జగన్ హాయంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం : నాదెండ్ల మనోహర్
విజయవాడ ఏపీలో వైసీపీ ప్రభుత్వం భయంకరమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి.. కోడి పెట్టల గురించి, కోడి గుడ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేబినెట్ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయంపట్నం, కావలిల్లో జిందాల్ సంస్థకి ఎందు భూములు కేటాయించారు? దీని వెనుక ఏం జరిగింది? ముఖ్యమంత్రికి జిందాల్ సంస్థతో ఉన్న ఒప్పందం ఏంటో వెల్లడించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
కాగా ముఖ్యమంత్రి జగన్ హాయంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మనోహర్ ఆరోపించారు. చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలను దారి మళ్లించి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారన్నారు. రైతాంగాన్ని అవమానపర్చారని వాపోయారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లకుండా ఒక తరానికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాన్ని చేతులారా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పెట్టుబడులు తీసుకువస్తామని చెబుతున్నా ఈ ప్రభుత్వం అక్కడ ఉన్న మౌలిక వసుతుల్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని మనోహర్ ప్రశ్నించారు.