జనసైనికులపై దాడి హేయమైన చర్య: నాదెండ్ల మనోహర్
Jansena: ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక చేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే పెడన నియోజకవర్గం, ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ సంబంధీకులు దాడి చేసిన ఘటన దురదుష్టకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక ఎందుకు అందడం లేదో..ఇతర రాష్ట్రాలకు ఇసుక ఎందుకు తరలిపోతోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు దోచుకుంటూ మరో వైపు పంచతంత్ర కథలు చెబుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. బుధవారం పెడన నియోజకవర్గం, గూడూరులో వైసీపీ శ్రేణుల చేతిలో దాడికి గురైన జనసేన పార్టీ నాయకులు బత్తిన హరిరామ్, సమ్మెట గణపతి, రామకృష్ణ తదితరులను పరామర్శించారు. దాడి సందర్భంగా తగిలిన దెబ్బలను పరిశీలించారు. అండగా ఉంటామని జన సైనికుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాలుగు రోజుల క్రితం గూడూరు మండలం, ఆకుమర్రు గ్రామంలో జరిగిన సంఘటనలో గాయపడిన పార్టీ నాయకులకు ధైర్యం నింపేందుకు ఇక్కడకు వచ్చానని అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్న జన సైనికుల్ని దుర్మార్గంగా చెట్టుకి కట్టేసి గంటసేపు నిర్భంధించి.. కొట్టిన ఘటనపై ప్రతి ఒక్కరూ ఖండించాలని మనోహర్ పేర్కొన్నారు.
ఒక్కో నేత నెలకు రూ.20 కోట్ల దోపిడీ..
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు మనోహర్. పేదలకు లారీ ఇసుక అందించలేని ప్రభుత్వం.. తమ నాయకుల జేబులు నింపేందుకు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వాటాలు పంచేసిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక్కో నేత నెలకి రూ. 20 కోట్లు సంపాదించుకునే ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. ఈ ఇసుక దోపిడి గురించి జనసేన పార్టీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందన్నారు. అడ్డుకున్న వారిని ఇలా భయబ్రాంతులకు గురి చేసి కేసులు పెడుతూండటం దుర్మార్గమని మనోహర్ ఆక్రోశంతో ఊగిపోయారు.