Nancharaiah Merugumala (senior journalist)
=============================
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారే! గుత్తా, తమ్మినేనికి మునుగోడు సంపన్న ఎమ్మెల్యేతో ఏం పని?
–––––––––––––––––––––––––––––––
అన్నయ్నను, తనను లోక్‌సభ, అసెంబ్లీల్లోకి పంపించిన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వదిలిపోవాలనే టైమింగ్ మునుగోడు హస్తం శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కుదరడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆత్మబంధువు లేనప్పుడు రాజకీయాలు వారికి అలవాటైన కాంట్రాక్టులంత తేలిక కాదు. ఈ విషయం నల్లగొండ బ్రదర్స్ కు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి మరణానంతరమే బోధపడింది.
2014 లోక్ సభ ఎన్నికల్లో తాను భువనగిరిలో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్న వెంకట్ రెడ్డి నల్గొండలో తొలిసారి పరాజయాలు చవిచూశారనే వాస్తవం రాజగోపాలుడికి ఇంకా గుర్తుంది. అయితే, అదృష్టం బాగుండి కోమటిరెడ్ల సొమ్మే మొదటిసారి భువనగిరిలో ఓడిన రాజగోపాల్ ను ఎమ్మెల్సీని చేసింది. అసెంబ్లీకి ఓడిన ఆరు నెలల లోపే అన్న వెంకన్నను 2019 ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం పార్లమెంటుకు పంపింది. ఇప్పుడు మనకు ఈ పాత కతంతా అనవసరం.
ఈ మధ్య కాంగ్రెస్ నుంచి భాజపాలోకి దూకుదామనే ఆలోచన రాజగోపాల్ కు రెండోసారి వచ్చింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న కాషాయపక్షంలోకి ఫిరాయించాలనకున్న ప్రతిసారీ చిన్న కోమటిరెడ్డి చెప్పే మాట ఒకటే–‘ తెలంగాణలో బీజేపీ బలపడుతోంది,’ అని. ఈ విషయం తనకు మాత్రమే తెలుసని, కేంద్ర మంత్రి అమిత్ షాకు కూడా తెలియదని అన్నట్టు ఆయన మాట్లాడేస్తాడు. వైఎస్ హయాంలో 2004–2009 మధ్య కాలంలో రాజకీయ వాలులో ప్రయాణం ప్రారంభించిన అన్నదమ్ముల ‘రాజకీయ కష్టాలకు’ ఎప్పుడు తెరపడుతుందో మరి.
మళ్లీ ఈసారి బీజేపీ బలోపేతమౌతుందనే పాట రాజగోపాల్ ఎత్తుకోగానే మీడియా ఆయనకు వంత పాడడం ఆరంభించింది. ‘రాజగోపాల్ కొద్ది రోజుల్లో బీజేపీలో చేరిక, శాసనసభ్యత్వానికి రాజీనామా, ఫలితంగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక’ వంటి కథనాలతో పత్రికలు, తెలుగు న్యూస్ చానళ్లు తెలంగాణ జనానికి మరోసారి వినోదం పంచే విఫలయత్నం చేశాయి.
ఉప ఎన్నికొస్తే మునుగుతాడన్న మండలి అధ్యక్షుడు గుత్తా,
కాదు, కాంగ్రెస్ లోనే ఉండే పోరాడమన్న తమ్మినేని
–––––––––––––––––––––––––––––––
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న సంపదో, వారి ‘మంచితనమో’, వారికి ఉన్న కాంటాక్టులు లేదా కాంట్రాక్టులో తెలియదుగాని వారికి కాంగ్రెస్ లో కన్నా ఇతర పార్టీల్లోనే దొడ్డ మనసున్న శ్రేయోభిలాషులు ఉన్నారని ఈరోజు తెలుగు దినపత్రికలు చదివితే తెలిసింది. పెద్ద మనసున్న ఈ అమాయక అన్నదమ్ములకు ఒక్క నల్లగొండ రెడ్లలోనే కాదు, ఖమ్మం జిల్లా కమ్మ కామ్రేడ్లలోనూ ఆయన క్షేమం గురించి ఆలోచించి సలహా ఇచ్చేటోళ్లు ఉన్నారు.
‘‘శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే రాజగోపాల్ మునిగిపోతాడు. ఉప ఎన్నికలో గెలవడు. బై ఎలక్షన్ లో టీఆరెస్ గెలుస్తుంది.’’ అంటూ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తోటి సంపన్న రెడ్డి రాజకీయ నేతకు, సొంత పార్టీ తెరాసకూ అనుకూలంగా ఒకే నాలుకతో మాట్లాడారు. రెడ్ల ఆధిపత్యానికి, అహంకారానికి పెట్టని కోట అయిన నల్లగొండ జిల్లా రెడ్లు రాజకీయ ఎత్తుడలు, నేలబారు తెలివితేటల్లో పూర్వపు కరీంనగర్, వరంగల్ జిల్లా బ్రాహ్మణ కాంగ్రెస్ నేతల కన్నా ఏమాత్రం తక్కువ కాదని సుఖేందర్ రెడ్డి గారి మాటలు నిరూపిస్తున్నాయి. తన తెలివైన వ్యాఖ్యలతో తమ నేత సీఎం కే చంద్రశేఖర్ రావుగారిని, నల్లగొండ జిల్లా రెడ్డి మహాజనులను ఏకకాలంలో మెప్పించే ప్రయత్నం చేశారు పెద్దల సభాధ్యక్షుడు గుత్తా గారు. ఎంతైనా తన బంధువు సూదిని జైపాల్ రెడ్డి గారి పదునైన గుణాలను సుఖేందర్ రెడ్డి గారు పుణికిపుచ్చుకున్నారనిపిస్తోంది.
అసలు కోమటిరెడ్లు ఏ గంగలో దూకితే…కమ్యూనిస్టులకు ఏమైతది?
–––––––––––––––––––––––––––––––––––––––––
ఎక్కడ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఓడిపోయి రెడ్ల పరువు ప్రతిష్ఠలను మంటగలుపుతాడోననే భయం ఉమ్మడి నల్లగొండ రెడ్డి జననేత సుఖేందర్ రెడ్డి సాబ్ ను వెంటాడుతున్నట్టు ఆయన మాటలు సూచిస్తున్నాయి. సరే, ఇదేదో ఒకే జిల్లా రెడ్ల రాజకీయం అనుకుందాం. ఈ రెడ్డి మోతుబరి నేతల మధ్య ఆమాత్రం అవగాహన లేదా కోఆపరేసన్ ఉండొచ్చు.
మరి తెలంగాణ సీపీఎం (పేరు మర్చిపోలేదు కదా– అదే మార్క్సిస్టు పార్టీ) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు అనవసరంగా మునుగోడు గొడవ లేదా కోమటిరెడ్ల పీకుళ్లాటలో వేలుపెట్టారు. 1989లో ఒకేసారి ఖమ్మం నుంచి లోక్ సభకు గెలిచిన ఈ అమాయకపు కామ్రేడ్ వీరభద్రం గారు నిన్న అసలు బుర్రలేదనే రీతిలో మాట్లాడడం మా వంటి ఆయన పూర్వ శ్రేయోభిలాషులకు బాధ కలుగుతోంది. ఒకసారి ఖమ్మం ఎమ్మెల్యేగా కూడా ఐదేళ్లు పనిచేసిన వీరభద్రం గారి బుర్ర అసలు పనిచేస్తోందా? అనిపిస్తోంది.
‘‘మునుగోడు నియోజకవర్గ ప్రజలేం తప్పుచేశారని రాజగోపాల్ శాసనభ్యత్వానికి రాజీనామా చేస్తాడు? కాంగ్రెస్ లో ఉంటూనే కేసీఆర్ తో కొట్లాడవచ్చు. మతతత్వ భాజపాలో చేరాల్సిన అవసరం కోమటిరెడ్లకు ఏముంది?’’ అని తమ్మినేని వీరభద్రం చౌటుప్పల్ విలేకరులతో అన్నారంటే మనం ఏమనుకోవాలి. అసలు ఏ ఒక్క కమ్యూనిస్టు పార్టీకీ ప్రాతినిధ్యమే లేని తెలంగాణ అసెంబ్లీలోకి ఎలా జొరబడాలో ఆలోచించడం లేదు సీపీఎం నేత. సంపన్న కాంగ్రెస్ రెడ్లను భాజపాలోకి పోకుండా ఎలా నివారించాలి? తెలంగాణలో లౌకికతత్వాన్ని, మతసామరస్యాన్ని ఎలా కాపాడాలి? వంటి తమకు సంబంధం లేని, తమ శక్తికి మించిన అజెండాను భుజానేసుకోవడం ఇకనైనా తెలంగాణ కమ్యూనిస్టు నేతలు మానుకుంటే శ్రామికవర్గానికి ఎంతో మేలు జరుగుతుంది. మా ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న లంగర్ హౌజ్ సమీపంలోని గొల్లకొండపై కొడవలి–సుత్తి తెల్ల రంగులో కనిపించే ఎర్ర జెండా ఎగురుతుంది.