తెగిన శరీరాల అతుకు!

 

‘అబ్బో…. కుటుంబపు మనిషే!’ అనుకున్నారు అంతా ఆయన్ను చూసి. అంతా అంటే…? చుట్టూ స్టేడియం నిండా కిక్కిరిసి, విరగపడి పోయిన లక్ష మందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కోట్ల మంది. తెల్లవారాక పేపర్లలో, టీవీల్లో, వెబ్సైట్ లలో, ఇంకా ఎన్నెన్నో సామాజిక మాధ్యమ వేదికలపైనా… ఆయన్ని- ఆయననల్లుకున్న కుటుంబాన్నీ చూసిన కోటాను కోట్లమంది. మన దివంగత కమ్యూనిస్టు ఉద్యమనేత భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి ఎపుడో అన్నట్టు… ‘అది, తెగి విడిపోయి మళ్లీ కలిసిన శరీరాల అతుకు…’ ఆ ఉద్విగ్నత అలాంటిది మరి! కన్న కొడుకును ఊరించి ఊరించిన ఇరవయేళ్ల ఓ కల, ఎట్టకేలకు నెరవేరిన వెంటనే… కన్నీళ్లతో వచ్చి కౌగిలించుకున్న అమ్మ సెలియా మారియా సందిట్లో ఆ ఆరడుగుల పొడగరి లియోనెల్ మెస్సీ (35) చిన్న పిల్లాడై కరిగిపోయాడు. నిశ్శబ్దంగానే బావురుమని నిలువునా కన్నీరయ్యాడు. ఉబికి వచ్చిన ఆతని కన్నీళ్లతో ఆమె భుజం తడిసింది. రెండున్నర గంటల యుద్దంలో ఒడిసిన మెస్సీ శరీరపు చెమటలో కలగలిసిపోయాయి… అమ్మ సెలియా కంట ఒలికిన ఆనంద బాష్పాలు. అదే వరుసలో… ఆయన భార్య ఆంటొనెల్లా రొకొజ్జో, ముద్దులొలికే ముగ్గురు తనయులు థియాగో, మ్యాటియో, కైరో …. ఒక్కసారిగా వచ్చి మెస్సీని కమ్మేశారు. కండలు తేరిన ఆయన అథ్లెటిక్ శరీరానికి తీగల్లా అల్లుకున్నారు.

 

 

 

 

 

 

 

బాల్య స్నేహితురాలు, ఓ స్నేహితుని కజిన్ అయిన ఆంటొనెల్లా నిజానికి మెస్సీ వయసు అయిదేళ్లప్పట్నుంచే అతనితో చేయి కలిపింది. “లియో మెస్సీ, ఇన్నేళ్ల నీ స్వప్నం, దానికోసం నీవు పడ్డ శ్రమ, అనుభవించిన వేదన…. అన్నీ మాకు తెలుసు. ఏమైతేనేం, సాధించావు. ఏ విషయంలోనైనా కడవరకు పోరాడాలి తప్ప, మధ్యలోనే చేతులెత్తొద్దు, అని నీవు మాకు నేర్పిన పాఠాలకు థాంక్స్” అంటూ స్పందించింది. అన్నీ తానై మెస్సీ, అర్జెంటీనా కోసం ఫీఫా ప్రపంచ కప్ గెలిచిన వెంటనే, ఆమె తక్షణ స్పందన అది. దోహా వేదికగా ఖతర్ లో నెల రోజుల పాటు సాగిన ఫుట్బాల్ భీకర పోరు చివర్లో… ఫైనల్లో (3-3 డ్రా మీద) ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ (4-2) లో అర్జెంటీనా నెగ్గిన కొన్ని నిమిషాల్లో, మైదానంలోనే ఆవిష్కృతమైన భావోద్వేగ, ఉద్విగ్న భరిత కుటుంబ దృశ్యమిది. అంతకు రెండ్రోజుల ముందే, మెస్సీ పెద్ద కొడుకు థియాగో (10) రాసిన ఓ చిరు ఉద్వేగపు లేఖను, ఆ బుడతని తల్లి ఆంటొనెల్లా మీడియాకు విడుదల చేశారు. దావానలంలా అది విశ్వవ్యాపితమైంది. అతనా లేఖ తన తండ్రికి రాయలేదు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీకి రాశాడు. ‘మీరు విజేతలవుతారు. మా మద్దతు మీకుంది. మీరు పడుతున్న కష్టాలు, మీ ప్రాధాన్యతలు మాకు తెలుసు. వాటిని మేం గౌరవిస్తాం…..’ అంటూ సాగుతుందీ బుల్లి లేఖ! కప్పు గెలిచిన, మైదానంలోనే కుటుంబమంతా తనను కలిసిన ఆనంద క్షణాల్లో మెస్సీ కూడా ఎంతో ఉద్వేగభరితంగా స్పందించారు. ‘నా యీ పోరాటంలో ఎల్లవేళలా సహకారం అందించిన కుటుంబానికి, ఎవరికి వారు వ్యక్తులుగా కాక, ఒక బృందంగా… లక్ష్యం సాధించే చొరవ, చేవ ఉన్న నా జట్టుకు, మా మీద విశ్వాసం ఉంచిన వారికి, ఎవరి కలనైతే మేం కన్నామో… ఆ మొత్తం ఆర్జెంటీనియన్లకీ ధన్యవాదాలు. మేమిప్పుడు ఛాంపియన్లము. అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్లము’ అంటూ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆ దిగ్గజం సహృదయంతో స్పందించారు.
దటీజ్ మెస్సీ…. !
దటీజ్ ద పవర్ ఆఫ్ ఫ్యామిలీ!!
లాంగ్ లైఫ్ ఫ్యామిలీ!!!

===============

ఆర్ దిలీప్ రెడ్డి

పీపుల్స్ పల్స్ డైరెక్టర్

Related Articles

Latest Articles

Optimized by Optimole