కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఉత్తరాయణం అనంతరం వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున వైకుంఠవాకిళ్లు తెరచుకొంటాయి.భక్తులు వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించుకుంటారు.
‘హరివాసరమం ‘..
అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడన్నది పురాణ కథ. ఇక ఉత్తరద్వారం గుండా వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను..దివి నుంచి భువికి దిగి వచ్చి.. గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్నే ‘హరివాసరమని’.. ‘హరిదినమని’..’వైకుంఠ దినమని’ కూడా అంటారు.
ప్రాచుర్యంలో ఉన్న కథలు…
ఇక వైకుంఠ ఏకాదశి..మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకాదశి వ్రతం” ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయని భక్తుల నమ్మకం. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామిని శరణు వేడుతారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ప్రాణ భయంతో ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించేందుకు..స్వామి ఉపాయం పన్ని గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి.. విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే.. మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరింస్తుంది. ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ‘ఏకాదశి’ అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని కొలవడం ఆనవాయితీగా వస్తోంది.
అంతేకాక దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ పర్వదినాన విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదు.