ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ
ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు నిదర్శనమన్నారు . ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మంచి ఫలితాలను సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాగా కొత్త ఏడాది ఏప్రిల్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందన్నారు రఘురామ. జూలై, ఆగస్టు మాసంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చని హెచ్చరించారు. ఎన్నికలలో ఎన్నో ప్రలోభాలు పెట్టే అవకాశం ఉందన్న రఘురామ.. ఓటుకు ఎంత ఇచ్చిన.. ప్రభుత్వం చెత్త పన్ను, ఇంటి పన్ను రూపంలో జనాల నుంచి వసూలు చేసిన దాని కంటే చాల తక్కువే ఇస్తారన్నారు. దుష్ట మనసుతో వైసిపి నేతలు ఇచ్చేది పుచ్చుకొని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు.
ముందస్తు ఎన్నికలకు సవాలక్ష కారణాలు..
ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డికి సవాలక్ష కారణాలు ఉన్నాయన్నారు రఘురామ. పర్యావరణ అనుమతులు కూడా లభించని పోర్టుల నిర్మాణం పేరిట అప్పులు చేసి ఈ ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. పోర్టుల నిర్మాణ ప్రగతిని పరిశీలించాకే..అప్పు మొత్తాన్ని దశలవారీగా విడుదల చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం తో పాటు, అవసరమైన వారందరికీ తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహణ కు వక్రమార్గాలలో అప్పులు పుట్టకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా, జగన్మోహన్ రెడ్డికి మరొక ప్రత్యామ్నాయం లేదని రఘురామ కుండ బద్దలు కొట్టారు.