విశీ:
ఏ దేశంలో అయినా మైనార్టీల(మత/భాష/సాంస్కృతికపరమైన) పరిరక్షణ ఆ ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రపంచంలో చాలా చోట్ల అది సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ దేశంలోనూ అదే పరిస్థితి, పక్క దేశమైన బంగ్లాదేశ్‌లోనూ అదే స్థితి. అక్కడ హిందువులు మతపరమైన మైనార్టీలు. ప్రస్తుతం వారు అభద్రతలో ఉన్నారు. ఈ సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన ఆ దేశ ప్రభుత్వం(?) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం.
1947లో అప్పటి తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్)లో 30 శాతం ఉన్న హిందూ జనాభా ఇవాళ 9 శాతానికి పడిపోయింది. అందులో ఎక్కువశాతం భారతదేశానికి వచ్చేయగా, మతమార్పిడులు, దాడులు వంటి కారణాలు కూడా హిందువుల జనాభాను తగ్గించాయి. ఢాకా యూనివర్సిటీ ఆర్థికవేత్త అబుల్ బర్కత్ లెక్కల ప్రకారం, రోజుకు 632 మంది హిందువులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారని అంచనా. దీనికితోడు ఏటేటా అక్కడ ముస్లింల జనాభా పెరగడంతో మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 1971లో లౌకికవాద రాజ్యంగా అవతరించిన బంగ్లాదేశ్ 1988లో 8వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్లాంను ఆ దేశ అధికారిక మతంగా ప్రకటించింది. ఆ దేశంలోని ఇతర మతాలకు ఇది పెద్ద దెబ్బగా మారింది. చట్టాలన్నీ ముస్లింలకు అనుకూలంగా మారి, ఇతర మతస్థులు ద్వితీయశ్రేణిలోకి జారిపోయారు. 2010 ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, లౌకికవాదాన్ని ఆ దేశ రాజ్యాంగం నుంచి తొలగించలేరని, అది ఆ దేశ మూలసూత్రమని పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రత విషయంలో అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని మతసంస్థలతో కలిసి మైనార్టీల మీద కుట్రలు పన్నుతోందని స్థానికంగా కొన్ని సంస్థలు ఆరోపించినా వాటికి ఏ సమాధానమూ దొరకలేదు. ఉద్యోగాల విషయంలో, చదువు విషయంలో, ఇతర వ్యవహారాల సమయంలో ముస్లింలు ఇతర మతస్తులపై (ముఖ్యంగా హిందువులపై) వివక్ష చూపుతున్నారని, రావాల్సిన అవకాశాలు రాకుండా చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అనేకమంది పేర్కొన్నా పరిస్థితిలో మార్పు రాలేదు. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ విషయాలను ‘లజ్జ’ నవలతో బయటపెట్టగా ఆమె మీద ఫత్వా జారీ చేసి మరీ ఇబ్బందులకు గురిచేశారు.
ఇటీవల షరీఫ్ ఉస్మాన్ హదీ అనే 32 ఏళ్ల ఇంకిలాబ్ మోంచో నేతను కొందరు దుండగులు ముసుగులతో వచ్చి కాల్చి చంపారు. ఆ వార్తతో దేశం అట్టుడికిపోయింది. నిందితులు భారత్‌లో దాక్కున్నారని, వారికి భారత్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తున్నారు. వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గొడవలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ సమయంలో దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఇస్లాంను అవహేళన చేశాడంటూ అతనిపై మూకదాడి చేసి చంపేశారు. అది అవాస్తమని, అతనా మాట అనడం ఎవరూ వినలేదని విచారణలో తేలింది. హిందూ సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 10 మంది నిందితులను అరెస్టు చేశామంటూ ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కంటి తుడుపు చర్య చేపట్టింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని 1.3 కోట్ల హిందువుల పరిస్థితిపై అంతా ఆందోళన నెలకొంది. ఏ క్షణాన తమ మీద మూకదాడి జరుగుతుందోనని వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. బంగ్లాదేశ్‌లోని అస్థిరమైన ప్రభుత్వం వారికి ఏ మేరకు రక్షణ కల్పించగలదనేది అతి పెద్ద సందేహం. అందుకే అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకూడదని ఇప్పటికే భారత్ వారికి ప్రకటన జారీ చేసింది. ఈ స్థితిని పాకిస్థాన్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని, కాబట్టి సమస్యను త్వరగా పరిష్కరించాలని నిపుణులు అంటున్నారు.
‘ఇంత జరుగుతుంటే వారు అక్కడ ఉండటం ఎందుకు? భారత్‌కు వచ్చేయొచ్చు కదా?’ అని కొందరు అభిప్రాయపడొచ్చు. అయితే అది వారి మాతృదేశం. వారు తాత, ముత్తాతల కాలం నుంచి అక్కడే ఉన్నారు. ఇక్కడికి రావడం ద్వారా ప్రాణాలు నిలుపుకోగలరు తప్ప వారి అస్థిత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైగా వారికున్న భాష, సాంస్కృతిక పరిధులు కూడా వారిని బెంగాల్ వరకే పరిమితం చేయగలవు. ఇప్పటికే విద్య, ఉపాధి, ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నవారు ఇక్కడికి వచ్చి కొత్త జీవితాలను ప్రారంభించాలంటే సమస్యలు తప్పవు. అయినా వారు వారి సొంత దేశాన్ని వదిలి రావాల్సిన అవసరం ఏంటి? ఆ దేశం వారిది. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. అదే ఇప్పుడు అందరం కలిసి చేయాల్సిన డిమాండ్.
