Nancharaiah merugumala:( senior journalist)
===========
భారత జాతీయ జెండాను ఒంటి నిండా కప్పుకున్న గౌతముడిని ఎవరు కాపాడతారు?
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తాను దిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో (1966–77, 1980–84) తనపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు–‘ ఇది ఇండియాపై దాడి. భారత దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బదీయడానికి ఇది విదేశీ శక్తుల కుట్ర,’ అని విరుచుకుపడేవారు. ఇప్పుడు అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండన్ బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధనాంశాలపై అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే గౌతమ్ అదానీ గ్రూపు కూడా దాదాపు 40 ఏళ్ల నాటి ఇందిరమ్మ మార్గాన్నే ఎంచుకుంది. అప్పట్లో కాంగ్రెసేతర పార్టీలను (నాటి ప్రతిపక్షాలు) దేశభక్తిలేని శక్తులుగా, అమెరికా, ఇతర ఐరోపా దేశాల చేతుల్లో కీలుబొమ్మలుగా ఆమె అభివర్ణించేవారు. ప్రతిపక్షాలన్నీ నెహ్రూగారమ్మాయి దృష్టిలో దేశవ్యతిరేక శక్తులే. కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా ఇందిర మార్గాన్నే ఈ విషయంలో ఎంచుకుంది. అయితే, ప్రపంచం, దేశం నాలుగు దశాబ్దాల నాటి హీన స్థితిలో లేవు. ప్రజలు కాస్త చైతన్యవంతులయ్యారు. అయినా, అదానీ గ్రూపునకు నేడు నాటి ఇందిరమ్మ పద్ధతే దిక్కు అయింది. తమ కంపెనీల తప్పుల్ని నాథన్ ఆండర్సన్ నేతృత్వంలోని సంస్థ ‘ఎత్తిచూపడం’ భారతదేశంపై దాడిగా అది వర్ణిస్తోంది. అందుకే ఆదివారం అదానీ జవాబులోని లోపాలను వెల్లడిస్తూ హిండన్ బర్గ్ ఒక ప్రకటన చేసింది.
‘భారతదేవం ఒక సచేతనమైన ప్రజాస్వామ్య దేశం. ఉజ్వల భవిష్యత్తుతో అగ్రదేశంగా అవతరిస్తున్న దేశం ఇండియా అని మేం నమ్ముతున్నాం. భారతదేశ భవితవ్యానికి అదానీ గ్రూపు కీడు చేస్తోందని కూడా మేం విశ్వసిస్తున్నామని స్పష్టం చేయదలిచాము. అదానీ గ్రూపు ఓ పక్క భారత జాతీయ జెండాను కవచంలా ఒంటి చుట్టూ కప్పుకుని ఉంటూనే మరో పక్క దేశాన్ని లూటీ చే స్తోంది,’ అని హిండన్ బర్గ్ కుండబద్దలు కొట్టింది.