పెద్ద సంఖ్యలో అరువు నాయకులకు టిక్కెట్లిస్తే తప్ప నిలువ/గెలువలేని స్థితి. స్థానిక ఎన్నికల్లోనూ ఇది తప్పట్లేదంటే, కింది స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణం ఎట్లా ఉందో తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో మూడోవంతు నెలల్లోనే పార్టీ వీడి పోయారంటే, ‘అరువు’ అభ్యర్థులపై ఆధారపడాల్సిన ‘కరువు’బీజేపీలో ఎంతుందో సుస్పష్టం! నగర-పట్టణ నాయకుడే తప్ప గ్రామీణ పట్టు`తెలంగాణ ఉద్యమ అనుబంధం అంతగా లేవని విమర్శ ఎదుర్కొనే పార్టీ కొత్త నేత రాంచందర్రావుకు స్థానిక ఎన్నికలక సవాల్! ‘బీసీ సీఎం’ ప్రకటించిన పార్టీగా, ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ విసిరే బీసీ నినాదాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి! పార్టీలో ముగ్గురు ముఖ్య నేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్, డా.లక్ష్మణ్ లను సమన్వయం చేసుకుంటూ కొత్త అధ్యక్షుడు ఐక్యత సాధించాలి. ఏ ఒక్కరి ప్రభావంలోకో వెళితే పార్టీ నిర్వహణ కష్టమే! రేపు ఏర్పడబోయే రాష్ట్ర కార్యవర్గంలో, ముఖ్యంగా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల్లో తమ అనుయాయుల పెద్ద వాటా కోసం సీనియర్లు యత్నించొచ్చు. అందుకు ఆస్కారం ఉందని, కొత్త అధ్యక్షుడిని అభినందిస్తూ వచ్చిన పత్రికా (వాణిజ్య) ప్రకటనల్లోనే సంకేతాలున్నాయి. ఈ విషయంలో రాంచందర్రావు జాగ్రత్తలు తీసుకోకుంటే, రాష్ట్ర పార్టీలో ఐక్యత డొల్ల! ‘ఒకసారి వీళ్లనూ చూద్దాం’ అనే సానుకూలత బీజేపీపై సాధారణ జనంలో కొంత ఉంది. ప్రజల్లోకి వెళ్లి ఐక్యంగా జనహిత కార్యక్రమాలు నిర్వహిస్తేనే స్థానిక ఫలితాల్లో పార్టీ ముద్ర సాధ్యం. 2019 ఎన్నికల్లో బీజేపీ సాధించిన 9 జడ్పీటీసీలే ఇప్పటివరకు గరిష్టం.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ… మూడు పార్టీల్లోనూ స్థానిక ఎన్నికల విషయంలో తీపి, చేదు పరిస్థితులున్నాయి. ఒకరి ప్రతికూలత మరొకరి సానుకూలతా మారొచ్చు. అందుకే, ప్రతికూలతల్ని తగ్గించుకొని సానుకూలత పెంచుకోవడమే ముగ్గురికీ విజయ సూత్రం!

…………..

దిలీప్ రెడ్డి,
 పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ.

Optimized by Optimole