Kollywood: షూటింగ్ స్టంట్ మాస్టర్ రాజు మృతి..!!

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి స్టంట్ దర్శకత్వం వహిస్తున్న రాజు, ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఆ సన్నివేశం సమయంలో అదుపుతప్పిన వాహనం తీవ్రంగా ఢీకొనడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ దుర్ఘటనపై తమిళ నటుడు విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ‘‘రాజు సార్ మరణం నమ్మశక్యంగా లేదు.. చాలా ధైర్యంగా రిస్క్ తీస్కొని పని చేసే వ్యక్తి. ఆయన పట్టుదలనీ ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.

సినీ పరిశ్రమలో అనేకమంది ప్రముఖ నటీనటులతో పాటు, టెక్నీషియన్లూ రాజు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల నిర్వహణలో తనదైన ముద్ర వేసిన స్టంట్ మాస్టర్ రాజు ఆకస్మిక మృతి చిత్ర యూనిట్‌తో పాటు తమిళ సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Optimized by Optimole